ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండండి

Gopal krishna Dwivedi Says Be vigilant in counting of votes - Sakshi

అధికారులకు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు

లోక్‌సభ, శాసనసభ ఈవీఎంలు తీసుకొచ్చే సిబ్బందికి డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి 

నియోజకవర్గ స్థాయిలో ఆర్వో, ఏఆర్వోలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వండి 

కౌంటింగ్‌ ఏజెంట్ల నేర చరిత్రను కూడా పరిశీలించండి 

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాక మీద ఉన్న నేపథ్యంలో 23న జరిగే కౌంటింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సచివాలయంలో ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్‌ అధికారులు, ఇతర అధికారులతో ఆయన రాష్ట్ర స్థాయి శిక్షణా సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌లో ఎటువంటి తప్పులు దొర్లకుండా, ఎన్నికల నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌కు వచ్చే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ప్రతి అంశంపై అవగాహన ఉంటుంది కాబట్టి అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

ఏవైనా ఈవీఎంల్లో సమస్యలొస్తే వాటిని చివరి రౌండ్‌కు మార్చి అప్పుడు పరిశీలించాలని సూచించారు. అదేవిధంగా మాక్‌ పోలింగ్‌ సందర్భంగా నమోదైన ఓట్లను కొన్ని చోట్ల వీవీ ప్యాట్స్‌ నుంచి తొలగించకపోతే వాటిని అభ్యర్థుల సమక్షంలో లెక్కించి వారికి వివరించాలన్నారు. మాక్‌ పోలింగ్‌ వివరాలు అన్ని పార్టీల ఏజెంట్ల వద్ద ఉంటాయి కాబట్టి వాటితో సరిపోల్చి వివరించాల్సిందిగా కోరారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి కౌంటింగ్‌ హాళ్లకు ఈవీఎంలు తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, గందరగోళానికి తావు లేకుండా ఉండేందుకు లోక్‌సభ, శాసనసభ బ్యాలెట్‌ బాక్సులు తీసుకొచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ ఇవ్వాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు నియోజకవర్గ స్థాయిలో కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు. తొలిసారి వీవీప్యాట్‌లను కూడా లెక్కిస్తుండటంతో దీనిపై సిబ్బందికి తగిన అవగాహన కల్పించాలని సూచించారు.  

ప్రతి ఏజెంటుకు ఐడీ కార్డు 
కౌంటింగ్‌ హాల్‌లోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సెల్‌ఫోన్లను అనుమతించేది లేదని ద్వివేది స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు తప్ప ఇతరులెవరూ సెల్‌ఫోన్లు లోపలికి తీసుకువెళ్లడానికి వీల్లేదన్నారు. కాబట్టి సెల్‌ఫోన్లను భద్రపరచడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను పోలీసులు పరిశీలించి నేరచరిత్ర ఉంటే తిరస్కరించాలని సూచించారు. ప్రతి ఏజెంటుకు ఐడీ కార్డు ఇవ్వడంతోపాటు ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలిపేలా సెంట్రల్‌ పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని తొలగించాలి 
ఉద్యోగులు గతంలో ఎన్నో ఎన్నికల్లో విధులు నిర్వహించినా ఈసారి ఎదుర్కొన్నంత ఒత్తిడి ఎప్పుడూ ఎదుర్కోలేదని జాయింట్‌ కలెక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు బాబూరావు.. ద్వివేది దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సిబ్బందిలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా 12 మంది అధికారులపై తీసుకున్న చర్యలపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ద్వివేది స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఎంతవరకు తప్పు చేస్తే ఆ మేరకే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి డి.మార్కండేయులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ఎన్‌ఐసీ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top