స్వచ్ఛ నగరం కలుషితం | Indore faces a severe health emergency as contaminated drinking water | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ నగరం కలుషితం

Jan 3 2026 5:36 AM | Updated on Jan 3 2026 5:36 AM

Indore faces a severe health emergency as contaminated drinking water

‘ఇండోర్‌’ పాపం...తలా పిడికెడు!?

15కు పెరిగిన కలుషిత నీటి మృతులు 

శుక్రవారం మరొకరి దుర్మరణం 

కమిటీ వేసి సరిపెట్టిన ఎంపీ సర్కారు 

10 రోజులవుతున్నా మీనమేషాలే 

బాధ్యుల గుర్తింపు ఊసే లేదు 

కంటితుడుపుగా ఇద్దరి సస్పెన్షన్‌

మధ్యప్రదేశ్‌ రాజధాని ఇండోర్‌. దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా వరుసగా ఎనిమిదేళ్లుగా కితాబు అందుకుంటూ వస్తున్న నగరం. ఆ కీర్తిలోని డొల్లతనాన్ని ఇటీవలి కలుషిత తాగునీటి ఉదంతం కళ్లకు కట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి నల్లాల్లో డ్రైనేజీ, మరుగుదొడ్ల నీరు కలిసి విషంగా మారింది. ఆ నీరు తాగి ఏకంగా 48,400 మంది సమస్యలకు గురయ్యారు. వారిలో 2,800 మందికి పైగా తీవ్ర అనారోగ్యాల పాలయ్యారు. 

అతిసారం బారిన పడి ఓ నవజాత శిశువుతో పాటు కనీసం 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వాంతులు, విరేచనాలతో వందలాది మంది ఆస్పత్రుల్లో చేరారు. వారిలో పదుల సంఖ్యలో విషమ పరిస్థితుల్లో ఉన్నారు. ఐసీయూల్లో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఉదంతం దేశమంతటా సంచలనం రేపింది. తాజాగా శుక్రవారం వారిలో మరొకరు మృత్యువాత పడ్డారు. 

మంచినీటి సరఫరా వ్యవస్థలో మురుగు నీరు కలవడమే దీనంతటికీ కారణమని తాజాగా విడుదలైన ల్యాబ్‌ నివేదికలు కుండబద్దలు కొట్టాయి. ఘోరం జరిగి వారం దాటిపోయినా ఇప్పటికీ బాధ్యులను గుర్తించలేదు. పైగా సమస్య శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యల విషయంలో మోహన్‌ యాదవ్‌ సర్కారులో పెద్దగా చలనం కని్పంచకపోవడం విమర్శలకు తావిస్తోంది. విధానపరమైన నిర్లక్ష్యం, వైఫల్యమే ఈ ఘోరానికి కారణమని తేటతెల్లమవుతున్నా మీనమేషాలు లెక్కిస్తుండటం అస్మదీయులను కాపాడుకునేందుకేనని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నా యి. 

సకాలంలో స్పందిస్తే ముప్పు తప్పేదే 
ఇండోర్‌లో తాగునీటి కాలుష్యంపై నిజానికి నెలల ముందునుంచే పలు రకాల హెచ్చరికలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా మున్సిపల్‌ యంత్రాంగం గానీ, సంబంధిత అధికారులు గానీ కళ్లు తెరవలేదు. అదే ఈ ఘోరానికి ప్రధాన కారణమని తేలుతోంది. ఇండోర్‌లో సరఫరా అవుతున్న మంచినీటి నాణ్యత సరిగా లేదంటూ గతేడాది వందల ఫిర్యాదులందాయి. ముఖ్యంగా, తీవ్రంగా ప్రభావితమైన భగీరథ్‌పురా ప్రాంతం నుంచే 50కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. 

అక్కడి ఆలయం వద్ద తాగునీటిలో డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నట్టు రెండు నెలల క్రితమే ఒకరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంచినీటిలో ఏకంగా యాసిడ్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నట్టు కొద్ది రోజులకే మరొకరు ఫిర్యాదు చేశారు. డిసెంబర్‌ 18కల్లా సమస్య తీవ్రత మరింత పెరిగింది. మంచినీళ్లు రావాల్సిన నల్లాల్లోంచి కంపు వాసన వస్తోందంటూ ఫిర్యాదులు పెరిగిపోయాయి. 

చివరికి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందంటే, డిసెంబర్‌ 28వ తేదీ నాటికి భగీరథ్‌పురాతో పాటు 11వ వార్డులో ఏకంగా 90 శాతం మంది రోగాల బారిన పడ్డారు! చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ అధికారిక ప్రకటన ప్రకారమే కలుషిత తాగునీటి వల్ల 48,400 మంది ప్రభావితులయ్యారు! అయినా అధికారుల్లో చలనమే లేకుండా పోయింది. దీనికితోడు భగీరథ్‌పురాలో పైప్‌లైన్లను మార్చాలని ఏడాది క్రితమే నిర్ణయం జరిగినా, గత ఆగస్టులోనే టెండర్లు కూడా పిలిచినా ఆ తర్వాత అతీగతీ లేకుండా పోయింది. 

తీరా ఇప్పుడు ఘోరం జరగగానే ఆగమేఘాలపై టెండర్లను ఆమోదించి, పైప్‌లైన్ల మారి్పడి పనులు మొదలు పెడుతున్నారు! ఆర్నెల్లుగా ఎంత మొత్తుకున్నా, కాళ్లరిగేలా తిరిగినా పైప్‌లైన్‌ పనులను అధికారులు పట్టించుకోనే లేదంటూ స్వయా నా స్థానిక కార్పొరేటర్‌ కమల్‌ వఘేలా వాపోతున్న పరిస్థితి! ఇంతటి ఘోరానికి బాధ్యులుగా పేర్కొంటూ ప్రభుత్వం కేవలం ఇద్దరు అధికారులను సస్పెండ్, ఒకరిని డిస్మిస్‌ చేసింది. షరామామూలుగానే ఘటనపై సీనియర్‌ ఐఏఎస్‌ సారథ్యంలో త్రిసభ్య కమిటీ వేసి చేతులు దులుపుకుంది! 

పదేళ్లకు పుట్టిన నలుసు
ఆర్నెల్లకే అనంత లోకాలకు!
కలుషిత తాగునీటికి ఆరు నెలల చిన్నారి బాబును కోల్పోయిన సునీల్‌ సాహు కుటుంబం ఆక్రోశానికి అంతులేదు! భార్యకు పాలు పడకపోవడంతో బాబుకు డబ్బా పాలు పడుతున్నారు. ప్రమాదం జరిగిన రోజు పాలలో కాసిన్ని నల్లా నీళ్లు కలిపారు. కాసేపటికే బాబుకు జ్వరం, విరేచనాలు మొదలయ్యాయి. స్థానిక వైద్యునికి చూపించినా లాభం లేకపోయింది. మర్నాడు పెద్దాసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆలస్యమైపోయింది. ‘‘పదేళ్ల ఎదురుచూపుల తర్వాత పుట్టిన బాబు. పట్టుమని పది నెలలు కూడా రాకుండానే నూరేళ్లూ నిండిపోయాయి. కేవలం అధికారుల నిర్లక్ష్యమే మా చిన్నారి మనవన్ని చిదిమేసింది’’అంటూ సాహు తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. బాధితుల బంధువుల్లో ఎవరిని కదిలించినా ఇలాంటి విషాదమే! 

విషం సరఫరా చేశారు: రాహుల్‌ 
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ చేతగానితనానికి ఇండోర్‌ కలుషిత నీటి ఉదంతమే నిదర్శనమని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘ఇండోర్‌లో నల్లాల ద్వారా తాగునీటికి బదులు విషం సరఫరా చేశారు. అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికీ మేల్కొనలేదు. కలుషిత నీరు వస్తోందని నెలల తరబడి ఫిర్యాదులు చేస్తున్నా అటు అధికారులూ పట్టించుకోలేదు. ఇటు అధికార బీజేపీ నేతలూ వినిపించుకోలేదు. తీరా ఘోరం జరిగాక, ఒకరిద్దరు మామూలు ఉద్యోగులను బాధ్యులను చేసి చేతులు దులుపుకున్నారు. చేతగాని పాలనకు మధ్యప్రదేశ్‌ నిదర్శనంగా మారింది’’అంటూ మండిపడ్డారు.

హైకోర్టు సీరియస్‌
ఇండోర్‌ కలుషిత నీటి ఘటనపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీరియస్‌ అయింది. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ మోహన్‌ యాదవ్‌ ప్రభుత్వాన్ని శుక్రవారం మరోసారి నిలదీసింది. బాధిత ప్రాంతాల్లో కానీ ట్యాంకర్లతో శుభ్రమైన తాగునీరు అందిస్తున్నారా అని ప్రశ్నించింది. దాంతో ఈ ఉదంతంపై సర్కారు ఆగమేఘాల మీద స్టేటస్‌ రిపోర్టును కోర్టుకు సమరి్పంచింది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కూడా దీనిపై మోహన్‌ యాదవ్‌ సర్కారుకు శుక్రవారం నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా సవివరమైన నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది.

సిగ్గుచేటు: ఉమా భారతి 
ఇండోర్‌ ఉదంతం నిజంగా సిగ్గుచేటని బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమా భారతి అన్నారు. రాష్ట్ర బీజేపీ సర్కారు పనితీరుపై ఇది చెరపలేని మచ్చ అని ఆమె పేర్కొన్నారు.  మృతుల కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక పరిహారం మరీ తక్కువ అంటూ ఆక్షేపించారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement