
కస్తూర్బా విద్యార్థినులకు మంచినీటి కష్టాలు
పేరుకే ప్రభుత్వ బాలికా విద్యాలయం.. మూడు నెలలుగా నుంచి మంచినీటి సదుపాయం లేకపోవడంతో వందలాది మంది విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిలకలూరిపేట రూరల్, న్యూస్‌లైన్
పేరుకే ప్రభుత్వ బాలికా విద్యాలయం.. మూడు నెలలుగా నుంచి మంచినీటి సదుపాయం లేకపోవడంతో వందలాది మంది విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పోతవరంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయానికి ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నా.. పాతబిల్లులు మంజూరు కాలేదని నిలిపివేశారు.
మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఓగేరు వాగులో బోర్‌వెల్ వేసినా పైపు లైన్ ఏర్పాటును విస్మరించారు. ఈ విషయంలో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో విద్యార్థినులు చాలీచాలని నీటితో పాట్లు పడుతున్నారు. అసలే ఆ గ్రామాన్ని ఫ్లోరైడ్ గ్రామంగా అధికారులు గుర్తించారు. బోర్‌వెల్ నీటిని వినియోగించే అవకాశంలేకుండా పోయింది.
విద్యాలయంలో ఉన్న నిధులను ప్రత్యేకంగా మంచినీటి వినియోగానికి ఖర్చుచేశారు. వారం రోజుల నుంచి ఉన్న నిధులు సైతం ఖర్చుకావడంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 200 మంది విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు. పది రోజులగా మంచినీటి సమస్య తీవ్రమవడంతో విద్యార్థినులు కన్నీటి పర్యంతమై ఇళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ..
జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ 2012 జూలై 20న విద్యాలయాన్ని సందర్శించి.. విద్యార్థినుల విన్నపం మేరకు మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం నిమిత్తం రూ. ఐదు లక్షల నిధులు విడుదల చేశారు. అప్పటివరకు పురపాలక సంఘానికి చెందిన మంచినీటి ట్యాంక్‌ల నుంచి రోజుకు రెండు ట్యాంకర్ల నీటిని అందించాలని ఆదేశించారు. ఏడాది క్రితం అధికారులు బోర్‌వెల్ ఏర్పాటుచేసి వాటికి మోటార్లు బిగించారు. ఆ నీటిని గ్రామంలోని ఓవర్ హెడ్‌ట్యాంక్‌కు వినియోగిస్తున్నారు.
ఓవర్‌హెడ్ ట్యాంక్ నుంచి విద్యాలయానికి పైపు లైన్ ఏర్పాటుపై అధికారులు దృష్టిసారించకపోవడం గమనార్హం! దీనిపై విద్యాలయం ప్రత్యేకాధికారి ఎస్పీటీ కుమార్‌ను న్యూస్‌లైన్ ప్రశ్నించగా మంచినీటి ట్యాంకర్లకు బిల్లులు మంజూరు కాలేదని గ్రామీణ నీటి సరఫరా అధికారులు పేర్కొంటున్నారని చెప్పారు.
బిల్లులు వచ్చాక ట్యాంకర్ల ద్వారా నీరందిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. పైపులైన్ విషయం ప్రస్తావించగా అధికారుల నుంచి సమాధానాలు లభించడం లేదన్నారు. గ్రామీణ నీటి సరఫరా డీఈ వెంకటేశ్వరరావును ప్రశ్నించగా ఎన్నికల సమావేశంలో ఉన్నామని తర్వాత మాట్లాడతానని దాటవేశారు.