ఉద్యోగుల ‘వేదన’ బతుకులు

Government , Contract And Outsourcing Employees  Are Anguish In TDP Government - Sakshi

సాక్షి, చిత్తూరు :  ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రైవేటు ఉద్యోగులనే తేడా ఉండదు. అందరూ సమానమే. ఎప్పుడు చూసినా వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తుంటారు. విజయవాడలోని ప్రధానశాఖ నుంచి రిపోర్టులు పంపమని ఆదేశాలు జారీచేస్తుంటారు. ప్రభుత్వ పథకాలను టీడీపీకి లబ్ధిచేకూర్చే పథకాలుగా మార్చేస్తుంటారు.

వాటిపై ప్రచారాలు చేయాలంటూ చిరుద్యోగులపై ఒత్తిడి పెంచేస్తుంటారు. కాదన్న వారిని నిర్ధాక్షణ్యంగా తొలగించేస్తుంటారు. లేదంటే మానసిక క్షోభకు గురిచేయడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. జిల్లాలో ఈ ఐదేళ్లలో ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు పడ్డ బాధలు అన్నీఇన్నీకావు. ఎవరిని కదిలించినా కష్టాలగాథలే. టీడీపీ పాలనలో చితికిపోయిన తమ బతుకుల గురించి కళ్లల్లో నీళ్లు పెట్టుకుని మరీ చెప్పడం కలచివేస్తోంది.     

కుటుంబ జీవితాలకు దూరం 
జిల్లాలో దాదాపు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే.. వీరికి సమానంగా ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ఉద్యోగికీ కనీస పనిగంటలనేవి లేవు. గడిచిన ఐదేళ్లలో ఉద్యోగులు ఎనిమిది గంటలు పనిచేసి ఇళ్లకు వెళ్లిన దాఖలాలులేవు. పైగా సెలవు రోజుల్లో కూడా కార్యాలయాల్లో కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి. వ్యక్తిగత జీవనంతో పాటు కుటుంబ జీవితానికి వారు దాదాపు దూరమైపోయారు.

గొడ్డుచాకిరీ చేసినా కాంట్రాక్టు ఉద్యోగుల కనీస వేతనాలు సగటున రూ.15 వేలు కూడా రాలేదు. చాలీచాలని జీతాలతో మూడు పూటలు గడవని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తికాదేమో. ఓ ఆశా వర్కర్‌కు పారితోషికంతో కలిపి నెలకు రూ.6 వేలు వస్తే ఇద్దరు పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చదివించి, ఇల్లు గడపడానికి ఏటా రూ.50 వేల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి. 

మరణమే శరణమా?
జిల్లా వెలుగు శాఖలో పనిచేసే పది మంది వరకు ఈ ఐదేళ్లలో చనిపోయారు. మితిమీరిన పని ఒత్తిడే ఈ మరణాలకు కారణం. మృతుల్లో మొలకలచెరువుకు చెందిన ఏరియా కో–ఆర్డినేటర్‌ రమేష్, కార్వేటినగరం ఏరియా ప్రాజెక్టు మేనేజరు గిరిజ, క్లస్టర్‌ కో–ఆర్డినేటర్‌ భాస్కర్, చిన్నగొట్టిగల్లు క్లస్టర్‌ కో–ఆర్డినేటర్‌ చెంగల్రాయులు ఉన్నారు. ఇదేశాఖకు చెందిన గంగవరం క్లస్టర్‌ కో–ఆర్డినేటర్‌ గురుమూర్తి, గుడిపాలకు చెందిన వెంకటేశులు పక్షవాతంతో మంచాన పడ్డారు.

మదనపల్లె మునిసిపాలిటీలో 2016లో శ్రీనాథ్‌ అనే కాంట్రాక్టు ఉద్యోగి చెప్పినపని చేయలేదంటూ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు విధుల్లో నుంచి తొలగించడం.. అతను ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సుల్లో సమాధానాలు చెప్పలేక పుత్తూరు మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన సాంబశివరావు పక్షవాతంతో మంచంపట్టిన విషయం మరచిపోలేరు.

వేతనాల్లేక విలవిల
జిల్లా వైద్యశాఖలో పనిచేసే 3,250 మంది ఆశా వర్కర్లకు పారితోషికం రూ.5,600, గౌరవ వేతనం రూ.3 వేలు ఇస్తామంటూ గతేడాది ఆగస్టులో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వేతనాలు అందాలి. కానీ మూడు నెలలుగా రూపాయి వేతనం ఇవ్వలేదు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి చెల్లించాల్సిన జీతాలను ఇవ్వడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తోంది. చిత్తూరులో పనిచేసే 3 వేల మంది హోంగార్డులకు బడ్జెట్‌లేదనే సాకుతో ఐదు నెలలుగా జీతాలివ్వలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్న మహిళా సంఘాలకు మూడు     నెలలుగా రూ.2.51 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. 

కాంట్రాక్టు ఉద్యోగుల వెతలు
జిల్లా గృహనిర్మాణశాఖలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న 400 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే (2014లో) తొలగించింది. ప్రతి మండలంలో ఐదుగురు ఉన్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల స్థానంలో ప్రస్తుతం ఒక్కరే పనిచేయాల్సి వస్తోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో 2005 నుంచి పనిచేస్తున్న 380 మంది ఫీల్డు అసిస్టెంట్లపై పనితీరు నివేదిక బాగాలేదని నాలుగేళ్ల క్రితం వేటు వేశారు.

వ్యవశాయశాఖలో పనిచేసిన 2,800 మంది ఆదర్శరైతులు అవసరం లేదంటూ తీసేశారు. ఐదేళ్ల క్రితం వీరిని తొలగించే సమయానికి ఒక్కో ఆదర్శరైతుకు రూ.5 వేలు చొప్పున వేతనాలను ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం కూడా సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న రిసోర్సుపర్సన్లను, ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిపి 3,800 మందిని ప్రభుత్వం తొలగించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top