కర్నూలు జిల్లాలో ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లాయి.
కర్నూలు : కర్నూలు జిల్లాలో ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లాయి. వర్షానికి డోన్ మండలం పెద్దమల్కాపురంలో మట్టి మిద్దె కూలి పదో తరగతి విద్యార్థిని హేమలత (15) మృతి చెందింది. కృష్ణగిరి మండలం గుడెంపాడుకు చెందిన మహేశ్వరరెడ్డి (40) పిడుగుపాటుకు గాయపడ్డాడు. ఓర్వకల్లు, కోవెలకుంట్ల ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉయ్యాలవాడ మండలం మాయలూరు- ఆళ్లగడ్డ రహదారిలో కుందరవాగు కాజ్‌వేపై నీటి ప్రవాహానికి లారీ బోల్తాపడింది. భారీ వర్షం వల్ల ఎమ్మిగనూరు, గోనెగండ్ల, పత్తికొండ, ఓర్వకల్లు, గూడూరు, కృష్ణగిరి మండలాల్లో పత్తి, ప్రొద్దుతిరుగుడు, ఉల్లి, మిరప తదితర పంటలు సుమారు 5 వేల ఎకరాల్లో నీటమునిగాయి. ఓర్వకల్లు సమీపంలోని కుందూవాగు పొంగిపొర్లడంతో 18వ జాతీయరహదారిపై 3 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యధికంగా బేతంచర్ల మండలంలో 120.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.