బాబ్బాబు.. పోటీ చేయండి

Fresh Headache For TDP - Sakshi

అధికార పార్టీకి అభ్యర్థుల కరువు

తల పట్టుకుంటున్న సీఎం చంద్రబాబు  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అధికార టీడీపీ అభ్యర్థులు కరువయ్యారు. ఒక వైపు నామినేషన్ల గడువు సమీపించడంతో టీడీపీ అధిష్టానం నానా తంటాలు పడుతోంది. ఒంగోలు పార్లమెంటుతో పాటు దర్శి, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం  టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు  నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ డీజీపీ సాంబశివరావులలో ఒకరిని పోటీలో నిలపాలని ఆపార్టీ అధిష్టానం ఆలోచించింది.

అయితే ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు ఇరువురు నేతలు అంగీకరించలేదు. దీంతో మరోమారు అభ్యర్థి కోసం చంద్రబాబు గాలింపు మొదలుపెట్టారు. బయటి నుంచి ఎవరూ వచ్చే పరిస్థితి లేకపోవడంతో మంత్రి శిద్దా రాఘవరావునే ఒంగోలు బరి నుంచి పార్లమెంటుకు పోటీ చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు పోటీకి సిద్ధంగా ఉండాలని సీఎం శిద్దాను ఆదేశించారు. తాను దర్శి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని, ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయలేనని మంత్రి శిద్దా ముఖ్యమంత్రికి పలుమార్లు విన్నవించారు. అయితే ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో శిద్దా తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు మంత్రి శిద్దా అంగీకరించకపోవడంతో ముఖ్యమంత్రి మూడు రోజులుగా శిద్దాను బుజ్జగించారు. ఎట్టకేలకు బుధవారం జరిగిన సమావేశంలో సీఎం పోటీకి శిద్దాను ఒప్పించారు. మరోవైపు శిద్దా ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి అసెంబ్లీకి అభ్యర్థి దొరకని పరిస్థితి ఏర్పడింది.

దర్శి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ మరింత బలంగా ఉండడంతో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో తొలుత కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం కోరింది. అయితే బాబూరావు ఇందుకు ససేమిరా అన్నారు.  దర్శి నుంచి పోటీ చేయాల్సిందేనంటూ మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరితో పాటు మరి కొందరు నేతలు బాబూరావుపై ఒత్తిడి తెచ్చినా ఆయన వినలేదు. దర్శి నుంచి పోటీ చేసేది లేదని అవసరమైతే కనిగిరి నుంచి ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని బాబూరావు టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం వెనక్కు తగ్గింది. మరో వైపు ఇటీవల టీడీపీలో చేరి కనిగిరి సీటు ఆశిస్తున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డిని దర్శి అభ్యర్థిగా పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం కోరింది.

బుధవారం టీడీపీ ముఖ్యనేతలు ఉగ్ర ముందు  ఈ ప్రతిపాదనను ఉంచారు. తనకు కనిగిరి సీటు ఇస్తానంటేనే పార్టీలో చేరానని, దర్శి సీటు అవసరం లేదని ఉగ్ర తేల్చి చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దర్శి నుంచి పోటీ చేయాలని అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుందని టీడీపీ ముఖ్యనేతలు  ఉగ్రకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తన సొంత నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గంలో పోటీ చేయడం తనకు ఇబ్బందని, తాను దర్శి నుంచి పోటీ చేయలేనని ఉగ్ర నర్సింహారెడ్డి టీడీపీ నేతలకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ముందు సీఎంతో మాట్లాడాలని టీడీపీ ముఖ్యనేతలు ఉగ్రకు సూచించారు. ఇందుకు అంగీకరించని ఉగ్ర సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకుని ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఉగ్రతో మాట్లాడేందుకు టీడీపీ అధిష్టానం రాత్రి వరకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. మరో వైపు తనకు కనిగిరి సిట్టింగ్‌ స్థానం ఇస్తేనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని దర్శి లేది ఇతర నియోజకవర్గాలకు వెళ్లేది లేదని కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ద్వారా కదిరి బాబూరావు కనిగిరి అభ్యర్థిగా పోటీ  ఉండేందుకు అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇంకో వైపు యర్రగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచేందుకు సరైన అభ్యర్థి దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే డేవిడ్‌ రాజుపై ఆ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో అతను పోటీ చేసే పరిస్థితి కానరావడం లేదు. మరోవైపు సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బీఎన్‌ విజయ్‌కుమార్‌ను నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్యనేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఎన్‌ను కాదనుకుంటే ఇక్కడ కూడా అధికార పార్టీకి అభ్యర్థి దొరికే పరిస్థి«తి లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటుతో పాటు పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సరైన అభ్యర్థి దొరికే పరిస్థితి లేక అధికార టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. నామినేషన్లకు మరో 5 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top