అంబిక థియేటర్‌లో అగ్ని ప్రమాదం | huge fire accident | Sakshi
Sakshi News home page

అంబిక థియేటర్‌లో అగ్ని ప్రమాదం

May 27 2014 12:21 AM | Updated on Sep 5 2018 9:45 PM

అంబిక థియేటర్‌లో  అగ్ని ప్రమాదం - Sakshi

అంబిక థియేటర్‌లో అగ్ని ప్రమాదం

మండపేటలోని అంబిక థియేటర్‌లో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. థియేటర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

 మండపేట, న్యూస్‌లైన్ : మండపేటలోని అంబిక థియేటర్‌లో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. థియేటర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో థియేటర్‌లోని ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. పైకప్పు పూర్తిగా ధ్వంసమైపోయింది. అదృష్టవశాత్తు సంఘటన సమయంలో థియేటర్‌లో ప్రదర్శన లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. కాగా పక్కనే ఉన్న సత్యశ్రీ థియేటర్ లోంచి ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో సుమారు రూ.60 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచనా. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
స్థానిక సత్యశ్రీ రోడ్డులో అంబిక, సత్యశ్రీ థియేటర్ల కాంప్లెక్స్ ఉంది. కొద్దిరోజులుగా అంబిక థియేటర్‌కు యాజమాన్యం మరమ్మతులు నిర్వహిస్తోంది. ఇటీవల ఏసీ థియేటర్‌గా అభివృద్ధి చేసి కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గ్యాస్ కట్టర్‌తో సీట్లకు మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్టు యాజమాన్యం తెలిపింది. థియేటర్ లోపలి భాగం అంతా చెక్క, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసింది కావడంతో కొద్ది క్షణాల్లోనే థియేటర్‌లో మంటలు వ్యాపించాయి.
 
దీంతో లోపల పనిచేస్తున్న సుమారు పది మంది సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సుమారు అర్ధగంట వ్యవధిలో థియేటర్ లోపలిభాగం, ఫర్నిచర్ అంతా కాలిబూడిదైపోయాయి. థియేటర్ పైకప్పు, ప్రొజెక్టర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న మండపేట ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో రామచంద్రపురం నుంచి అగ్నిమాపక శకటాన్ని రప్పించారు. మంటలను అదుపు చేసేందుకు సుమారు రెండుగంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.
 
 ఈ సంఘటన దావానంలా వ్యాపించడంతో పెద్దఎత్తున స్థానికులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మండపేట సీఐ వి.విజయారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్‌ఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఈ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని థియేటర్ యజమాని చెన్న రాంబాబును ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. డీఎఫ్‌ఓ ఉదయ్‌కుమార్, జిల్లా సహాయ అగ్నిమాపకాధికారి ప్రశాంత్‌కుమార్, మండపేట ఫైర్ ఆఫీసర్ డి.చినబాబు నష్టం అంచనాలను రూపొందిస్తున్నారు.
 
 సంఘటన సమయానికి పక్కనే ఉన్న సత్యశ్రీ థియేటర్‌లో ప్రదర్శన జరుగుతుండగా ప్రమాదం విషయం తెలిసి ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోవడంతో సత్యశ్రీ థియేటర్‌కు ఏ విధమైన నష్టం వాటిల్లలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 లక్షలు మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాగా తెలుస్తోంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం అంచనా వేయనున్నట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement