ప్చ్.. అమలుకు నోచుకోని హామీలు | Guarantees did not implemantion | Sakshi
Sakshi News home page

ప్చ్.. అమలుకు నోచుకోని హామీలు

Jun 8 2016 12:49 AM | Updated on Jul 28 2018 3:33 PM

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి నేటికి సరిగ్గా రెండేళ్లయింది. ఈ రెండేళ్లూ చంద్రబాబు పాలన మొత్తం రాజధాని చుట్టూనే తిరుగుతోంది.

రాజధాని చుట్టే చక్కర్లు
అయినా ఒక్క అడుగూ ముందుకు పడని వైనం
ప్రజా సమస్యలు గాలికి
రుణమాఫీ పుణ్యంతో కొత్త రుణాలకు కోత
నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఊసే లేదు
కాసుల వేటలో అధికార పార్టీ నేతలు
అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు.. దాడులు

అమరావతి : ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి నేటికి సరిగ్గా రెండేళ్లయింది. ఈ రెండేళ్లూ చంద్రబాబు పాలన మొత్తం రాజధాని చుట్టూనే తిరుగుతోంది. అదీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల ప్రారంభం తప్ప ఒక్క అడుగూ ముందుకు పడకపోవటం గమనార్హం. ఇకపోతే ప్రజలకు ఏమైనా చేశారా అంటే.. శూన్యమనే చెప్పాలి. అధికార యంత్రాంగం మొత్తం రాజధాని నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నామంటూ రెండేళ్లు పూర్తిచేశారు. సీఎం, మంత్రులు, చైనా, జపాన్, సింగపూర్ బృందాల సేవలకే వారు పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తంగా కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలకు చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదు.

 
తొలిరోజు నుంచీ షాకులే...

సరిగ్గా రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆరోజు కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తారని ఆశతో ఓట్లేసి గెలిపించారు. అదేరోజు వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆరోజు దశలవారీగా.. లక్షలోపు రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆ రోజు మొదలైన చంద్రబాబు షాక్‌లు నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.


ల్యాండ్ పూలింగ్ పేరుతో బలవంతపు భూసేకరణ
రాజధాని పేరు చెప్పి గుంటూరు జిల్లా పరిధిలోని 29 గ్రామాల పరిధిలోని రైతుల నుంచి భూముల సేకరణకు నిర్ణయించారు. రైతులు అడ్డం తిరగటంతో ల్యాండ్‌పూలింగ్ పేరుతో బలవంతంగా భూములను లాక్కున్నారు. భూములు తీసుకునే సమయంలో పాలకులు రకరకాల హామీలు ఇచ్చారు. నేటికీ ఒక్క హామీ కూడా అమలు కాకపోవటం గమనార్హం. ఇదే ల్యాండ్‌పూలింగ్ పేరుతో బందరు పోర్టు, గన్నవరం విమానాశ్రయం, ఏలూరు కాలువ మళ్లింపునకు భూ సేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. అక్కడి రైతులు ఎదురుతిరగటంతో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురిచేసింది.

 
రుణాలు మాఫీ కావు...  కొత్త రుణాలు ఇవ్వరు

రైతు, డ్వాక్రా రుణాలు ఇప్పటి వరకు మాఫీ కాకపోవటం గమనార్హం. మొదటి విడతగా విడుదల చేసిన నిధులు వారు తీసుకున్న వడ్డీకే చాల్లేదు. రెండో విడత నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు మాఫీ చేస్తానని చెప్పి ఏడాదికి రూ.3 వేల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. దీంతో అటు రైతులు.. ఇటు డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. రుణాలు కావాలంటే తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలని పట్టుబడుతున్నారు.

 
బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవటంతో అనేక మంది బంగారు ఆభరణాలను బ్యాంకర్లు వేలం వేశారు. తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 
ఇసుక, మట్టిని అమ్ముకున్న తమ్ముళ్లు

కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాతో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. డ్వాక్రా మహిళల ముసుగులో తెలుగు తమ్ముళ్లు తెగబడ్డారు. అడ్డుకున్న స్థానికులు, అధికారులపై దాడులకు తెగబడ్డారు. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పలుచోట్ల స్థానికులపై దాడులు చేశారు. నిలదీసిన వారిపై తప్పుడు కేసులు బనాయించారు. నీరు-చెట్టు పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతలు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. గతంలో ఉపాధి హామీ కింద చేపట్టిన పనులను చూపించి బిల్లులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. చెరువుల్లోని మట్టిని సైతం అమ్మి సొమ్ము చేసుకోవటం గమనార్హం.


ప్రొటోకాల్ బిజీలో అధికార యంత్రాంగం
అమరావతిని రాజధానిగా ప్రకటించటం, నిర్మాణానికి వివిధ దేశాల ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పాలన అంతా విజయవాడ కేంద్రంగా చేసుకోవటంతో సీఎం, మంత్రులు, చైనా, జపాన్, సింగపూర్ నుంచి ప్రతినిధులు పలుమార్లు విజయవాడకు వచ్చారు. సీఎం, మంత్రులు విజయవాడ కేంద్రంగా ఉండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు వారికి వసతి సౌకర్యాలతో పాటు, సమావేశాలకు ఏర్పాట్లు చేయటంలోనే రెండేళ్లు గడిచిపోయింది. దీంతో ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి.

 
పెరిగిన ఇంటి అద్దెలు..  నిత్యావసర వస్తువుల ధరలు

అమరావతిని రాజధానిగా ప్రకటించటంతో విజయవాడ, గుంటూరు పరిధిలో నివాసాల అద్దెలు అమాంతం పెంచేశారు. రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల పరిధిలో 34 వేల ఎకరాలకు పైగా భూములు తీసుకోవటంతో ఆ ప్రాంతం అంతా ముళ్లచెట్లను తలపిస్తోంది. కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెంచేశారు. దీంతో సామాన్యుడి జీవనం భారంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement