రైతులకు చకచకా చెల్లింపులు

Farmers Gets Grain Selling Money In 48 hours In AP - Sakshi

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము

చరిత్రలోనే తొలిసారి

ఇప్పటికే చెల్లించిన మొత్తం రూ.1,416 కోట్లు

రూ.451 కోట్లు త్వరలోనే జమ

ఇప్పటివరకు 10.24 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు

సాక్షి, అమరావతి : ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలపై పంపిణీ చేసే బియ్యానికి సంబంధించి అవసరమైన ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏ–గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,835, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,815 చొప్పున మద్దతు ధర చెల్లిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తోంది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పౌర సరఫరాల శాఖకు కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడంతో సంస్థ ఖజానా ఖాళీ అయింది. ఫలితంగా రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి రైతు ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ చేసేందుకు వీలుగా నిధులు కేటాయింపజేశారు. ధాన్యం సొమ్ము కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా 48 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు 10.24 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సివిల్‌ సప్లైస్‌ అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి 84,683 మంది రైతులకు రూ.1,416.62 కోట్లు చెల్లించారు. మరో 26,369 మంది రైతులకు రూ.451.34 కోట్లు త్వరలోనే వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల వివరాలు, కనీస మద్ధతు ధర వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తూ దళారులను నియంత్రిస్తున్నారు. స్వయం సహాయక, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌లు), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాల్లో దిగుబడి వచ్చింది. జిల్లాల వారీగా ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం, బిల్లుల చెల్లింపు వివరాలిలా ఉన్నాయి.


సకాలంలో చెల్లిస్తాం
రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తాం. దళారులను ఆశ్రయించకుండా రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మోసాలకు అవకాశం ఉండదు. దళారులను ఆశ్రయిస్తే తూకాల్లో మోసం చేసే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళితే తక్షణమే పరిష్కరిస్తారు. –కోన శశిధర్, ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top