ఏపీలో కొత్తగా ఏర్పాటుచేయతలపెట్టిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో వచ్చే ఏడాదినుంచి ప్రవేశాలకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కొత్తగా ఏర్పాటుచేయతలపెట్టిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో వచ్చే ఏడాదినుంచి ప్రవేశాలకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్) ఫర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ వెబ్‌సైట్లో ఈ అంశాన్ని పొందుపరిచారు. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు ఏపీ ఐఐఎంను కూడా కలిపారు.
దీంతోపాటు ఈ ఏడాది కొత్తగా ఏర్పాటుచేయబోతున్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర ఐఐఎంలలోనూ ప్రవేశాలు కల్పించడానికి నిర్ణయించారు. ఇంతకుముందు అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇండోర్, కాశీపూర్, కొజికోడ్, లక్నో, రాయపూర్, రాంచీ, రోహతక్, షిల్లాంగ్, తిరుచిరాపల్లి, ఉదయపూర్‌లలో ఐఐఎం క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఏడాదినుంచి కొత్తగా ఏపీతోసహా ఆరు ఐఐఎంలు జతకానున్నాయి. క్యాట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. అర్హులైన అభ్యర్థులకు ఈ ఐఐఎంలలో ప్రవేశాలు కల్పిస్తారు.
5న శంకుస్థాపన
ఏపీకి మంజూరైన ఐఐఎంను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదినుంచి ప్రవేశాలకు వీలుగా తాత్కాలిక భవనాలను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఇటీవల నిర్మించిన భవనాలను ఐఐఎంకు కేటాయించారు. శాశ్వతభవనాలకోసం విశాఖ సమీపంలోని గంభీరంవద్ద ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.
ఈ స్థలానికి కేంద్ర బృందం కూడా అంగీకారం తెలిపింది. జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆరోజున కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతిఇరానీ విశాఖపట్నం రానున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లకు కూడా వచ్చే నెలలో శంకుస్థాపన ఉంటుందని అధికారులు తెలిపారు.