హమ్మ.. శ్రీనివాసా! 

Hathibelagal Quarry Blasting Case Used Kurnool - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏకంగా 13 మందిని బలి తీసుకున్న హత్తిబెళగల్‌ క్వారీ పేలుడు ఘటన  నుంచి అధికార పార్టీకి చెందిన క్వారీ యజమాని తప్పించుకునేలా పథక రచన జరుగుతోందా? అసలు ఆ ఘటనతో తనకేమీ సంబంధం లేదనే రీతిలో వ్యవహారం నడుస్తోందా? పేలుడు సంభవించిన ప్రాంతంలో ఉన్న డిటోనేటర్లకు, అతనికి సంబంధం లేదంటూ మొత్తం కేసును తప్పుదోవ పట్టించేందుకు రంగం సిద్ధమైందా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పేలుడు  జరిగిన ప్రాంతం తన క్వారీ పరిధిలోకి రాదనడంతో పాటు అక్కడ చనిపోయిన వారు కూడా తన వద్ద పనిచేయడం లేదంటూ విఘ్నేశ్వర క్రషర్స్‌ కంపెనీ యజమాని, అధికార పార్టీకి చెందిన శ్రీనివాస చౌదరి అధికారులకు వాంగ్మూలం ఇవ్వడం విస్తుగొల్పుతోంది.

అక్కడున్న డిటోనేటర్లు కూడా తనవి కాదని పేర్కొనడంతో అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. క్వారీ యజమాని అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అతన్ని రక్షించేందుకు ఈ మొత్తం నాటకాన్ని తెరమీదకు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్తిబెళగల్‌ పేలుడు ఘటనపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక పూర్తికాలేదని తెలిసింది. పేలుడు ఘటనలో బాధ్యులను తేల్చేందుకు అధికారులు మరింత లోతుగా జార్ఖండ్, ఒడిశాలకు వెళ్లి విచారణ చేస్తారా? లేక పైపైన పూతలు పూసి నివేదికను తుస్సుమనిపిస్తారా అన్నది చూడాల్సి ఉంది. 

అనేక ఆరోపణలు... 
హత్తిబెళగల్‌ గ్రామానికి ఆనుకుని ఉన్న విఘ్నేశ్వర క్రషర్స్‌ కంపెనీ ఆధ్వర్యంలోని క్వారీలో పేలుళ్లు చేపట్టడంపై గ్రామస్తులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ పేలుళ్ల వల్ల తమ గ్రామంలో భూకంపం వచ్చినట్టుగా భూమి కంపించడంతో పాటు ఎప్పుడు ఇళ్లు కూలుతాయోనన్న ఆందోళనతో జీవించారు. దీనిపై అనేకసార్లు అధికారులను కలిసి విన్నవించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఏకంగా క్వారీలోనే బైఠాయించి నిరసన కూడా తెలిపారు.

అయినప్పటికీ అధికారుల అండదండలతో కనీసం అగ్నిమాపక శాఖ అనుమతి కూడా లేకుండానే పేలుళ్లు జరిపారు. ఈ క్వారీపై గ్రామస్తుల నిరసనను అధికారులు పట్టించుకోలేదు. పైగా నెలవారీ మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఏడాది ఆగస్టు 3న భారీ పేలుడు జరిగి కూలీలు చనిపోయిన తర్వాత ప్రభుత్వం స్థానిక అధికారులను బదిలీ చేసి చేతులు దులిపేసుకుంది. ఘటన జరిగి సుమారు నాలుగు నెలలు కావస్తున్న తరుణంలో మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించే విధంగా క్వారీ యజమాని మాట మార్చడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఇదీ ఘటన.. ఆలూరు పట్టణానికి కూతవేటు దూరంలో హత్తిబెళగల్‌ వద్ద ఆగస్టు 3వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో డిటోనేటర్లు పేలి భారీ విస్పోటం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది మృతిచెందారు. వీరంతా జార్ఖండ్, ఒడిశా రాష్ట్ర వాసులు. వీరిని ఒడిశా రాష్ట్రానికి చెందిన లేబర్‌ కాంట్రాక్టర్‌ కైలాష్‌ ద్వారా పనికి పిలిపించుకున్నారు.  క్వారీకి సమీపంలోని ఒక షెడ్డులో ఉండేవారు. ఇక్కడే లారీలో భారీగా డిటోనేటర్లను ఉంచారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో డిటోనేటర్లు పేలాయి. అప్పుడే వండుకున్న అన్నం ముద్దలను నోట్లో పెట్టుకుంటున్న సమయంలో కూలీలు అగ్నికి ఆహుతైపోయారు.

వీరంతా వేరే రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో పాటు వీరి గురించి అడిగే కుటుంబాలు కూడా లేకపోవడంతో మృతదేహాలను అప్పుడే తరలించారు. ఈ కూలీలు ఎక్కడ పనిచేస్తున్నారన్న రికార్డులను కూడా ఎవరూ నిర్వహించలేదు. అయితే, సమీప గ్రామ ప్రజలు మాత్రం వీరంతా విఘ్నేశ్వర క్వారీలోనే పనిచేస్తున్నారని సంఘటన సమయంలో పేర్కొన్నారు. అయితే, అధికార పార్టీ నేతలు మాత్రం క్వారీ యజమానిని రక్షించేందుకు ప్రస్తుతం కొత్త నాటకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. క్వారీ యజమాని మాట మార్చిన నేపథ్యంలో అధికారులు మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top