గోదావరిలో పెరుగుతున్న వరద | godavari water level growing | Sakshi
Sakshi News home page

గోదావరిలో పెరుగుతున్న వరద

Aug 16 2013 5:04 AM | Updated on Oct 9 2018 4:44 PM

మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో గోదావరికి వరద తాకిడి పెరిగింది. దీనికి తోడు ఎగువన కురుస్తున్న వర్షాలతో కందకుర్తి వద్ద మంజీరా, హరిద్ర నదుల్లో నీరు వచ్చి చేరడంతో త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది.


 రెంజల్, న్యూస్‌లైన్ : మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో గోదావరికి వరద తాకిడి పెరిగింది.   దీనికి తోడు ఎగువన కురుస్తున్న వర్షాలతో కందకుర్తి వద్ద మంజీరా, హరిద్ర నదుల్లో నీరు వచ్చి చేరడంతో  త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది. నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది. పవిత్ర స్నానాలకు వచ్చే భక్తులు ఘాట్ల పైనే స్నానాలు ఆచరిస్తున్నారు.
 
 ఎస్సారెస్పీ గేట్ల మూసివేత..
 బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి వరద తగ్గు ముఖం పట్టడంతో వరద గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు గురువారం మధ్యాహ్నం మూసివేశారు.  బుధవారం 13 వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు గురువారం ఉదయం నాలుగు గేట్లకు కుదించారు. మధ్యాహ్నం వరకు ఎగువ  ప్రాంతాల నుంచి  వరద మరింత తగ్గుముఖం పట్టడంతో  గోదావరిలోకి నీటి విడుదలను పూర్తిగా నిలిపి వేశారు.  ప్రాజెక్ట్‌లోకి  20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారానికి మరింత పెరిగే అవకాశముంది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా  ఆరు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా ఆరువేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, గురువారం  సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో అంతే స్థాయిలో నీరు నిల్వ  ఉంది. ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు 24 టీఎంసీల నీరు గోదావరిలోకి వదిలినట్లు అధికారులు తెలిపారు.
 
 నిలకడగా నిజాంసాగర్ నీటిమట్టం
 నిజాంసాగర్ : జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1399.75 అడుగులతో 11.096 టీఎంసీలు ఉంది. ఎగువన ఉన్న పోచారం ప్రాజెక్టు ద్వారా సాగర్‌లోకి 1258 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
 
 సింగూరులోకి భారీగా వరద..
 ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7887 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 520.600 మీటర్లతో 16.886 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
 
 సింగితం ద్వారా నీటి విడుదల..
 మండలంలోని సింగితం రిజర్వాయర్ ద్వారా సాగర్ మొదటి ఆయకట్టుకు 324 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు వస్తుండటంతో ప్రధాన కాలువకు ఒక గేటు ద్వారా వదులుతున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement