హిజ్రా సజీవదహనం

hijra suspicious death in Anakapalli - Sakshi

అనకాపల్లి టౌన్‌:  పట్టణానికి చెందిన హిజ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాంధీనగరం 1వవీధిలో నివాసముంటున్న హిజ్రా కాలపర్తి వెంకట సూర్యనారాయణ అలియాస్‌ దేముడమ్మ (50) ఇంటిలో నుంచి ఆదివారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో మంటలు రావడాన్ని గమనించిన ఇంటి యజమాని కోరిబిల్లి శంకరరావు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తుండగా ఇంట్లో దేముడమ్మ మృతి చెంది ఉండడాన్ని గమనించారు. యజమాని శంకరరావుæ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ కె.వెంకటరమణ, క్రైం డీఎస్పీ అలియాస్‌ సాగర్‌ ఆధ్వర్యంలో క్లూస్, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌బృందం కొన్ని చోట్ల వేలిముద్రలను సేకరించింది. దేముడమ్మ హత్యకు గురైందా..? లేక షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మృతి చెందిందా? అనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు.

మృతిపై అనుమానాలు
ఐదేళ్ల క్రితం అనకాపల్లి పట్టణానికి వచ్చిన దేముడమ్మకు ఎవరితోనూ ఎటువంటి తగాదాలు లేవు. తోటి హిజ్రాలతో ఎటువంటి సత్సంబంధాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే వెంకటేశ్వరస్వామి పూజలు ఎక్కువుగా చేస్తుండడంతో పలువురు ఆమె వద్దకు వచ్చి గ్రహస్థితిపై ఆరా తీస్తుంటారు. వారిచ్చే నగదుతో కాలం వెళ్లదీస్తుంది. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం కూడా చేస్తుంటుంది. ఆరు నెలల క్రితం ఆమె ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం విజయరామరాజుపేట గౌరీపరమేశ్వరుల మహోత్సవం సందడిలో చోరీకి యత్నించిన ఆగంతకులు నగదు, బంగారం దోచుకునే ప్రయత్నంలో అడ్డొచ్చిన ఆమెను హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

షార్ట్‌సర్క్యూట్‌తోనే మృతి చెందింది
తెల్లవారుజామున నిద్ర నుంచి లేచిన దేముడమ్మ ఇంట్లో లైట్‌ స్విచ్‌ ఆన్‌చేయగా మంటలు వ్యాపించి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. ఆమె ఉంటున్న గదికి మంటలు వ్యాపించి మృతి చెందింది. ఇంటి యజమాని శంకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.        – విద్యాసాగర్, సీఐ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top