డిపాజిట్‌దారులకు మూడు నామాలు | Fraudation made by seven hills private limited | Sakshi
Sakshi News home page

డిపాజిట్‌దారులకు మూడు నామాలు

Aug 14 2015 4:37 AM | Updated on Sep 3 2017 7:23 AM

డిపాజిట్‌దారులకు మూడు నామాలు

డిపాజిట్‌దారులకు మూడు నామాలు

మీ డబ్బు మా సంస్థలో డిపాజిట్ చేస్తే కేవలం 69 నెలల్లో రెట్టింపు ఇస్తామని ప్రకటించిన ‘సెవెన్ హిల్స్ ఇండియా ప్రై లిమిటెడ్’ సంస్థ శాఖ కదిరిలో బోర్డు తిప్పేసింది...

- కదిరిలో బోర్డు తిప్పేసిన సెవెన్‌హిల్స్
- రూ.5 కోట్లకు పైగా కుచ్చుటోపీ  
- లబోదిబోమంటున్న బాధితులు
కదిరి:
మీ డబ్బు మా సంస్థలో డిపాజిట్ చేస్తే కేవలం 69 నెలల్లో రెట్టింపు ఇస్తామని ప్రకటించిన ‘సెవెన్ హిల్స్ ఇండియా ప్రై లిమిటెడ్’ సంస్థ శాఖ కదిరిలో బోర్డు తిప్పేసింది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్టం కోలార్ జిల్లా మాలూరు ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. మాలూరుకు చెందిన నారాయణప్ప అనే వ్యక్తి ఈ సంస్థను 2011లో ప్రారంభించారు.  ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా చిత్తూరు, పలమనేరు, మదనపల్లి, మొలకలచెరువు, వాయల్పాడు, పుంగనూరు,   కదిరి, హిందూపురం, గోరంట్ల, మడకశిర ఇంకా పలు ప్రాంతాల్లో శాఖలను ప్రారంభించారు.

తమ సంస్థలో సొమ్ము డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల 9 నెలలకు రెట్టింపు అందజేస్తామని ప్రకటించింది. అమాయక దిన కూలీలనే టార్గెట్ చేసుకొని డిపాజిట్లు సేకరించారు.  డబ్బు డిపాజిట్ చేసిన వారికి బాండు పేరుతో కంప్యూటర్ రసీదు ఇస్తూ వాటిపై స్థానికంగా ఉన్న ఆయా కార్యాలయాల సిబ్బందే వాటిపై సంతకాలు చేశారు. సేకరించిన డిపాజిట్లో 15 శాతం కమిషన్ ఇస్తూ అన్ని ప్రాంతాల్లోనూ ఏజెంట్లను నియమించుకున్నారు.
 
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో అనేకమంది నుంచి  రూ 5 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారు. వారు ఇచ్చిన బాండ్లకు 2017 సంవత్సరం నుంచి గడువు పూర్తి కానుంది.   కదిరి పట్టణ  బైపాస్ రోడ్‌లో ఉన్న ఆ సంస్థ కార్యాలయం  2 నెలలుగా మూత పడడంతో డిపాజిట్‌దారులకు అనుమానం వ చ్చింది. స్థానిక సిబ్బందిని ఫోన్ ద్వారా సంప్రదించగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బాధితులు కదిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ వీరన్న, నాగార్జున, బాబ్జాన్ అనే ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ సంస్థ ఎండీ నారాయణప్ప అందుబాటులో లేరు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement