భూగర్భ జలాల సంరక్షణ అత్యవసరం | Groundwater protection is essential | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాల సంరక్షణ అత్యవసరం

Mar 16 2016 1:28 AM | Updated on Oct 16 2018 6:15 PM

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూగర్భ జలాల సంరక్షణతోనే మంచినీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు.

 పలాస:పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూగర్భ జలాల సంరక్షణతోనే మంచినీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. ఇందుకోసమే నీరు-చెట్టు పథకం కింద నిధులు ఖర్చు పెట్టి చెరువులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాశీబుగ్గ శివరామ కల్యాణ మండపంలో మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో మంచినీటి సమస్య అనే అంశంపై చర్చా వేదిక జరిగింది. సాక్షి ప్రతి నిధి యూవీ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ చర్చా వేదికలో మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
 
  వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కోత పూర్ణచంద్రరావుతో పాటు మున్సిపల్ అధికారులు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో అన్ని మున్సిపాలి టీలకు నీటి వనరులు ఉన్నాయని, ఇక్కడ మాత్రం ఎలాంటి నదులు కూడా అందుబాటులో లేవని చెప్పారు. ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పూర్తయితే మంచినీటి సమ స్య శాశ్వతంగా పరిష్కారమవుతుందన్నారు. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఉద్దానం మంచినీటి పథకం నుంచి తాగునీరు అందించడానికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఆటంకం కలిగించారని, దాంతో మళ్లీ తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు.
 
  ఆ తర్వాత తాత్కాలిక ప్రాతిపదికన జగన్నాథసాగరంలో 2 బావులను, మిగతా చోట్ల 3 బావులు ఏర్పాటు చేసి మున్సిపాలిటీకి నీరు అంది స్తున్నట్లు తెలిపారు. ఆ బావులు కూడా ఎండిపోవడంతో సమస్య వచ్చిందన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న విషయాన్ని కూడా గుర్తించి ప్రతి వార్డులో పవర్ బోరు ఏర్పాటు చేశామన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలోని చెరువుల అభివృద్ధికి మొత్తం రూ.కోటి 20 లక్షలు వెచ్చిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు ఇంకుడు గోతులను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను కాపాడుకోవాలని సూచించారు. 2017 నాటికి ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. సాగునీటి చెరువులు కబ్జాకు గురవకుండా చర్యలు తీసుకుంటామని, చెరువులను సర్వే చేయించి కబ్జా జరిగి ఉంటే తొలగిస్తామని చెప్పారు.
 
 కార్యక్రమంలో పలాస-కాశీబుగ్గ పట్టణ  పౌరులతో పాటు మున్సిపల్ కమిషనర్ బీఆర్‌ఎస్ శేషాద్రి, మున్సిపల్ డీఈ చిరంజీవి, ఏఈ సత్యనారాయణ, వివిధ ప్రజా సంఘాల నాయకులు దువ్వాడ శ్రీకాంత్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు తాళాసు ప్రదీప్‌కుమార్, అధికార ప్రతినిధి బళ్ల గిరిబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి గాలి కృష్ణారావు, మాజీ ఎంపీపీ నిమ్మాన బైరాగి, మున్సిపల్ కౌన్సిలర్ కొవ్వూరు సురేష్‌కుమార్, కొంచాడ రాజాశ్రీకాంత్, తంగుడు వీర్రాజు, లోక్‌సత్తా పార్టీ నాయకులు తమ్మినేని మాధవరావు, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు బమ్మిడి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement