breaking news
dawaleswaram cotton barrage
-
Bhadrachalam: ఉగ్ర ‘గోదావరి’.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం 48 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతి నేపథ్యంలో ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇక, ఏజెన్సీలోని పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. ఇప్పటికే చర్ల మండలంలోని మూడు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు.ఇక ధవళేశ్వేరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక, వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఐదు ఎస్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.7 అడుగులకు చేరుకుంది. మరోవైపు, పోలవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం 12.5 మీటర్లకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. గోదావరి నుంచి ప్రస్తుతం 10 లక్షల 28 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల అవుతోంది. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజలు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక, ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. -
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం
-
ధవళేశ్వరం బ్యారేజ్ కు అంతర్జాతీయ గుర్తింపు
-
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరిగిన వరద
-
తూర్పుగోదావరి : దేవీపట్నం.. అతలాకుతలం
-
ప్రళయ గోదావరి!
జలప్రళయమొచ్చినట్టుగా గోదావరి ఉప్పొంగి పోతోంది. ఇరుతీరాలనూ ఏకం చేస్తూ.. ఒడ్డున ఉన్న గ్రామాల్లోకి ఉరకలెత్తి ముంచెత్తుతోంది. ఉపనదులైన సీలేరు, శబరి, ఇంద్రావతి పొంగి ప్రవహిస్తూండడంతో.. వాటి నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి గంటగంటకూ తీవ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద 51 అడుగులకు నది నీటిమట్టం చేరింది. పోలవరం కాఫర్ డ్యామ్ పాపంతో దేవీపట్నాన్ని వరద ముంచెత్తింది. అక్కడి నుంచి దిగువకు ఉరుకుతూ ధవళేశ్వరం బ్యారేజీని దాటుకొని వడివడిగా కడలి దరికి పరుగు తీస్తోంది. ఆ మార్గంలో ఉన్న కోనసీమ లంకల్నీ ముంచెత్తుతోంది. దీంతో నదీ తీర గ్రామాల ప్రజలు ప్రచండ మారుతంలో గడ్డిపోచల్లా గజగజా వణికిపోతున్నారు. మరోసారి భారీ వరద ముప్పు తలెత్తడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం టౌన్) : ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు వచ్చిన వరదలు మిగిల్చిన నష్టాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే.. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద నీటితో జిల్లాలో జలప్రళయం సృష్టిస్తోంది. ఫలితంగా జిల్లాలోని మొత్తం 86 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువన ఉన్న ఏజెన్సీ, విలీన మండలాలతో పాటు దిగువన ఉన్న కోనసీమ లంక గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరింది. సోమవారానికి ఇది 55 నుంచి 58 అడుగులకు చేరవచ్చని భావిస్తున్నారు. భద్రాచలం వద్ద అర్ధరాత్రికల్లా మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవీపట్నం.. అతలాకుతలం నెల రోజుల వ్యవధిలో గోదావరికి మూడుసార్లు వచ్చిన వరద దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు గ్రామాలను అతలాకుతలం చేసింది. గురువారం నుంచి పెరుగుతూ వచ్చిన గోదావరి ఆదివారం ఉదయానికి దేవీపట్నం గ్రామాన్ని ముంచేసింది. ఇప్పటివరకూ దేవీపట్నం చుట్టూ పంటపొలాల్లోకి మాత్రమే చేరిన వరద నీరు ఆదివారం గ్రామంలోకి చొరబడింది. సాయంత్రానికి సుమారు నాలుగు అడుగులు పెరిగి గ్రామం మొత్తం జలమయమైంది. దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి, ఏనుగులగూడెం, గానుగులగొంది, అగ్రహారం, మూలపాడు, పోశమ్మ గండి గ్రామాలకు చెందిన వరద బాధితులు పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నాలుగు రోజులుగా మండలంలోని 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మూడు రోజుల నుంచి 18 పడవలతో 85 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతి ఎక్కువవడంతో బాధితులు ఆందోళనతో పడవల కోసం నానా అవస్థలూ పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయానికి దండంగి వాగు పోటు గ్రామాన్ని తాకింది. గ్రామంలో ఎస్సీ కాలనీలో పలు ఇళ్లు నీట మునిగాయి. పోశమ్మ గండి వద్ద అమ్మవారి ఆలయంలోకి వరద నీరు చొచ్చుకు పోయింది. అమ్మవారి విగ్రహం సగభాగం వరకూ వరద నీరు ప్రవహిస్తోంది. పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద ఆదివారం సాయంత్రానికి 27.4 అడుగులకు నీటిమట్టం చేరింది. కాఫర్ డ్యామ్‌కు ఇరువైపుల నుంచీ వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పై నుంచి భారీ స్థాయిలో వరదనీరు పోతున్నప్పటకీ ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో బ్యాక్ వాటర్ కారణంగా వరద పోటు ఎక్కువైంది. గత నెలలో వచ్చిన వరదల కంటే ఎక్కువ స్థాయిలో వరద నీరు గోదావరికి చేరనుండడంతో వచ్చే మూడు రోజుల పాటు దేవీపట్నం వద్ద వరద ఉధృతి మరింత ప్రమాదకర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఆదివారం దేవీపట్నం గ్రామం మొత్తాన్ని ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దేవీపట్నం జాలరిపేట పరిసర ప్రజలు ఉమాచోడేశ్వరస్వామి ఆలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వీరవరం మండల కార్యాలయం వద్దకు తరలివెళ్లారు. దేవీపట్నం ఎగువన మంటూరు, తున్నూరు, కొండమొదలు, కచ్చులూరు, గొందూరు తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆయా గ్రామాలకు నియమించిన సెక్టోరియల్ అధికారులు సహాయ చర్యలు అందించేందుకు తరలి వెళ్లారు. ఆదివారం వరద పోటు ఎక్కువై చినరమణయ్యపేట నుంచి వీరవరం వరకూ రహదారి పైకి వరద నీరు చేరింది. రంపచోడవరం ఆర్డీవో శ్రీనివాసరావు ఆదివారం దేవీపట్నం, వీరవరం, తొయ్యేరుల్లో పర్యటించి, వరద పరిస్థితిని సమీక్షించారు. శివాలయం వద్ద తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. బోర్నగూడెం వసతి గృహానికి తరలిరావాలని కోరినప్పటికీ అక్కడ సురక్షితంగానే ఉన్నామని బాధితులు తెలిపారు. కోనసీమ లంకలకు వరద పోటు గోదావరికి వరద పోటెత్తడంతో కోనసీమలోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీపాయలు, లంక గ్రామాలతో ఉండే కోనసీమ ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద ప్రభావిత మండలాలుగా ఉన్న సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సాధారణంగా ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక సమయానికే దాదాపు 50 వరకూ కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధానికి చేరువలో ఉంటాయి. ఇక రెండో ప్రమాద హెచ్చరిక రాగానే ఆ 50 లంక గ్రామాల పరిస్థితులు మరీ దయనీయంగా మారుతాయి. ఆదివారం సాయంత్రానికే అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లోని అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, జి.పెదపూడి లంక, బూరుగులంక, అరిగెలవారి లంక, ఊడిమూడిలంక, లంక ఆఫ్ ఠానేలంక, కమినిలంక, గురజాపులంక, సలాదివారిపాలెం తదితర 16 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి వద్ద కాజ్వే ముంపునకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఆ మండలంలోని అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాలకు, బయటి ప్రపంచానికి రాకపోకలు తెగిపోతాయి. రాజోలు దీవిలోని అప్పనరామునిలంక, సఖినేటిపల్లి లంక, రామరాజులంక, మధ్యలంక తదితర గ్రామాల్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. పి.గన్నవరం మండలంలో ఇప్పటికే బూరుగలంకను వరద చుట్టిముట్టింది. వరద ఉధృతి పెరుగుతూండడంతో జి.పెదపూడిలంక రేవులో రాకపోకలను ఆదివారం సాయంత్రం నుంచే నిలిపివేశారు. అయినవిల్లి మండలం శానపల్లిలంక – కె.గంగవరం మండలం కోటిపల్లి మధ్య గౌతమి నదిలో వరద ఉధృతి మరీ ఎక్కువగా ఉండడంతో ఆ నదీపాయపై జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులను నిలిపివేశారు. రాత్రి సమయంలో అమాంతం వరద నీరు చుట్టిముట్టినా తమ పశువులకు ఎలాంటి ప్ర మాదం లేకుండా కొన్ని లంక గ్రామాల ప్రజలు ముందు జాగ్రత్తగా వాటిని సురక్షిత ప్రాంతాల కు తరలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కోనసీమలోని అన్ని మండలాల అధికారులనూ ఇప్పటికే అప్రమత్తం చేశామని అమలాపురం ఆర్డీవో బి.వెంకటరమణ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండి రాత్రంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి తక్షణ సమాచారం కోసం ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు కూడా మండలాల్లో ఉండి వరద రక్షణ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తెల్లారేసరికి ధవళేశ్వరం వద్ద కూడా అదే హెచ్చరిక జారీ చేసే అవకాశాలుంటాయన్న ఉద్దేశంతో మరింత అప్రమత్తంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెంకటరమణ తెలిపారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు 11.75 అడుగులకు నీటిమట్టం చేరడంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటగంటకూ పెరుగుతూ రాత్రి 9 గంటలకు 12.90 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుంచి 11,43,206 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 8,700 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం సోమవారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఉదయం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరే అవకాశం ఉందని ఫ్లడ్ కన్జర్వేటర్, హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.మోహనరావు తెలిపారు. వరదలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా.. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు భారీగా పెరుగుతూండడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 9 గంటలకు 50.90 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూండటంతో గోదావరి నీటిమట్టాలు భారీగా పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.77 మీటర్లు, పేరూరులో 14.86 మీటర్లు, దుమ్ముగూడెంలో 14.38 మీటర్లు, కూనవరంలో 18.83 మీటర్లు, కుంటలో 10.97 మీటర్లు, కొయిదాలో 22.24 మీటర్లు, పోలవరంలో 13.28 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.62 మీటర్ల మేర నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
గోదావరికి పోటెత్తుతున్న వరద
-
నీటి కష్టాలు.. తడిసిమోపెడు
గోదావరి డెల్టాలో రబీ వరి రైతుల నీటి కష్టాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వరి చేలు పాలుపోసుకుంటున్నందున నీటి విడుదల పెంచాల్సి వస్తుంది. మరోవైపు ఎండలు పెరుగుతున్నందున ఆవిరయ్యే నీటి పరిమాణమూ పెరిగే అవకాశముండడంతో చేలకు తరచూ తడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో సీలేరు నుంచి నీటి విడుదల క్రమంగా తగ్గుతుండడం రైతులను, అధికారులను కలవరానికి గురి చేస్తోంది. అమలాపురం : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. మూడు రోజుల క్రితం 8,350 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో శుక్రవారం సాయంత్రానికి 7,850 పడిపోయింది. దీనితో మూడు డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. తూరుడెల్టాకు 2,500 క్యూసెక్కుల నుంచి 2,300కు, మధ్యడెల్టాకు 1,600 నుంచి 1,500కు, పశ్చిమ డెల్టాకు 4,250 నుంచి 4,050కి తగ్గించారు. అయితే ముందు ముందు నీటి రాక మరింత పడిపోయే ప్రమాదముంది. ఈనెల 20 నుంచి సీలేరు నుంచి వచ్చే నీటి పరిమాణం తగ్గుతోంది. వేసవి అవసరాల దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం సీలేరు ప్రాజెక్టు అధికారులు ముందస్తు జాగ్రత్త తీసుకోవడంతో నీటి విడుదల ఇంతకన్నా పెరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న ఇన్‌ఫ్లోలో సీలేరు వాటా తీసివేయగా సహజ జలాలు బాగా తక్కువ కావడగం గమనార్హం. నీటి రాక తగ్గితే సాగునీటి ఇక్కట్లు పెరిగే అవకాశముంది. తగు ప్రణాళిక లేకుంటే నష్టమే.. తూర్పు, మధ్యడెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఎగువ ప్రాంతాల్లో వరి చేలు పాలు పోసుకుంటున్నాయి. మధ్య, శివారు ప్రాంతాల్లో మరో పదిపదిహేను రోజుల్లో పాలుపోసుకునే దశకు వస్తాయి. ఈ సమయంలో చేలల్లో నీటిని 5 సెంటీమీటర్ల చొప్పున ఉంచుతారు. దీని వల్ల నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం డెల్టా ప్రధాన పంటకాలువలకు 110 డ్యూటీ (ఒక క్యూసెక్కు 110 ఎకరాలకు చొప్పున) విడుదల చేస్తున్నారు. పాలుపోసుకునే దశలో కనీసం 90 డ్యూటీ చొప్పున విడుదల చేయకుంటే శివారు చేలకు నీరందదు. ఇప్పటికే శివారుల్లో చేలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. పాలుపోసుకునే దశలో ఆశించిన స్థాయిలో నీరందించకుంటే ధాన్యం గింజల్లో తాలుతప్పలు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున రైతులు దిగుబడిని కోల్పోయే ప్రమాదముంది. ఇప్పుడు డెల్టా కాలువలకు ఇస్తున్న 7,850 క్యూసెక్కులను కనీసం 10 వేలకు పెంచకుంటే రైతులు నీటి కోసం మరిన్ని పాట్లు పడాల్సి వస్తుంది. డెల్టాలో మూడు దశల్లో రబీ సాగు జరుగుతున్నందున రోజుకు 9 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల మధ్య నెల రోజుల పాటు అందించాల్సి ఉంటుంది. పోనీ బ్యారేజ్ వద్ద నిల్వ ఉన్న నీటిని ఇస్తారా అంటే అక్కడ పాండ్ లెవెల్ తగ్గడం అధికారులను కూడా కలవరపరుస్తోంది. బుధవారం సాయంత్రానికి పాండ్ లెవిల్ 13.10 మీటర్ల నుంచి 13.05 మీటర్లకు పడిపోయింది. శుక్రవారం సాయంత్రానికి ఇది 13.01కి తగ్గడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పాండ్ లెవెల్ 12.05కు తగ్గితే పరిస్థితి మరింత దిగజారుతుంది. పాండ్ లెవెల్ తగ్గితే విడుదల చేసిన నీటిలో గ్రావిటీ తగ్గి శివారుకు చేరడం ఆలస్యమవుతుంది. సీలేరు నుంచి వచ్చే నీటిని పెంచడంతోపాటు సమర్థమెన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుంటే రబీలో డెల్టా రైతులు నష్టపోయే ప్రమాదముంది. అలాగే మార్చి 31 తరువాత కూడా నీటి సరఫరా చేయాల్సి ఉన్నందున తగు ప్రణాళిక సిద్ధం చేయకున్నా ఇదే పరిస్థితి నెలకొంటుంది. సీలేరు నుంచి నీటి విడుదల ఇలా (క్యూసెక్కుల్లో) 18వ తేదీ : 5,219 19వ తేదీ : 4,930 20వ తేదీ : 5,900 21వ తేదీ : 4,300 22వ తేదీ : 3,800 23వ తేదీ : 3,975 24వ తేదీ : 4,113 25వ తేదీ : 4,100 26వ తేదీ : 4,031.62