జలం జీవాధారం. నీరు లేని చోట జీవితం లేదు. ఎక్కడ దాహార్తి ఉందో... అక్కడే సేవ ఉండాలి... -భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
అనంతపురం జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ట్రస్టు నిధులు సమకూరుస్తుందని శ్రీ సత్యసాయి బాబా 1994లో ప్రకటించారు. నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రూ.300 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1995 నవంబర్ 18న ప్రారంభించారు.

దివిజ గంగను భువికి దించిన భగీరథుడు ఎంతటి లోకోపకారం చేశాడో, శ్రీ సత్యసాయిబాబా కూడా తాగునీటికి అల్లాడుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు అంతటి ఉపకారం చేశారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 1051 గ్రామాలకు; తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 452 ఎత్తయిన ప్రాంతాలు, గిరిజన ఆవాసాలకు, చెన్నై నగరానికి తాగునీటిని అందించడానికి సత్యసాయి గంగ ప్రాజెక్టును, నీటిశుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల దాహార్తి తీరుతోంది.

అనంతపురం తాగునీటి సరఫరా ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్‌లోని కరవుపీడిత జిల్లా అనంతపురం. దేశంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండోప్రాంతం అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో ప్రవహించే పెన్నా, హగరి, చిత్రావతి నదులు వేసవిలో ఎండిపోతాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటమే కాకుండా, నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల ఇక్కడి ప్రజలలో శారీరక వైకల్యాలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండేవి. ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం నీరు తెచ్చుకోవడానికి చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఫలితంగా విపరీతమైన అలసటకు లోనై కీళ్లనొప్పులతో బాధపడేవారు.
అనంతపురం జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ట్రస్టు నిధులు సమకూరుస్తుందని శ్రీ సత్యసాయి బాబా 1994లో ప్రకటించారు. రూ. 300 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 1995 నవంబర్ 18న ప్రారంభించారు. దీనిని 1997 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణల కోసం లార్సెన్ అండ్ టూబ్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండువేల కిలోమీటర్ల పొడవున వివిధ పరిమాణాల్లోని పైప్‌లైన్‌లు వేశారు. దాదాపు 100,000 లీటర్ల నుంచి 2,500,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 43 సంపులు నిర్మించారు. అలాగే,3,00,000 లీటర్ల నుంచి 10,00,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 18 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కొండల పైభాగంలో నిర్మించారు.
వీటికి తోడు 270 ఓవర్‌హెడ్ రిజర్వాయర్లను, 125 గ్రౌండ్–లెవల్ రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లో 2500 లీటర్ల సామర్థ్యం కలిగిన 1500 కంటే ఎక్కువ ప్రీకాస్ట్ కాంక్రీట్ సిస్టెర్న్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి సిస్టెర్న్‌లో ప్రజలు నీటిని సేకరించడానికి నాలుగు కుళాయిలు ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందిన ఈ భారీ ప్రాజెక్టు కింద 731 గ్రామాలకు ఉచితంగా తాగునీరు సరఫరా అవుతోంది.
భారత ప్రభుత్వం తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక పత్రం ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తూ ట్రస్ట్‌కు ఒక ప్రశంసాపత్రాన్ని అందించింది, ఆ ప్రశంసాపత్రంలో ‘శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఏ రాష్ట్ర బడ్జెట్ మద్దతు లేకుండా, సొంతంగా ఒక ప్రాజెక్టును అమలు చేయడంలో అసమానమైన ఉదాహరణగా నిలిచింది, ఇది 731 నీటిఎద్దడి, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని కొన్ని పట్టణాలకు దాదాపు 18 నెలల కాలపరిమితిలో ప్రయోజనం చేకూర్చేలా రూ. 300 కోట్ల్ల వ్యయంతో ఒక భారీ నీటి సరఫరా ప్రాజెక్టు’ అని శ్లాఘించింది.
గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో సత్యసాయి బాబా చేసిన నిరుపమానమైన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వ తపాలా శాఖ 1999 నవంబర్ 23న ఒక తపాలా బిళ్ళను, ఒక పోస్టల్ కవర్‌ను విడుదల చేసింది.
జపాన్‌లోని ఒసాకాలో 2003లో జరిగిన మూడవ ప్రపంచ జల వేదికలో సత్యసాయి నీటి ప్రాజెక్టును ప్రస్తుతిస్తూ ఒక ప్రతినిధి దీనిని కేస్ స్టడీగా మాత్రమే కాదు, మానవాళికి ప్రేమను పంచే కథగా కూడా చూడాలని కొనియాడారు. మెక్సికోలో 2006లో జరిగిన నాలుగో ప్రపంచ జల వేదికలో ఈ ప్రాజెక్టు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన మిలీనియం అభివృద్ధి లక్ష్యాలకు దోహదపడే అత్యుత్తమ పది స్థానిక కార్యాచరణలలో ఒకటిగా ఎంపికైంది.
సత్యసాయి గంగ కాలువ
తమిళనాడు రాజధాని చెన్నై (అప్పటి మద్రాస్), దాదాపు 1.19 కోట్ల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరం . ‘డెట్రాయిట్ ఆఫ్ ఆసియా’గా పేరుపొందిన చెన్నై మహానగరం– ఆటోమొబైల్స్, బీపీఓ, సాఫ్ట్‌వేర్, డేటా సెంటర్లు, వస్తూత్పత్తి, వైద్య పర్యాటకం, ఫిన్ టెక్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. ఈ నగరంలో 2004 డిసెంబర్ వరకు తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. ప్రజలు మంచినీటి కోసం కుళాయిల వద్ద బారులు తీరి ఉండేవారు.
చెన్నై నగరానికి సమీపంలో ప్రధాన నదులేవీ ప్రవహించవు. అందువల్ల చెన్నై పంతొమ్మిదో శతాబ్ది చివరి రోజుల నుంచి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉండేది. 2004 సంవత్సరానికి ముందు నగరంలోని కొన్ని ప్రాంతాలు వేసవిలో ఒక్కోసారి వరుసగా మూడు రోజులు నీటి సరఫరా లేకుండా ఇబ్బంది పడాల్సి వచ్చేది. నగరానికి రోజుకు దాదాపు 750 మిలియన్ లీటర్ల నీరు అవసరమైతే, కేవలం 250 మిలియన్ లీటర్ల సరఫరా మాత్రమే ఉండేది.

1960ల ప్రారంభంలో చెన్నై నీటి సమస్యను పరిష్కరించడానికి తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా 15 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి మద్రాసుకు తీసుకువస్తామని ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు తమ వాటా కృష్ణా నీటిలో 5 టీఎంసీలను సమకూరుస్తాయి.
శ్రీశైలం జిల్లాలోని సోమశిల జలాశయం నుండి 150 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయానికి, అక్కడి నుండి చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే తమిళనాడులోని పూండి జలాశయానికి తీసుకెళ్లాలి. కండలేరు, పూండి జలాశయాలను కలిపే కండలేరు–పూండి కాలువను తెలుగు గంగ అని పిలుస్తారు. ఇది 1996లో పూర్తయింది.
అయితే, ప్రణాళికాబద్ధమైన 15 టీఎంసీల నీటిలో, కేవలం 0.5 టీఎంసీ నీరు మాత్రమే పూండి జలాశయానికి చేరుకునేది. మిగిలిన నీరు బాష్పీభవనం, నీరు కారడం, కాలువ గోడల కోత కారణంగా పోయింది. కొన్ని సంవత్సరాల తరువాత కాలువ శిథిలావస్థకు చేరుకుంది. లక్షలాది మంది చెన్నై ప్రజలకు నీటి ఎద్దడి తీవ్రమై, ఈ సమస్యకు పరిష్కారం కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చెన్నై నీటి సమస్యను పరిష్కరించడానికి తాను దృఢ సంకల్పంతో ఉన్నట్లు శ్రీ సత్యసాయి బాబా 2001 జనవరి 19న ప్రకటించారు.
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపట్టిన చెన్నై నీటి ప్రాజెక్టు జూలై 2002లో ప్రారంభమైంది. ఇది చెన్నైకి తగినంత తాగునీటిని సరఫరా చేయడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని దాదాపు 3 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా శిథిలావస్థలో ఉన్న కండలేరు–పూండి కాలువను పునరుద్ధరించి, కండలేరు జలాశయం సామర్థ్యాన్ని పెంచారు. మొత్తం 150 కి.మీ. పొడవున్న కండలేరు–పూండి కాలువలో 65 కిలోమీటర్లు లైనింగ్ వేశారు. వరదలు సంభవించినప్పుడు నీటిని మళ్లించడానికి మూడు ఎస్కేప్ రూట్లను నిర్మించారు.
ఈ ప్రాజెక్టు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, వేగంగా అభివృద్ధి చెందింది. దీని నిర్మాణానికి దాదాపు నాలుగువేల మంది కార్మికులు అహరహం పనిచేశారు. ఈ ప్రాజెక్టు రికార్డు సమయంలో కేవలం పదహారు నెలల వ్యవధిలోనే పూర్తయింది.ఇప్పుడు చెన్నైకి సరఫరా అయ్యే నీరు తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు కండలేరు వద్ద ఉన్న జలాశయం నిండిపోవడం విశేషం. చివరగా బాబా 79వ పుట్టినరోజున– 2004 నవంబర్ 23న, కండలేరు జలాశయం గేట్లు తెరిచారు. ఇది వరకు గేట్లు తెరవగానే ఇక్కడ ఉప్పొంగే జలాలు చెన్నై వరకు 150 కిలోమీటర్లు చేరుకోవడానికి దాదాపు పదిరోజులు పట్టేది.
పునరుద్ధరణ తర్వాత కేవలం నాలుగు రోజుల్లోనే ఈ జలాలు తమిళనాడు సరిహద్దులకు చేరుకుంటుండటం విశేషం. పునరుద్ధరణ తర్వాత నీరు విడుదలైన కొద్ది రోజులకు– 2004 డిసెంబర్ 11న చెన్నై నుంచి పలువురు భక్తులు బాబాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. బాబాకు కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కండలేరు–పూండి కాలువ ప్రాజెక్టును ‘తెలుగు గంగ’కు బదులుగా ‘సత్యసాయి గంగ’గా నామకరణం చేసింది.
శ్రీ సత్యసాయి జాతీయ తాగునీటి మిషన్
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధీకరణ అవసరాలను తీర్చడానికి శ్రీ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో ‘శ్రీ సత్యసాయి జాతీయ తాగునీటి మిషన్’ ఏర్పాటైంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన 177 జిల్లాల్లో తాగునీటి వనరులు మోతాదుకు మించిన ఫ్లోరైడ్‌తో కలుషితమయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి వల్ల దాదాపు 6.2 కోట్ల మందికి పైగా ప్రజలు సతమతం అవుతుండేవారు.
ఈ సమస్యను చక్కదిద్దడానికి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, సెంట్రల్ ట్రస్టు నిధులతో నీటి శుద్ధీకరణ వ్యవస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా 2020 నాటికి ఆరు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో రూ.5.4 కోట్ల పెట్టుబడితో 108 నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నీటి శుద్ధీకరణ కేంద్రాలు నీటి నుంచి కాలుష్య కారకాలైన ఆర్సెనిక్ వంటి భార లోహాలను తొలగించగలవు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో ఈ మిషన్ 10 మండలాల్లోని 350 గ్రామాలకు తాగునీటిని అందించింది, ఈ ప్రాంతంలో 4,40,585 జనాభా ఉంది. ఈ ప్రాజెక్టులో కొండ ప్రాంతాల గుండా పైపులైన్లు వేయడంతో పాటు నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 2018–2019లో కేరళలోని సత్యసాయి సేవా సంస్థ ప్రారంభించిన సత్యసాయి ప్రేమధార ప్రాజెక్ట్ 119 నీటి వడపోత యూనిట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 14 జిల్లాల్లోని దాదాపు 1,65,000 మంది పౌరులకు ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తోంది.
మెదక్, మహబూబ్ నగర్ ప్రాజెక్ట్‌అనంతపురం తాగునీటి సరఫరా ప్రాజెక్టు విజయవంతం అయిన తరువాత, తెలంగాణ రాష్ట్రంలోని (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల ప్రజలకు సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ట్రస్ట్ ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టింది. దాదాపు 320 గ్రామాలు ఈ ప్రాజెక్టుల లబ్ధిదారులుగా ఉన్నాయి.

ప్రాజెక్ట్ వివరాలు
» రూ.300 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలుకు నోచుకుంది.
» దాదాపు 2800 కిలోమీటర్ల పైపులైన్లు వేసి, సుమారు 40 లక్షల మందికి నీటి సరఫరా చేసే సామర్థ్యంతో రూపొందింది.
ముఖ్య నిర్మాణాలు
» పెద్దకోట్లలో హెడ్‌వర్క్స్ నిర్మాణం
» మద్దెల చెరువులో 10 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం
» అప్పరా చెరువు, కృష్ణాపురం రోడ్ క్రాస్, కేశాపురం, కొత్తచెరువు ప్రాంతాల్లో 5 సంపులు
» కొత్తచెరువు (కొండపై), పెదపల్లి, హెచ్‌ఎన్ ఎస్‌ఎస్ టన్నెల్ వద్ద 2 గ్రౌండ్ లెవల్ బాలెన్సింగ్ రిజర్వాయర్లు
» వివిధ ప్రాంతాల్లో 2 ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లు
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వెనుకబడిన కొండ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులు, పేద ప్రజలు బోరుబావులు, వాగుల నుంచి నీటిని పొందుతున్నారు. నిత్యం ప్రవహించే గోదావరి, దాని ఉపనది పాములేరు నుంచి నీటిని సేకరించి, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తూర్పు గోదావరిలోని 212 జనావాసాలలో సుమారు 2,20,000 మందికి; పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 240 జనావాసాలలో 4,70,000 మందికి సురక్షితమైన తాగునీరు అందించడానికి ప్రాజెక్టులను చేపట్టింది . రెండు జిల్లాల్లోని ప్రాజెక్టులు పూర్తిచేసి, 2007 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది.


