చివరి చూపైనా దక్కేనా..!

Godavari River Boat Tragedy - Sakshi

ఇంకా లభించని ఆరుగురి ఆచూకీ

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు 

సమాచారం కోసం ఎదురుచూపులు 

సాక్షి, విశాఖపట్నం : ఎక్కడున్నారో.. ఏమైపోయారో.. చివరి చూపైనా దక్కుతుందా.. అని గోదారి బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. గోదారమ్మ ఆగ్రహానికి గల్లంతైన తమ కుటుంబ సభ్యుల్ని కడసారి చూసేందుకు ఎదురు చూసీ.. చూసీ.. కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. ఇప్పటికే 11 మంది మృతదేహాలు స్వగృహాలకు చేరుకున్నాయి. ఇంకా ఆరుగురి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో జిల్లాకు చెందిన 18 మంది గల్లంతవ్వగా వారిలో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గోపాలపురం గ్రామానికి చెందిన భూసాల లక్ష్మి ఇంటికి చేరుకున్నా కళ్లముందే తన బంధువులను కోల్పోయిన ఘటన నుంచి తేరుకోలేదు. అందరితో వెళ్లి ఒంటరిగా వచ్చిన లక్ష్మి షాక్‌లోనే ఉంది. గల్లంతైన 17 మందిలో ఇప్ప టి వరకూ 11 మంది మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం ప్రభుత్వం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. ఓవైపు ప్రతికూల వాతావరణం ఎదురవుతున్నా  సూర్యాస్తమయం వరకూ బాధితుల ఆచూకీ కోసం సహాయక బృందాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

రామలక్ష్మి కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు మృతదేహం మాత్రమే లభ్యమైంది. ఆయన భార్య అరుణకుమారి, పిల్లలు అఖిలేష్, కుషాలి ఆచూకీ లభ్యం కాలేదు. ఆరిలోవ దుర్గాబజారు ప్రాంతానికి చెందిన తలారి అప్పల నర్సమ్మ మృతదేహం మాత్రమే దొరకగా.. ఆమె వెంట వెళ్లిన మనవరాళ్లు గీతా వైష్ణవి, ధాత్రి అనన్య ఆచూకీ దొరకలేదు. గాజువాకకు చెందిన బాచిరెడ్డి స్వాతి, ఆమె కుమార్తె హాన్సిక మృతదేహాలు మంగళవారం దొరకగా భర్త బాచిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి మృతదేహం బుధవారం లభించడంతో స్వస్థలం నంద్యాల తరలించారు. అతని కుమారుడు విఖ్యాత్‌రెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మిగిలిన వారి మృతదేహాలు స్వగృహానికి చేరుకున్నాయి. ఏ ఇంట చూసినా కన్నీటి సంద్రమే కనిపిస్తోంది. ఉన్నవారిని విగతజీవులుగా పంపిచావు.. మిగిలిన వారినైనా ప్రాణాలతో కాపాడు.. లేకుంటే.. కనీసం కడచూపునకైనా నోచుకోనివ్వు భగవంతుడా అంటూ ప్రతి కుటుంబం కన్నీరు మున్నీరై విలపిస్తోంది.

కొనసాగుతున్న సహాయక చర్యలు.. 
బుధవారం రాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. తెల్లవారింది మొదలు సూర్యాస్తమయమయ్యే వరకూ రక్షణ బృందాలతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపడుతోంది. తమ వారి ఆచూకీ ఈ రోజైనా దొరకకపోతుందా అనే ఆశతో బంధువులు, కుటుంబ సభ్యులు గోదారి గట్టుపైనే నిరీక్షిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top