‘అలవలపాడు దళితవాడలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు వేస్తూ మధ్యలో ఆపేశారు. ఇలాగైతే ఎలా? ఇప్పుడు ఇక్కడ బోరు బావి తవ్వి నీటిని పైకి రప్పించే వరకు ఇక్కడే ఉంటా.
వేంపల్లె : ‘అలవలపాడు దళితవాడలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు వేస్తూ మధ్యలో ఆపేశారు. ఇలాగైతే ఎలా? ఇప్పుడు ఇక్కడ బోరు బావి తవ్వి నీటిని పైకి రప్పించే వరకు ఇక్కడే ఉంటా. అప్పటిదాకా అన్నం, నీళ్లు ముట్టను’ అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దళితులతో కలిసి బైఠాయించారు. వేంపల్లె మండలం అలవలపాడులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నిధులతో రూ.2.50 లక్షలతో అలవలపాడు హరిజనవాడకు తాగునీరు అందించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఈనెల 1న గ్రామ శివారులో ఉన్న వంకపొరంబోకు స్థలంలో ఎంపీటీసీ సభ్యుడు గజ్జెల రామిరెడ్డి బోరు తవ్వించడం ప్రారంభించారు. 325 అడుగులు వేసిన తర్వాత.. సమీపంలో ఉన్న బోర్లలో నీరు అడుగంటుతాయని కొందరు ఫిర్యాదు చేశారని తహశీల్దార్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు వేంపల్లె ఎస్‌ఐ హాసం పనులు ఆపేశారు.
దళితవాడలో నీటి సమస్య తీవ్రతరమవడంతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తహశీల్దార్ శ్రీనివాస్, ఎస్‌ఈ శ్రీనివాసులు మాట్లాడారు. బోరు బావి తవ్వకాన్ని కొనసాగించాలని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బోరు బండి అక్కడికి వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వివేకా.. ఉదయం 10 గంటలకు ఆ గ్రామానికి చేరుకున్నారు.
బోరు తవ్వకం పూర్తి అయ్యే వరకు తాను ఇక్కడి నుంచి కదలనని, అన్నం, నీళ్లు ముట్టనని చెప్పి బైఠాయించారు. స్థానిక అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి బోరు తవ్వకం పూర్తి చేశారు. నీళ్లు పైకి రాగానే వివేకా.. ఓ బాటిల్‌లో పట్టుకుని తాగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వివేకా చొరవ వల్ల నీటి సమస్య తీరిందని దళితవాడ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం సాయంత్రం.. సాంకేతిక అనుమతులు, వర్క్ ఆర్డర్ లేకుండా వేశారనే కారణంతో ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ మోహన్, ఏఈ మధుసూదన్, ఆర్‌ఐ సుధీర్‌లు బోరును సీజ్ చేశారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.