బినామీ సంస్థకే ‘ఫ్లెక్సీ పవర్‌’ 

Huge Nazrana To Lingamaneni Relative company - Sakshi

లింగమనేని రమేశ్‌ బంధువు సంస్థకు భారీ నజరానా 

విద్యుత్‌ నిల్వ ప్రాజెక్టు టెండర్లను ‘ఎకొరాన్‌’కే కట్టబెట్టండి

అధికారులపై ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి 

అర్హత లేని సంస్థను అందలమెక్కించాలని నిర్ణయం 

‘సాక్షి’ కథనంతో రద్దయిన సమన్వయ కమిటీ సమావేశం  

సాక్షి, అమరావతి: ఫ్లెక్సీ పవర్‌ పేరుతో తన బినామీకి అడ్డగోలుగా దోచిపెట్టాలన్నదే ప్రభుత్వాధినేత అసలు వ్యూహమని తేటతెల్లమైంది. ఏ అర్హత లేని ఎకొరాన్‌ కంపెనీకి ప్రభుత్వ పెద్దలు సహకరించడం, అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే.. విద్యుత్‌ నిల్వ ప్రాజెక్టు (ఫ్లెక్లీ పవర్‌) పేరుతో టెండర్లను ఖరారు చేసి, ‘ఎకొరాన్‌’కు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆరాట పడుతోందని ‘కోడ్‌ ఉన్నా కమీషన్ల బేరం’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.  

అనుభవం ఉన్న సంస్థలపై అనర్హత వేటు!  
పవన విద్యుత్, సౌర విద్యుత్‌ రంగంలో ఏమాత్రం సమర్థత లేని ఎకొరాన్‌ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన లింగమనేనికి ఎకొరాన్‌ సంస్థ అధిపతి దగ్గరి బంధువని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ సంస్థకు ఫ్లెక్సీ పవర్‌ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. సమీకృత పవన, సౌర, జల విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి, విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి, దాన్ని డిమాండ్‌ ఉన్నప్పుడు గ్రిడ్‌కు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ పనుల్లో అనుభవం గల కంపెనీలు టెండర్లలో పాల్గొన్నప్పటికీ ఏవో కారణాలు చూపించి వాటిపై వేటు వేసి, అర్హత లేని ఎకొరాన్‌కు లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టమవుతోంది.  

ఎకొరాన్‌ ప్రతిపాదన.. ఆగమేఘాలపై ఆమోదం  
చిన్నాచితక పవన విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లే ఉన్న ఎకొరాన్‌ సంస్థకు ఫ్లెక్సీ పవర్‌ను అందించే సామర్థ్యం లేదు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఏకంగా 2,000 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ హైబ్రిడ్‌ పవర్‌ ప్రాజెక్టును ప్రభుత్వం వద్ద ప్రతిపాదించింది. కర్నూలు జిల్లా అవుకు దగ్గర 600 మెగావాట్లు, కడప జిల్లా మైలవరం దగ్గర 1,400 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయితే తొలిదశలో అవుకు దగ్గర 200 మెగావాట్లు, కడప జిల్లాలో800 మెగావాట్ల హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామంది. దీనికి 7,437 ఎకరాల భూమి ఇవ్వాలని కోరింది. ఎకొరాన్‌ నుంచి ప్రతిపాదన రావడమే ఆలస్యం మార్చి 1వ తేదీన ఇంధన శాఖ దానికి ఆమోదం తెలిపింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండానే, ఎకొరాన్‌ ఆర్థిక పరిస్థితిని ఆరా తీయకుండానే అన్ని అనుమతులు ఇచ్చేసింది. దీన్ని అడ్డం పెట్టుకున్న ఎకొరాన్‌ ఏకంగా 600 మెగావాట్ల ఫ్లెక్సీ పవర్‌ బిడ్డింగ్‌లో పాల్గొంది. ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో తాను అంతర్జాతీయ సంస్థ ‘జీఈ’తో కలిసి జాయింట్‌ వెంచర్‌గా సమీకృత హైబ్రిడ్‌ ఇంధన ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. కానీ, బిడ్డింగ్‌లో మాత్రం జీఈతో ఒప్పందం చేసుకున్నట్టు రుజువుగా ఒక్క డాక్యుమెంట్‌ కూడా సమర్పించలేదని తెలిసింది. 

టెండర్లు లీకయ్యాయా?  
ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో ఎవరెంత కోట్‌ చేశారన్నది టెండర్లు తెరిచినప్పుడే బయటపడుతుంది. ఫ్లెక్సీ పవర్‌ టెండర్‌ లీకైనట్లు సమాచారం. ఈ టెండర్‌ తమకే దక్కుతుందని ఎకొరాన్‌ చెప్పుకోవడం గమనార్హం. వాస్తవానికి ఫ్లెక్సీ పవర్‌ను అందించే సమర్థత గల ఇతర కంపెనీల కన్నా తామే తక్కువ కోట్‌ చేశామని ఎకొరాన్‌ ప్రతినిధులు అంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడే టెండర్లు తెరిచి, తమను ఎల్‌–1గా ప్రకటించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి పెరగడంతో అధికారులు హడలిపోతున్నారు. త్వరలో ప్రభుత్వం మారితే తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఎకొరాన్‌ ఈ హడావిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు ఆమోదిస్తే తాము చిక్కుల్లో ఇరుక్కుంటామని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

సమన్వయ కమిటీ సమావేశం వాయిదా  
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే 600 మెగావాట్ల ఫ్లెక్సీ పవర్‌ టెండర్లను ఆమోదించేందుకు తక్షణమే విద్యుత్‌ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వాయిదా పడింది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ బుధవారం ప్రత్యేక కథనం ప్రచురించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒత్తిడికి తలొగ్గితే ఇబ్బందుల్లో పడతామని గుర్తించారు. సీఎంవో నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసేలా కథనం ప్రచురించిన ‘సాక్షి’కి విద్యుత్‌ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ‘మీ వార్తతో మమ్మల్ని కాపాడారు’ అని ఓ చీఫ్‌ ఇంజనీర్‌ వ్యాఖ్యానించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top