ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది

High Court Appreciated Andhra Pradesh Govt - Sakshi

విశాఖ గ్యాస్‌ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ప్రశంసలు

మరణించిన ప్రతి ఒక్కరికీ రూ.కోటి తక్షణ పరిహారం గొప్ప విషయం

ప్రభుత్వ మానవతా దృక్పథం.. దయార్ద హృదయాన్ని అభినందిస్తున్నాం

సాక్షి, అమరావతి: ‘విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఎంతో గొప్పగా వ్యవహరించింది. ఈ ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరికీ కోటి రూపాయల భారీ తక్షణ నష్టపరిహారం అందించింది. ఇది చాలా గొప్ప విషయం. ఇంత భారీ మొత్తాన్ని పరిహారంగా ఇచ్చిన ప్రభుత్వ మానవతా దృక్పథాన్ని.. దయార్ద హృదయాన్ని అభినందిస్తున్నాం’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కరోనా వల్ల కోర్టులు పనిచేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్‌ కోరుతున్న విధంగా న్యాయవాదులకు వడ్డీ రహిత రుణాలు ఇచ్చేలా బ్యాంకులను కోర్టులు ఆదేశించజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదులను ఆదుకునేందుకు ఇప్పటికే కేటాయించిన రూ.100 కోట్ల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ దేవానంద్‌లతో కూడిన ధర్మాసనం  ఉత్తర్వులు జారీ చేసింది. 

రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులే..
లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఎస్‌బీఐ ద్వారా వడ్డీ రహిత వ్యక్తిగత రుణంగా రూ.లక్ష ఇప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎం.గిరిబాబు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. ఇవి పూర్తిగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులేనని, కేంద్ర నిధులు కావని స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని బార్‌ కౌన్సిల్‌ ద్వారా న్యాయవాదుల కోసం ఉపయోగించాలని నిర్ణయించిందన్నారు. ఈ విషయంలో జీవో జారీ చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top