కోటి ఆశలు.. కొంగొత్త ఆలోచనలు.. భవిష్యత్తుపై ఎన్నో కలలు.. అప్పటి వరకు తల్లిదండ్రులతో గడిపి.. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న
	కోటి ఆశలు.. కొంగొత్త  ఆలోచనలు.. భవిష్యత్తుపై ఎన్నో కలలు.. అప్పటి వరకు తల్లిదండ్రులతో గడిపి.. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఇంతులను వేధింపులు, వరకట్న భూతాలు కాటేస్తున్నాయి. జీవిత భాగస్వామితో నిండు నూరేళ్లూ..జీవించాల్సిన వారు..అంతలోనే తనువు చాలిస్తున్నారు. కట్టుకున్న వారే కాలయముల్లా మారుతుండడంతో పసుపు తాళ్లే..ఉరితాళ్లవుతున్నాయి. అప్పటి వరకూ కళ్లెదుటే..కనిపించిన బిడ్డలు..శవాల్లా మారడంతో..తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నారు. ఇక వ్యాపార లావాదేవీలు.. ఇతర సమస్యలతో బాధపడుతూ..మరి కొందరు తనువు చాలిస్తున్నారు.  అయితే..కష్టసుఖాలు కావడి కుండలని..సమస్యలు ఎదురైనపుడు..పోరాడి విజయం సాధించాలి తప్ప..ఆత్మబలిదానాలు సరికాదని నిఫుణులు చెబుతున్నారు.                                               -న్యూస్‌లైన్,నరసన్నపేట
	 
	 
	  2014 జనవరి 3న భర్త వేధింపులు తాళలేక  నవ వధువు పున్నాన సుజాత (19)  పెళ్లైన నాలుగు నెలలకే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
	 
	  2014 జనవరి 6న నందిగాం  మండలానికి చెందిన దీపిక(20) అత్తింటి ఆరళ్లు తాళలేక రాజమండ్రిలో ఉరి వేసుకుని, ప్రాణత్యాగం చేసుకుంది.
	 
	  గత ఏడాది  డిసెంబరు 21న విజయనగరం జిల్లాకు చెందిన దివ్యశ్రీపై భర్త నడిమింటి సత్యనారాయణ హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
	 
	  డిసెంబర్ 4నలావేరు మండలానికి చెందిన సునీతపై ఆమె భర్త మీసాల భోగినాయుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు.  విషాహారం తినిపించి..చంపాలని ప్రయత్నించడం ఈ ప్రాంతంలో సంచలనమైంది.
	  మరి కొందరు..
	 
	  డిసెంబరు 15న పోలాకి మండలం తలసముద్రం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా  పనిచేస్తున్న గేదెల హరీష్ (29) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
	 
	  నవంబర్ 29న చిన్నపాటి కారణానికి శాసనపురి ఉదయ్‌కుమార్ (30) తాను వ్యాపారం చేస్తున్న పాన్‌షాపులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
	 
	  డిసెంబరు 26న  టెక్కలి మండలం రాధావల్లభాపురం గ్రామానికి చెందిన కోమటూరు లావణ్య ఆత్మహత్య చేసుకుంది.
	 
	  ఇలా చెప్పుకుంటూ.. పోతే.. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. పాశ్చాత్త దేశాల్లో సైతం ఎంతో గౌరవమున్న మన వివాహ వ్యవస్థ చిన్నబోయేలా..వేధింపుల బారిన పడి..నవ వధువులు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే..ప్రతి సమస్యకూ చావే శరణ్యం కాదని, కాస్త సంయమనం పాటించి..జీవితాన్ని నిలబెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  
	 
	 ఆత్మన్యూనతా భావం వల్లే..
	 ఆత్మన్యూనతా భావాన్ని విడనాడితే..ఆత్మహత్యలు తగ్గుతాయి. జాతీయ స్థాయిలో ఒక కమిషన్ జరిపిన సర్వే ప్రకారం..సమాజంలో మూడు రకాలుగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. లక్ష్యాలు చేరుకోలేక కొందరు, అత్తింటి ఆరళ్లు భరించలేక ఇంతులు..టీనేజ్‌లో  ఆశించిన ఫలితాలు లభించక..సహచరులతో పోల్చుకుంటూ..నిరాశకు లోనై  ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ వర్గాలను చైతన్యవంతం చేసి..జీవితంపై ఆశ కలిగేలా చేస్తే..వీరిని ఆత్మహత్యల నుంచి రక్షించవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం, స్వచ్ఛందం సంస్థలు చర్యలు చేపట్టాలి.  
	 - డా.గొలివిమోహన్,  డెరైక్టర్ వాత్సల్య ఆస్పత్రి
	 
	 మానసిక స్థితికి ప్రాణాయామం మేలు
	 క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలే ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. వ్యక్తి మానసిక స్థితిగతులపై ఆధారపడే ఈ అంశాన్ని ఎదుర్కోనేందుకు ప్రాణాయామం ఆయుధం లా ఉపయోగపడుతుంది.    ధ్యానం వల్ల మనసును స్వాధీనంలోకి తెచ్చుకొని ఆలోచన విధానాలను పూర్తిగా మార్చుకునే శక్తి లభిస్తుంది. శరీరంలో మానసిక స్థితిగతుల్లో ఒడిదొడుకులు ఏర్పడితే.. హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పి..నిర్ణయాల్లో మార్పులు సంభవిస్తాయి. ఇటువంటి సమయాల్లో ప్రాణాయామం ద్వారా మేలు చేకూరుతుంది. దీర్ఘ శ్వాస ద్వారా ప్రాణాయామానికి అలవాటు పడిన వారు.. తొందర పాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టి.. విద్యార్థులు, యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీసం వారంలో ఒకసారైనా.. యోగ, ప్రాణాయామం వంటి విషయాలపై శిక్షణ ఇస్తే.. మరింత ఉపయుక్తం.
	 - బి.సుమబాల, పతంజలి యోగా ఉపాధ్యాయిని,
	 నరసన్నపేట
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
