
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలి
కేవలం క్వారీ నీటిని తాగడం వల్లే అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి
ఏడాదిగా తాగునీరు మురికిగా వస్తోందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు
ఇంత జరిగినా ఈ సంక్షోభానికి పరిష్కారమే చూపడం లేదు
న్యాయం జరిగే వరకూ గ్రామ ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం
తురకపాలెం గ్రామంలో పర్యటించిన పార్టీ నాయకులు
గుంటూరు రూరల్: తురకపాలెంలో జరిగినవి ప్రభుత్వ హత్యలేనని ఆ గ్రామంలో పర్యటించిన వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. అరుదైన వ్యాధితో దాదాపు 46 మంది ప్రాణాలు కోల్పోయిన గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకులు పర్యటించారు. మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించిన నాయకులు ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘‘అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి కారణంగా గ్రామస్తులు మృతి చెందారని చెబుతున్నప్పటికీ మరణాలకు అసలు కారణాన్ని నేటికి గుర్తించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 46 మంది మృతి చెందితే కేవలం 28 మందికే నామమాత్రంగా రూ. 5 లక్షలు పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవటం దారుణం. కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలి.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలి. గ్రామంలో 24 గంటలు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. కేవలం క్వారీ నీటిని తాగడం వల్లే ఇంతటి దారుణ పరిస్థితి సంభవించింది. ఏడాదిగా తాగునీరు మురికిగా వస్తోందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో గ్రామాన్ని, గ్రామ ప్రజలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. ఇంత జరిగినా ఈ ఆరోగ్య సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారమే చూపడం లేదు.
మాజీ ఎంపీ వైఎస్సార్‌సీపీ కృష్ణా గుంటూరు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్‌రావు, అన్నాబత్తుని శివకుమార్, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జ్, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, డాక్టర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శివభరత్‌రెడ్డి తదితరులు గ్రామంలో పర్యటించిన పార్టీ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
నెలరోజుల్లో మంచినీటి ప్లాంట్
తురకపాలెం దళితవాడలో సురక్షిత మంచినీటి వ్యవస్థ అవసరమని, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఫౌండేషన్ నుంచి ఆర్వో ప్లాంట్‌ను నిర్మించి గ్రామానికి నెల రోజుల్లో ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గుంటూరు నగరం నుంచి పైపులైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.