హైకోర్టులో నవయుగకు ఎదురుదెబ్బ

High Court Gives Shock To Navayuga Over Machilipatnam Port - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నవయుగ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. మచిలీపట్నం(బందరు) పోర్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మచిలీపట్నం పోర్టు కాంట్రాక్టు రద్దుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతేకాక ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించాలన్న నవయుగ విజ్ఞప్తిని కూడా కోర్టు తోసిపుచ్చింది. అవసరమైతే పోర్టు నిర్మాణం కోసం కొత్తగా టెండర్లను ఆహ్వానించవచ్చని తెలిపింది. అయితే అక్టోబర్‌ 25 వరకు ఆ టెండర్లను ఖరారు చేయవద్దని చెప్పింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. 

కాగా, మచిలీపట్నం పోర్టు కాంట్రాక్టు రద్దు చేస్తూ ఆగస్టు 8వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోర్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2010 జూన్‌ 7న నవయుగ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇప్పటివరకు పోర్టు నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అంతేకాక నవయుగకు కేటాయించిన 471 ఎకరాలకు ఆసంస్థ ఒక్కపైసా కూడా చెల్లించలేదు.  ఈ నేపథ్యంలో కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 2010లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే మచిలీపట్నం పోర్టు ప్రాజెక్టును మరొకరికి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పోర్టు కాంట్రాక్టు రద్దుపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నో చెప్పింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top