జల మోహిని.. జన వాహిని | Godavari Pushkaralu 2015 | Sakshi
Sakshi News home page

జల మోహిని.. జన వాహిని

Jul 17 2015 2:07 AM | Updated on Sep 3 2017 5:37 AM

జల దేవత చెంత జన వాహిని పరవళ్లు తొక్కింది. గోదారమ్మకు నిండు మనసుతో మొక్కింది. పూలూ.. పసుపుగా.. పారాణి రాణిగా.. సౌభాగ్య ధాత్రిగా

జల దేవత చెంత జన వాహిని పరవళ్లు తొక్కింది. గోదారమ్మకు నిండు మనసుతో మొక్కింది. పూలూ..  పసుపుగా.. పారాణి రాణిగా.. సౌభాగ్య ధాత్రిగా విలసిల్లే ఆ సిరుల తల్లిని చల్లగా చూడమని తరుణీ లోకం  వేడుకుంది. పాపాలను.. శాపాలను కడిగేసే ఆ పావని ఒడిలో భక్తజనం మూడు మునకలేసి అలౌకిక ఆనందం పొందింది. అమ్మ చెంతన పితృకర్మలు చేసి దివంగతులకు పుణ్య లోకాలను సంప్రాప్తం చేసింది.
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :అమావాస్య మిగులు.. గురువారం శుభదినం.. పుష్కర మహా సంబరంలో మూడో రోజైన గురువారం కూడా పశ్చిమాన రికార్డు స్థాయిలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఏర్పాట్లు అరకొరగానే ఉన్నా యాత్రికులు మాత్రం భక్తిపారవశ్యంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్నారు. జిల్లాలోని పుష్కర ఘాట్లన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కిక్కిరిసిపోయాయి. పుష్కర సంరంభం మొదలై మూడు రోజులైనా.. భక్తుల రాక పెరుగుతున్నా అధికారులు మాత్రం రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టలేకపోతున్నారు. కొవ్వూరు గౌతమీ ఘాట్‌లో రివాల్వర్ బయట పడటం కలకలం రేపింది. భక్తులను కొద్దిసేపు భయాందోళనకు గురిచేసిన ఈ ఘటనపై పోలీసులు మాత్రం తలాతోకా లేని సమాధానాలు చెప్పారు. పుష్కరాలు మొదలైన తర్వాత తొలిసారి జిల్లాలోని ఘాట్లను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పరిశీలించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ‘వెస్ట్ వర కు నేను హ్యాపీ..’ అని వ్యాఖ్యానించారు. కొవ్వూరులో అస్తవ్యస్తమవుతున్న ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు కలెక్టర్ కె.భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
 
 కిక్కిరిసిన నరసాపురం
 నరసాపురం పట్టణం గురువారం పుష్కర యాత్రికులతో కిక్కిరిసిపోయింది. వలంధర రేవు, లలితాంబ ఘాట్, కొండాలమ్మ ఘాట్, అమరేశ్వర ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. మూడోరోజు భక్తుల సంఖ్య మరింత పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికే ఒక్క వలంధర రేవులోనే లక్షమంది స్నానాలు చేశారు
 
 వేధిస్తున్న షెడ్ల కొరత
 పిండ ప్రదానాలు చేసేచోట షెడ్లు సరిపోక భక్తుల ఇబ్బం దులు కొనసాగుతున్నాయి.  గురువారం వేకువజామున నరసాపురంలో కురిసిన భారీ వర్షంతో భక్తులు అవస్థలకు గురయ్యారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేసినా ఉపయోగం లేదనే విషయం వర్షం నీటితో జలమయమైన రోడ్లు, భక్తుల అగచాట్లు రుజువు చేశాయి. బస్టాండ్‌లో తాత్కాలిక మరుగుదొడ్లు వర్షం నీటితో నిండిపోయాయి. వలంధర రేవులో పదేపదే విద్యుత్ వైర్లు తెగడం వంటి సమస్యలు తలెత్తాయి. ట్రాఫిక్ నిబంధనల పేరుతో బస్సులను, ఇతర వాహనాలను రెండు కిలోమీటర్ల దూరంలో నిలిపివేయడంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు, పురపాలక శాఖ మంత్రి కె.నారాయణ నరసాపురంలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఘాట్‌లను పరిశీలించారు. లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
 
 సిద్ధాంతంలో దిద్దుబాటు చర్యలేవీ
 పెనుగొండ మండలం సిద్ధాంతంలోని కేథారీ ఘాట్‌లో పుష్కరాల తొలిరోజు నుంచీ పిండ ప్రదానాల షెడ్లు, విశ్రాం తి భవనాలు లేక భక్తులు అవస్థలు పడుతున్నా అధికారులు ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఈ ప్రాంతంలో ఘాట్‌లను సందర్శించిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుని ఆధ్యాత్మిక పర్వానికి రాజకీయ రంగు పులిమారు. పెరవలి మండలం తీపర్రు, ముక్కామల, మల్లేశ్వరం ఘాట్లలో వేకువజాము నుంచి రద్దీ కనిపించింది. తీపర్రు ఘాట్ రేవులో నీరు లేకపోవడంతో భక్తులు అసంతృప్తికి లోనయ్యారు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం, పెండ్యాల ఘాట్లలో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. యలమంచిలి మండ లం దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం ఘాట్లలో కూడా పిండ ప్రదానాల షెడ్లులేక భక్తులు అవస్థలు పడ్డారు. ఆచంట మండలం కోడేరు ఘాట్‌లో షెడ్లు లేకపోవడంతో ఆరుబయటే పిండ ప్రదానాలు చేయాల్సి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement