సౌకర్యం ఉన్నా..ఫలితం సున్నా..!

The Government Hospitals Too But Blood Deposits are Much Less - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు : ప్రాణాపాయంలో రక్తం ద్వారా మనిషిని కాపాడవచ్చు. ఎలాంటి ఆస్పత్రుల్లోనైనా మొదటి ప్రాధాన్యత రక్తానిదే. రక్తపు నిల్వలు అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం రక్తపు నిల్వలు లభించడం కష్టతరంగా మారింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాకు రక్తసేకరణ, రవాణా వాహనాన్ని మంజూ రు చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోజూ ఆయా ప్రాంతాల్లో రక్తాన్ని సేకరించి ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రజాదరణ లేక రక్త సేకరణలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అన్ని సౌకర్యాలు కలిగిన వాహనం ఉన్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. 

రూ.48లక్షలతో వాహనం ఏర్పాటు
జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా దేశంలోని మిగతా జిల్లాలతోపాటు వైఎస్సార్‌ జిల్లాకు రక్తసేకరణ, రవాణ వాహనాన్ని మంజూరు చేశారు. ఇందు కోసం రూ.48లక్షలు వెచ్చించారు. 2017 సెప్టెంబర్‌ 19న ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఏసీతో కూడిన ఈ వాహనంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా ఈ వాహనం పనిచేస్తోంది.

స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకు డాక్టర్‌ కవిత వాహన నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాహనానికి ఇరువురు ల్యాబ్‌ టెక్నీషియన్లతోపాటు డ్రైవర్‌ ఉన్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్లకు నెలకు రూ.19వేలు చొప్పున, డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున వేతనాలు ఇస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో తిరిగినందుకు నెలకు సుమారు రూ.15వేలు డీజల్‌ ఖర్చు వస్తోంది.

నెరవేరని లక్ష్యం
నిబంధనల ప్రకారం ఈ వాహనం ద్వారా నెలకు 1500 యూనిట్ల రక్తాన్ని సేకరించాల్సి ఉంది. అయితే ఇందులో సగం యూనిట్ల రక్తం కూడా సమకూరడం లేదని తెలుస్తోంది. 2017లో 1481 యూనిట్లు, 2018లో 3,704 యూనిట్లు మాత్రమే రక్తాన్ని సేకరించారు. కొన్ని నెలల్లో 120 యూనిట్ల రక్తం మాత్రమే సేకరించారు. ప్రధానంగా ప్రచారం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

సేకరించిన రక్తాన్ని ప్రతి నెల పులివెందుల, ప్రొద్దుటూరు, కడపలోని మదర్‌ బ్లడ్‌బ్యాంకులకు అందించాల్సి ఉంది. వీటి ద్వారా జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో రక్తాన్ని నిల్వ చేస్తారు. ప్రతి నెల ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి 500 యూనిట్లు, రిమ్స్‌కు 2వేల యూనిట్లు రక్తపు నిల్వలు అవసరమని సమాచారం. అయితే తగినంత రక్తపు నిల్వలు రాకపోవడంతో ప్రాణాపాయంలో ఉన్న వారు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లో రక్తం తీసుకోవాలంటే తప్పనిసరిగా బదులు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top