విశాఖ ఏజెన్సీని ముంచెత్తిన వర్షాలు

Huge Rains In Visakha Agency - Sakshi

కొట్టుకుపోయిన కర్లపొదోర్‌ కల్వర్టు 

80 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

స్తంభించిన జనజీవనం 

ప్రమాద స్థాయికి చేరిన డొంకరాయి జలాశయం 

రాష్ట్రంలో నేడు,రేపు అక్కడక్కడా భారీ వర్షాలు 

31న మరో అల్పపీడనం

ఆగస్టు రెండో వారం నుంచి విస్తారంగా వర్షాలు

సాక్షి, అమరావతి/ సాక్షి, నెట్‌వర్క్‌: విశాఖ జిల్లా మన్యంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మండల కేంద్రాలతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ముంచంగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదోర్‌ గ్రామ సమీపంలోని కల్వర్టు వరద ఉధృతికి శనివారం పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో లక్ష్మీపురం, బుంగాపుట్టు పంచాయతీలకు చెందిన 27 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఒడిశా రాష్ట్రంలోని మూడు పంచాయతీలకు చెందిన 53 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కల్వర్టు కొట్టుకుపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ముంచంగిపుట్టు సంతకు వచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. అత్యవసరంగా సరుకులు కావాల్సిన వారు ధైర్యం చేసి గెడ్డలు దాటి సంతకు వచ్చారు. కల్వర్టు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కల్వర్టు కోతకు గురైందని, మరమ్మతులు చేపట్టాలని గతంలో అనేకమార్లు అధికారులను కోరినా స్పందించలేదని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టును పునరుద్ధరించాలని కోరుతున్నారు. మరోవైపు డొంకరాయి జలాశయం నిండుకుండలా మారి ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు ఒక గేటుని ఎత్తి వరద నీటిని శబరి నదిలోకి విడిచిపెట్టారు. 
జలకళతో తొణికిసలాడుతున్న సీలేరు జలాశయం. (ఇన్‌సెట్‌లో) డ్యాం నుంచి విడుదలవుతున్న నీరు 

31న మరో అల్పపీడనం
ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో జల్లుల నుంచి ఒక మోస్తరు వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌ కేంద్రం పేర్కొంది. రాబోయే మూడు రోజులు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు రెండో వారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయనీ.. దీనివల్ల లోటు ప్రభావం పూర్తిగా పోతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గత 24 గంటల్లో 25.7 మి.మీ వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కృష్ణా జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవగా, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా వత్సవాయి మండలంలో 67.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కంకిపాడులో 6.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో ఖరీఫ్‌ సాగు ఊపందుకుంది. విజయవాడ అర్బన్‌తోపాటు కొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవగా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో గత 24 గంటల్లో 26.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
అరకు–పాడేరు ప్రధాన రోడ్డులో చేరిన వరద నీరు  

రాష్ట్రంలో నమోదైన వర్షపాత వివరాలివీ.. 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం చింతూరులో 11 సెంమీ, పాలకోడేరులో 7, నర్సీపట్నంలో 6, అమలాపురం, పాడేరు, వరరామచంద్రాపురం, కూనవరం, అరకు లోయ, ఎమ్మిగనూరులో 5 సెం.మీ, విజయవాడ, కంభం, గుడివాడ, యలమంచిలి, యర్రగొండపాలెం, చింతపల్లిలో 4 సెం.మీ, నూజివీడు, అవనిగడ్డ, తుని, వేలేరుపాడు, అర్ధవీడు, మచిలీపట్నం, తిరువూరు, గుంటూరు, కొయిడా, భీమవరం, ఏలూరు, తెనాలి, కైకలూరు, శృంగవరపుకోట, వేపాడ, వెలిగండ్ల, బెస్తవారిపేట, బెలగల, గొనెగండ్ల, నంద్యాల, శ్రీశైలం, నందవరంలో 3 సెం.మీ, కుక్కునూరు, కావలి, నర్సాపురం, పొదిలి, రేపల్లె, నందిగామ, భీమడోలు, రాచెర్ల, చింతలపూడి, నెల్లిమర్ల, బొబ్బిలి, యానాం, మార్కాపురం, కొనకొనమిట్ల, నందికొట్కూరు, గూడూరు, రుద్రవరం, ఓర్వకల్లు, కర్నూలులో 2 సెం.మీ వర్షం కురిసింది. అదేవిధంగా విజయనగరం, కొమరాడ, పార్వతీపురం, అనకాపల్లి, పత్తిపాడు, నెల్లూరు, ధవళేశ్వరం, పోలవరం, బొందపల్లి, మర్రిపూడి, గజపతినగరం, ఉయ్యూరు, తాడేపల్లిగూడెం, ముండ్లమూరు, పూసపాటిరేగ, చోడవరం, అచ్చంపేట, దర్శి, మెంటాడ, డెంకాడ, అనకాపల్లి, రణస్థలం, కొయ్యలగూడెం, తెర్లాం, సీతానగరం, చీమకుర్తి, సంతమాగులూరు, పెద్దాపురం, జియ్యమ్మవలస, అద్దంకి, కురుపాం, మాచర్ల, ఒంగోలు, తణుకు, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, పత్తికొండ, జూపాడు బంగ్లా, పగిడ్యాల, బనగానపల్లిలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top