సీఎం నివాసానికి ర్యాలీ.. రాజధానిలో ఉద్రిక్తత

Farmers Protest Against TDP Government Rally At Undavalli - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతం తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తమ పొలాలపై యూ-1 రిజర్వ్‌ జోన్‌ ఎత్తివేయాలంటూ రైతులు సోమవారం ర్యాలీ చేపట్టారు. తాడేపల్లి, కుంచనపల్లి, కొలకొండ గ్రామల రైతులు తాడేపల్లి నుంచి ఉండవల్లిలోని సీఎం నివాసం వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా వెళ్తున్న రైతులు పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగి.. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రైతులు రోడ్డుపైన ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చర్యపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌, లింగమనేని రమేష్‌కు చెందిన సంస్థలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికే తమ పొలాలను రిజర్వు జోన్‌లుగా ప్రకటించారని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే దానిని ఉపసంహరించుకోకపోతే తమ ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ర్యాలీకి వచ్చిన రైతులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ర్యాలీకి కూలీలను ఎందుకు తీసుకు వచ్చారని వారిపై మండిపడ్డారు. తమాషాలు చేయొద్దంటూ, తాటతీస్తా అంటూ రైతులకు వార్నింగ్‌ ఇచ్చారు. వేషాలు వేస్తే రిమాండ్‌కు పంపిస్తామని, అడ్డువచ్చిన రైతులను నెట్టిపారేశారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని అడిగితే పోలీసులే బెదిరింపులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top