బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

Heavy River Flow At East Godavari First  Alaram At The Barrage Danger Siganal - Sakshi

జలప్రళయమొచ్చినట్టుగా గోదావరి ఉప్పొంగి పోతోంది. ఇరుతీరాలనూ ఏకం చేస్తూ.. ఒడ్డున ఉన్న గ్రామాల్లోకి ఉరకలెత్తి ముంచెత్తుతోంది. ఉపనదులైన సీలేరు, శబరి, ఇంద్రావతి పొంగి ప్రవహిస్తూండడంతో.. వాటి నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి గంటగంటకూ తీవ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద 51 అడుగులకు నది నీటిమట్టం చేరింది. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ పాపంతో దేవీపట్నాన్ని వరద ముంచెత్తింది. అక్కడి నుంచి దిగువకు ఉరుకుతూ ధవళేశ్వరం బ్యారేజీని దాటుకొని వడివడిగా కడలి దరికి పరుగు తీస్తోంది. ఆ మార్గంలో ఉన్న కోనసీమ లంకల్నీ ముంచెత్తుతోంది. దీంతో నదీ తీర గ్రామాల ప్రజలు ప్రచండ మారుతంలో గడ్డిపోచల్లా గజగజా వణికిపోతున్నారు. మరోసారి భారీ వరద ముప్పు తలెత్తడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం టౌన్‌) : ఈ సీజన్‌లో ఇప్పటికే రెండుసార్లు వచ్చిన వరదలు మిగిల్చిన నష్టాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే.. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద నీటితో జిల్లాలో జలప్రళయం సృష్టిస్తోంది. ఫలితంగా జిల్లాలోని మొత్తం 86 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువన ఉన్న ఏజెన్సీ, విలీన మండలాలతో పాటు దిగువన ఉన్న కోనసీమ లంక గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరింది. సోమవారానికి ఇది 55 నుంచి 58 అడుగులకు చేరవచ్చని భావిస్తున్నారు. భద్రాచలం వద్ద అర్ధరాత్రికల్లా మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

దేవీపట్నం.. అతలాకుతలం
నెల రోజుల వ్యవధిలో గోదావరికి మూడుసార్లు వచ్చిన వరద దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు గ్రామాలను అతలాకుతలం చేసింది. గురువారం నుంచి పెరుగుతూ వచ్చిన గోదావరి ఆదివారం ఉదయానికి దేవీపట్నం గ్రామాన్ని ముంచేసింది. ఇప్పటివరకూ దేవీపట్నం చుట్టూ పంటపొలాల్లోకి మాత్రమే చేరిన వరద నీరు ఆదివారం గ్రామంలోకి చొరబడింది. సాయంత్రానికి సుమారు నాలుగు అడుగులు పెరిగి గ్రామం మొత్తం జలమయమైంది. దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి, ఏనుగులగూడెం, గానుగులగొంది, అగ్రహారం, మూలపాడు, పోశమ్మ గండి గ్రామాలకు చెందిన వరద బాధితులు పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నాలుగు రోజులుగా మండలంలోని 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మూడు రోజుల నుంచి 18 పడవలతో 85 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతి ఎక్కువవడంతో బాధితులు ఆందోళనతో పడవల కోసం నానా అవస్థలూ పడాల్సి వచ్చింది.

ఆదివారం ఉదయానికి దండంగి వాగు పోటు గ్రామాన్ని తాకింది. గ్రామంలో ఎస్సీ కాలనీలో పలు ఇళ్లు నీట మునిగాయి. పోశమ్మ గండి వద్ద అమ్మవారి ఆలయంలోకి వరద నీరు చొచ్చుకు పోయింది. అమ్మవారి విగ్రహం సగభాగం వరకూ వరద నీరు ప్రవహిస్తోంది. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఆదివారం సాయంత్రానికి 27.4 అడుగులకు నీటిమట్టం చేరింది. కాఫర్‌ డ్యామ్‌కు ఇరువైపుల నుంచీ వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పై నుంచి భారీ స్థాయిలో వరదనీరు పోతున్నప్పటకీ ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో బ్యాక్‌ వాటర్‌ కారణంగా వరద పోటు ఎక్కువైంది. గత నెలలో వచ్చిన వరదల కంటే ఎక్కువ స్థాయిలో వరద నీరు గోదావరికి చేరనుండడంతో వచ్చే మూడు రోజుల పాటు దేవీపట్నం వద్ద వరద ఉధృతి మరింత ప్రమాదకర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఆదివారం దేవీపట్నం గ్రామం మొత్తాన్ని ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దేవీపట్నం జాలరిపేట పరిసర ప్రజలు ఉమాచోడేశ్వరస్వామి ఆలయం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, వీరవరం మండల కార్యాలయం వద్దకు తరలివెళ్లారు.

దేవీపట్నం ఎగువన మంటూరు, తున్నూరు, కొండమొదలు, కచ్చులూరు, గొందూరు తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆయా గ్రామాలకు నియమించిన సెక్టోరియల్‌ అధికారులు సహాయ చర్యలు అందించేందుకు తరలి వెళ్లారు. ఆదివారం వరద పోటు ఎక్కువై చినరమణయ్యపేట నుంచి వీరవరం వరకూ రహదారి పైకి వరద నీరు చేరింది. రంపచోడవరం ఆర్డీవో శ్రీనివాసరావు ఆదివారం దేవీపట్నం, వీరవరం, తొయ్యేరుల్లో పర్యటించి, వరద పరిస్థితిని సమీక్షించారు. శివాలయం వద్ద తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. బోర్నగూడెం వసతి గృహానికి తరలిరావాలని కోరినప్పటికీ అక్కడ సురక్షితంగానే ఉన్నామని బాధితులు తెలిపారు.

కోనసీమ లంకలకు వరద పోటు
గోదావరికి వరద పోటెత్తడంతో కోనసీమలోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీపాయలు, లంక గ్రామాలతో ఉండే కోనసీమ ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద ప్రభావిత మండలాలుగా ఉన్న సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సాధారణంగా ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక సమయానికే దాదాపు 50 వరకూ కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధానికి చేరువలో ఉంటాయి. ఇక రెండో ప్రమాద హెచ్చరిక రాగానే ఆ 50 లంక గ్రామాల పరిస్థితులు మరీ దయనీయంగా మారుతాయి. ఆదివారం సాయంత్రానికే అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లోని అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, జి.పెదపూడి లంక, బూరుగులంక, అరిగెలవారి లంక, ఊడిమూడిలంక, లంక ఆఫ్‌ ఠానేలంక, కమినిలంక, గురజాపులంక, సలాదివారిపాలెం తదితర 16 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

మామిడికుదురు మండలం అప్పనపల్లి వద్ద కాజ్‌వే ముంపునకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఆ మండలంలోని అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాలకు, బయటి ప్రపంచానికి రాకపోకలు తెగిపోతాయి. రాజోలు దీవిలోని అప్పనరామునిలంక, సఖినేటిపల్లి లంక, రామరాజులంక, మధ్యలంక తదితర గ్రామాల్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. పి.గన్నవరం మండలంలో ఇప్పటికే బూరుగలంకను వరద చుట్టిముట్టింది. వరద ఉధృతి పెరుగుతూండడంతో జి.పెదపూడిలంక రేవులో రాకపోకలను ఆదివారం సాయంత్రం నుంచే నిలిపివేశారు. అయినవిల్లి మండలం శానపల్లిలంక – కె.గంగవరం మండలం కోటిపల్లి మధ్య గౌతమి నదిలో వరద ఉధృతి మరీ ఎక్కువగా ఉండడంతో ఆ నదీపాయపై జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులను నిలిపివేశారు. రాత్రి సమయంలో అమాంతం వరద నీరు చుట్టిముట్టినా తమ పశువులకు ఎలాంటి ప్ర మాదం లేకుండా కొన్ని లంక గ్రామాల ప్రజలు ముందు జాగ్రత్తగా వాటిని సురక్షిత ప్రాంతాల కు తరలిస్తున్నారు.

ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కోనసీమలోని అన్ని మండలాల అధికారులనూ ఇప్పటికే అప్రమత్తం చేశామని అమలాపురం ఆర్డీవో బి.వెంకటరమణ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండి రాత్రంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి తక్షణ సమాచారం కోసం ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు కూడా మండలాల్లో ఉండి వరద రక్షణ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తెల్లారేసరికి ధవళేశ్వరం వద్ద కూడా అదే హెచ్చరిక జారీ చేసే అవకాశాలుంటాయన్న ఉద్దేశంతో మరింత అప్రమత్తంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెంకటరమణ తెలిపారు.

బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్‌): కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు 11.75 అడుగులకు నీటిమట్టం చేరడంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటగంటకూ పెరుగుతూ రాత్రి 9 గంటలకు 12.90 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుంచి 11,43,206 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 8,700 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం సోమవారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఉదయం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరే అవకాశం ఉందని ఫ్లడ్‌ కన్జర్వేటర్, హెడ్‌వర్క్స్‌ ఈఈ ఆర్‌.మోహనరావు తెలిపారు. వరదలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఎగువ ప్రాంతాల్లో భారీగా..
ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు భారీగా పెరుగుతూండడంతో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 9 గంటలకు 50.90 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూండటంతో గోదావరి నీటిమట్టాలు భారీగా పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.77 మీటర్లు, పేరూరులో 14.86 మీటర్లు, దుమ్ముగూడెంలో 14.38 మీటర్లు, కూనవరంలో 18.83 మీటర్లు, కుంటలో 10.97 మీటర్లు, కొయిదాలో 22.24 మీటర్లు, పోలవరంలో 13.28 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.62 మీటర్ల మేర నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top