రంపచోడవరంలో కుండపోత

Heavy rains lashed several districts in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం/సాక్షి, నెట్‌వర్క్‌:  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల కుండపోత వర్షం పడింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రికార్డు స్థాయిలో 10.37 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ, మండపేటలో భారీ వర్షం కురవగా.. అమలాపురం, రాజమహేంద్రవరాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ప్రొద్దుటూరు, తాడేపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. 

► గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, గుంటూరు, నరసరావుపేట, తెనాలితో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం రైతులకు మేలు చేస్తుందని చెబుతున్నారు.  
► అనంతపురం జిల్లాలోని 44 మండలాల్లో 13.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.      
► వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది.   
► ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు, చీమకుర్తిలో భారీ వర్షం పడింది.   

మూడు రోజుల పాటు వర్షసూచన 
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉత్తర–దక్షిణ ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రలో మంగళవారం కూడా విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top