పతంగులకు కట్టిన దారం.. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ మాంజా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే.. పలువురి ప్రాణాలు బలిగొందీ భూతం. ఈ పండుగ సీజన్‌లోనే ఇరు చోట్ల చైనీస్ మాంజా ధాటికి పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. దీంతో నిషేధిత మాంజా అమ్మకాలు, వాడకంపై కఠిన చర్యలు అమలు కావడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అటు పోలీసు శాఖలు చేపడుతున్న డ్రైవ్స్.. అరకొర ఫలితాలనే ఇస్తున్నాయి..
తెలంగాణలో చైనీస్ మాంజా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్‌లో మాంజా చుట్టుకుని ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు. హైదరాబాద్‌లో ఈ ప్రమాదాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకొక ఘటన చోటు చేసుకుంటోంది. చైనా మాంజా అమ్మినా.. కొన్నా.. ఆఖరికి ఆ మాంజాతో గాలి పటాలు ఎగరేసినా కేసులు పెడుతామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆఖరికి పీడీ యాక్టు ప్రయోగిస్తామన్న ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగానే..

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. చైనీస్ మాంజా విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారు.. ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాల తాలుకా వివరాలతో పూర్తి నివేదికను ఫిబ్రవరి 26వ తేదీలోపు అందజేయాలని కమిషన్ ఆయన్ని ఆదేశించింది.
ఇటు ఏపీలోనూ చైనీస్ మాంజా విషయంలో పోలీసులు చేస్తున్న ప్రకటనలకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనీస్ మాంజా అమ్మినా.. కొన్నా.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో 112కి డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైజాగ్ పోలీసులు మరో అడుగు ముందుకేసి.. చైనీస్ మాంజా ఉన్న 650 గాలి పటాలను సీజ్ చేశారు. మరికొన్ని జిల్లాల్లోనూ పోలీసులు అమ్మేవారిని ఏం చేయలేక.. కొనేవారిని, ఎగరేసే వారిని పట్టుకుని వాళ్ల చేతుల్లోని గాలి పటాలు సీజ్ చేస్తున్నట్లు ప్రచారం జరగుతోంది.

చైనీస్ మాంజాలో.. సింథటిక్ పదార్థాలతో(నైలాన్, ప్లాస్టిక్) తయారు చేసి.. గాజు లేదంటే లోహపు పొరతో దారానికి పూత పూస్తారు. అందుకే ఇది తీవ్రమైన గాయాలు చేస్తుంది. పైగా ఇది పర్యావరణానికి హానికరం(బయోడిగ్రేడబుల్ కాదు). అందుకే భారత ప్రభుత్వం 2017లో చైనా మాంజా (Chinese Manjha)పై నిషేధం విధించింది. తొలుత ఇది చైనా నుంచి దిగుమతి అయ్యేది. అలా దానికి చైనీస్ మాంజా, చైనా మాంజా అనే పేర్లు స్థిరపడిపోయాయి. ఆ తర్వాతి కాలంలో మన దేశంలోనే దీనిని తయారుచేయడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీయల్ అవసరాల కోసం తయారీకి మినహాయింపు ఇచ్చారు. ఇదే అదనుగా కాసుల కక్కుర్తితో చైనీస్ మాంజాను మార్కెట్లలోకి తెస్తున్నారు.
చైనా మాంజా తయారీ.. నిల్వ.. విక్రయం(అమ్మడం) నేరం. ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదంటే రూ.1 లక్ష వరకు జరిమానా ఒక్కోసారి రెండూ విధించవచ్చు. వినియోగం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం.. చైనీస్ మాంజా కారణంగా ప్రమాదాల బారిన పడ్డవాళ్లు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు.


