దామోదరం వంటి నేతల స్ఫూర్తితో పార్టీకి పునర్జీవం

First signature as PM will be for special status to Andhra Pradesh Says Rahul Gandhi - Sakshi

కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఏపీ నుంచే శ్రీకారం 

 పీవీ, కోట్ల, నీలం ఇక్కడి నుంచే ఎన్నిక కావడం గర్వకారణం 

 ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ 

కర్నూలు(అర్బన్‌):  నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన దివంగత దామోదరం సంజీవయ్య వంటి నేతల స్ఫూర్తితో కాంగ్రెస్‌కు పునర్జీవం తీసుకొస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశానికి ప్రధానిగా పీవీ నరసింహారావు, రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని అందించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని కొనియాడారు. తిరిగి అలాంటి నాయకులను తయారు చేసేందుకు ఇక్కడికి వచ్చానన్నారు.  ఈ ప్రాంతం నుంచే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయపతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు.  రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ అభివృద్ధిని కాంక్షించి అప్పట్లో ప్రధానిగా ఉన్న 

మన్మోహన్‌సింగ్‌ ఐదేళ్లు ప్రత్యేకహోదా కల్పించాలని తీర్మానం చేస్తే, కాదు .. పదేళ్లు ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టిందని గుర్తు చేశారు. అయితే..నేడు ఆ పార్టీ ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్‌  అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకాన్ని ఏపీకి ప్రత్యేకహోదా ఫైలుపైనే పెడతామని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందిందని, బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రజలంటే మోదీకి ఏమాత్రమూ గౌరవం లేదన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. 

మాజీ సీఎం ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాయలసీమతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లోని పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు పాలనలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. ఉన్న జాబులు కూడా పోతున్నాయన్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. రైతులు ఒక ఎకరాకు నీరు పెట్టుకోవాలన్నా అధికార పార్టీ నేతలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టుకు కూడా నీరు అందుతుందని, గుండ్రేవుల రిజర్వాయర్, సిద్ధేశ్వరం అలుగు పూర్తవుతాయని అన్నారు. 

కార్యక్రమంలో  పీసీసీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్, టీటీడీ మాజీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు, డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్‌ మైనారిటీ సెల్‌ చైర్మన్‌ అహమ్మద్‌ అలీఖాన్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌చాందీ, సీనియర్‌ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, కొప్పుల రాజు, పల్లంరాజు, సాకే శైలజానాథ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

ఇన్నాళ్లకు గుర్తొచ్చారా?! 
కాంగ్రెస్‌ నాయకులకు ఇన్ని రోజులకు దామోదరం సంజీవయ్య గుర్తుకు వచ్చారా అని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపాడు గ్రామంలోని సంజీవయ్య ఇంటిని సందర్శించారు. దామోదరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పలకరించారు. హైదరాబాద్, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సంజీవయ్య కుటుంబ సభ్యులను రాహుల్‌ పర్యటన సందర్భంగా పిలిపించారు. ఈ నేపథ్యంలో దామోదరం కుటుంబ సభ్యుల్లో ఒకరైన మోహన్‌దాసు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా కాంగ్రెస్‌ నేతలకు సంజీవయ్య గుర్తుకు రావడం సంతోషంగా ఉందన్నారు.   

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం 
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్‌): కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందిస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం కర్నూలు పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని బైరెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. శ్రావణ్, హరికృష్ణ, ప్రియాంక, సౌభాగ్య, జుబేర్‌ అహ్మద్, సకినా సోలోమైక్, భవ్యశ్రీ, తదితర 15 మంది విద్యార్థులతో  రాహుల్‌ మాట్లాడారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ వెనుకబాటుతనం నిర్మూలన అవినీతి నిర్మూలన, మహిళల రక్షణ, జీఎస్టీ ఇబ్బందులు, పెట్రోల్,డీజిల్‌ ధరల నియంత్రణ, ఏపీ, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు..తదితర  ప్రశ్నలను విద్యార్థులు అడిగారు. 

తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. చైనా ఒక్క రోజులోనే సుమారు 50,000 ఉద్యోగాలు సృష్టిస్తోందని, అదే మన దేశంలో 450 ఉద్యోగాలను మాత్రమే సృష్టించుకోగలుగుతున్నామని వివరించారు. కేవలం 10 నుంచి 15 మంది బడా కార్పొరేట్‌ వ్యక్తుల చేతుల్లో పారిశ్రామిక రంగం ఉండటంతోనే ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. ఇది మారాలని, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.  ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థి«క వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఒక విద్యార్థి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడని, ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.  

వీహెచ్‌కు కోపమొచ్చింది! 
కర్నూలు (టౌన్‌): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు (వీహెచ్‌)కు కోపమొచ్చింది. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) సిబ్బంది అడ్డుకోవడంతో చిర్రెత్తిన ఆయన తనకు రెస్పెక్ట్‌ ఇవ్వడంలేదంటూ అసహసం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధినేత  రాహుల్‌గాంధీ  మంగళవారం కర్నూలు నగరానికి విచ్చేశారు. విద్యార్థులతో ముఖాముఖి, పెద్దపాడులో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ఇంటి సందర్శన వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కిసాన్‌ ఘాట్‌లో కోట్ల సమాధిని సందర్శించి..నివాళులర్పించారు. ఈ కార్యక్రమం కోసం వీహెచ్‌ గంట ముందే అక్కడికి చేరుకున్నారు.

 అయితే.. కిసాన్‌ఘాట్‌లోకి వెళ్లే వారి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇక్కడికి మీడియాను సైతం అనుమతించలేదు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో వీహెచ్‌ మాట్లాడుతూ ‘ఎస్పీజీ సిబ్బంది లోపలికి పంపించలేదు. కారణం అడిగితే నా పేరు లేదంటున్నార’ని వాపోయారు. అక్కడే ఉన్న కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఈ సమస్యను రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకుపోయారు. కొద్ది సేపటి తరువాత ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో  లోపలికి పంపించారు. కోట్ల ఇంటికి విచ్చేసిన రాహుల్‌తో పాటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ  నేత తులసిరెడ్డిని సైతం ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. 

అలా వచ్చి... ఇలా వెళ్లి. 
రాహుల్‌ పర్యటన హడావుడిగా సాగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు కోట్ల సమాధిని సందర్శించి, అక్కడే రైతులతో ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది. అయితే.. మూడు గంటలకు వచ్చిన రాహుల్‌ ఐదు నిమిషాల వ్యవధిలోనే కోట్ల సమాధిని సందర్శించి, రైతులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కిసాన్‌ ఘాట్‌ నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా కారు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఎదురుగా ఉన్న నర్సింగ్‌ కళాశాల సిబ్బంది, విద్యార్థినులు చేతులూపడంతో వారి వద్దకు వెళ్లి పలకరించారు. సభా ప్రాంగణానికి చేరుకునే ముందు డీసీసీ కార్యాలయం వద్ద  సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేశారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం ఆత్మహత్య చేసుకున్న ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన విద్యార్థి మహేంద్ర  కుటుంబ సభ్యులకు బహిరంగ సభ వేదికగా రాహుల్‌ చేతుల మీదుగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top