పచ్చ కరువు | formers are feeling problems with agriculture lands | Sakshi
Sakshi News home page

పచ్చ కరువు

Sep 30 2013 3:03 AM | Updated on Jun 1 2018 8:36 PM

జిల్లాలో ఈసారి పచ్చకరువు ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తున్నా... దిగుబడి మాత్రం పడిపోయింది. దీంతో ఈసారీ కష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు.

మడకశిర/తాడిమర్రి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈసారి పచ్చకరువు ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తున్నా... దిగుబడి మాత్రం పడిపోయింది. దీంతో ఈసారీ కష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా మడకశిర, ధర్మవరం నియోజకవర్గాల రైతులు ప్రతియేటా వేరుశనగ పంటను సాగు చేస్తుంటారు. వీరి ఆర్థిక స్థితిగతులు పూర్తిగా వేరుశనగపైనే ఆధారపడి ఉన్నాయి.
 
 ఈసారి ముంగారు వర్షాలు ఆశాజనకంగా కురవకపోవడంతో వేరుశనగ సాగు విస్తీర్ణం  తగ్గింది. మడకశిర నియోజకవర్గంలో ప్రతియేటా 50 వేల హెక్టార్లలో పంట వేస్తుండగా... ఈసారి మాత్రం 30 వేల హెక్టార్లకే పరిమితమైంది. నియోజకవర్గంలో మే మొదటి, రెండవ వారంలో ఓ మోస్తరుగా వర్షాలు పడడంతో ఈ మేరకైనా పంట సాగైంది. ఆ తర్వాత ఒకటిన్నర నెలపాటు వర్షాలు పూర్తిగా ఎత్తిపెట్టాయి. మళ్లీ జూలై చివరివారంలో కురిశాయి. అప్పుడు కొందరు రైతులు పంట వేసినా... చాలామంది మాత్రం వెనుకంజ వేశారు. దీంతో వేలాది ఎకరాలు బీడుపడ్డాయి.
 
 మే మాసంలో సాగైన వేరుశనగ పంట దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. విత్తనాలు మొలకెత్తిన తర్వాత వర్షాలు రాకపోవడంతో పంట ఎదుగుదల లేక, దిగుబడి పడిపోయింది. చెట్టుకు ఐదారు కాయలు కూడా లేవు. ఈ చెట్లను నెల రోజుల్లోపు తొలగించడానికిరైతులు సమాయత్తమవుతున్నారు. ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టామని, దిగుబడి చూస్తే రెండు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతమున్న కాయలు విత్తనానికి కూడా పనికిరావని చెబుతున్నారు. జూలైలో సాగు చేసిన పంట పరిస్థితీ ఇలాగే ఉంది.
 
 పెట్టుబడి కూడా గిట్టుబాటు కాదు
 వేరుశనగ పంట దిగుబడి అంతంతమాత్రమే. చెట్టుకు నాలుగైదు కాయలు కూడా లేవు. పెట్టుబడి కూడా దక్కే అవకాశం లేదు. ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు పెట్టాం.  రూ.10 వేలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
  - వెంకటరమణప్ప,  రైతు, మడకశిర
 

Advertisement
 
Advertisement
Advertisement