దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణ నేపథ్యంలో వన్‌టౌన్ మీదగా ట్రాఫిక్ మళ్లించిన పోలీసు సూచిక బోర్డులు
తలలు పట్టుకుంటున్న వాహన చోదకులు
తాత్కాలికంగా కాగితాలపై సూచికలు
వర్షానికి చెదిరిన కాగితాలు
విజయవాడ (చిట్టినగర్) : దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణ నేపథ్యంలో వన్‌టౌన్ మీదగా ట్రాఫిక్ మళ్లించిన పోలీసు సూచిక బోర్డులు ఏర్పాటుచేయలేదు. ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కృష్ణలంక మీద నుంచి వచ్చే వాహనాలను కాళేశ్వరరావు మార్కెట్, కేటీ రోడ్డు మీదగా సోరంగం, బైపాస్ రోడ్డు మీదగా గొల్లపూడికి తరలిస్తున్నారు. చిట్టినగర్ నాలుగు రోడ్డు కూడలిలో ఏ రోడ్డు ఎటువైపు వెళుతుందనే సూచిక బోర్డులు ఏర్పాటుచేయలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వారు గందరగోళానికి గురవుతున్నారు. చిట్టినగర్ జంక్షన్ నుంచి పాలప్రాజెక్టు వైపు వెళ్లి అక్కడ నుంచి వెనుతిరిగి వచ్చి సోరంగం మీదగా బైపాస్‌కు చేరుకుంటున్నారు. కేటీ రోడ్డు మీదగా వచ్చిన వారు కొందరు పొరబాటున మళ్లీ ఎర్రకట్టపైకి వెళుతున్నారు. బైపాస్ రోడ్డుకు చేరే వరకు సమాచారం అడిగి తెలుసుకుని ప్రయాణించాల్సి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్, ఏలూరుకు మార్గాలను సూచిస్తూ మంగళవారం చిట్టినగర్ జంక్షన్‌లో కాగితాలపై తాత్కాలికంగా బోర్డులు ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచి కురుస్తున్న వర్షంలో ఈ కాగితాలు ఎంత వరకు ఉంటాయనే కనీస అవగహన లేకపోవడం గమనార్హం. విద్యుత్ స్తంభాలకు ఆరు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ బోర్డులు, కనీసం ఐదు అడుగుల దూరంలో ఉన్న వారికి సైతం కనిపించడం లేదు. అధికారులు సరైన సూచిక బోర్డులు ఏర్పాటుచేస్తే ఇంత కష్టం వచ్చేది కాదు కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గందరగోళ పరిస్ధితులు తొలగిపోవాలంటే వెంటనే పోలీసు, నగర పాలక సంస్థ అధికారులు వెంటనే ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు.