పత్తికొండ చరిత్రలో నెత్తుటి పేజీలు | faction political in kurnool district | Sakshi
Sakshi News home page

పత్తికొండ చరిత్రలో నెత్తుటి పేజీలు

May 23 2017 3:17 AM | Updated on Sep 5 2017 11:44 AM

పత్తికొండ చరిత్రలో నెత్తుటి పేజీలు

పత్తికొండ చరిత్రలో నెత్తుటి పేజీలు

వినగానే.. ఫ్యాక్షన్‌ ఘంటికలు మారుమోగుతాయి. అలనాటి కమాండర్‌ జీపుల నుంచి ఇప్పటి స్కార్పియో వాహనాల వరకు...

కర్నూలు జిల్లాలో పత్తికొండ పేరు వినగానే.. ఫ్యాక్షన్‌ ఘంటికలు మారుమోగుతాయి. అలనాటి కమాండర్‌ జీపుల నుంచి ఇప్పటి స్కార్పియో వాహనాల వరకు... రక్తపు దారుల్లో పరుగులు తీయడం కనిపిస్తూనే ఉంది. ఇద్దరు బడా నాయకుల మధ్య ఆధిపత్య పోరులో  గ్రామ నాయకులు, సామాన్య జీవులే పావులుగా మారుతున్నారు. ఈ ముఠా కక్షల యజ్ఞంలో వారే సమిధలవుతూనే ఉన్నారు. మూడు దశాబ్దాలుగా పోటీ చేసిన అభ్యర్థులు, ఎంపికైన అభ్యర్థుల మధ్య... ఒక రావణకాష్టం రగులుతోంది. రాజకీయ చరిత్ర పరిశీలనలో కక్షల ఖిల్లాగా పత్తికొండకు ఇది మాయని మచ్చే.

1979 నుంచి వరుసగా నాయకుల హత్యలు
హతుల్లో ఎమ్మెల్యేలు, బరిలో నిలిచిన అభ్యర్థులు


కర్నూలు(కల్చరల్‌) :  జిల్లాలో పత్తికొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కర్ణాటక సరిహద్దుల్లో కొన్ని పల్లెలు ఉండటంతో ఒక ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు, ఒక ప్రత్యేకమైన పౌరుషంతో కూడుకున్న సంప్రదాయాలు ఈ నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పేద, మధ్య తరగతి కుటుంబాల సంఖ్య ఎక్కువ. అయితే రాజకీయ ప్రాబల్యం కల్గిన కొన్ని కుటుంబాలు ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడిపాయి.

 1979 నుంచి 2017 వరకు ఆ నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే ఆ చరిత్ర నిండి రక్తపు మరకలే కనిపిస్తాయి. ఒక ప్రాంతపు గుత్తాధిపత్యం కోసం ఇరువర్గాలు కత్తుల కోలాటం చేయడం, కుత్తుకలు తెగనరుకుకోవడంతో నెత్తుటి గాయాలే పత్తికొండ నియోజకవర్గ చరిత్ర నిండా కనిపిస్తాయి. అత్యధిక సంఖ్యలో పత్తికొండ నియోజకవర్గంలో రైతు కూలీలు, వలస వెళ్లే కూలీలు, రోజువారీ కూలీలు చేసుకుని బతికే నిరుపేదలే దర్శనమిస్తారు. ఒకప్పుడు కమ్యూనిస్టు కంచుకోటగా గుర్తింపు పొందిన పత్తికొండ క్రమేణా ఫ్యాక్షన్‌ రాజకీయాల ఖిల్లాగా మారింది.

ఎర్రగుడి ఈశ్వర్‌రెడ్డితో ప్రారంభం..
కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యలో పోరాటం జరిగిన రోజుల్లో ఈ ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఆ ప్రాంతంపై పెత్తనం చలాయించేందుకు సామాన్య ప్రజలను పావులుగా వాడుకోవడం, ఫ్యాక్షన్‌లో వారిని సమిథలుగా మార్చుకోవడం ఆనవాయితీగా మారింది. క్రమేణా తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు రంగం మీదికి రావడంతో ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల్లో పోటీ పడటం, గెలిచిన అభ్యర్థి పోటీగా నిలబడిన అభ్యర్థిపై పగతీర్చుకోవడం, హతమార్చడం.. ప్రతీసారి జరుగుతూనే ఉంది. ఒకటి రెండు సందర్భాలు తప్పనిస్తే 1979 నుంచి 2017 వరకు పత్తికొండ నియోజకవర్గ చిత్రపటంలో ఈ సంఘటనలే పునరావృతం కావడం చేదు జ్ఞాపకమే. 1979లో పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎంపికైన ఎర్రగుడి ఈశ్వర్‌రెడ్డిని ఆయన ప్రత్యర్థులు 1979 ఆగస్టు 4న బస్సులో నుంచిదింపి దారుణంగా హతమార్చారు.

ప్రమాణ స్వీకారం చేయకుండానే..
1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన మహాబలేశ్వర గుప్తా 1985 ఏప్రిల్‌ 27న పత్తికొండ నడిబొడ్డులో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో దారుణ హత్యకు గురయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఈయన ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడప్పుడే మొలకలెత్తి విజయదుందుబి మోగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్‌.టి.రామారావు మహాబలేశ్వర గుప్తా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే ఎన్నికలో తనకు ప్రత్యర్థిగా నిలబడిన రామకృష్ణారెడ్డి ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు.  

బరిలో ఓటమి చెంది.. ప్రత్యర్థుల చేతిలో హతమై..
గుప్తా హత్య జరిగి మూడు నెలలు కూడా ముగియక ముందే జూన్‌ 11, 1985న కర్నూలు సిల్వర్‌జూబ్లీ కళాశాల ప్రాంతంలో రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యాడు. రెండు ఆకుల గుర్తుపై ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహాబలేశ్వర గుప్తా మధ్య రాజుకున్న నిప్పు ఆ ఇరువురి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెంది చివరకు ప్రత్యర్థుల చేతిలలఅనంతరం సాగిన ఫ్యాక్షన్‌ పరంపరలో ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.

పొలిటికల్‌ మర్డర్‌
తాజాగా 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి 32 వేల ఓట్లు సాధించి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన చెరుకులపాడు నారాయణరెడ్డి ఇటీవల కాలంలో పత్తికొండ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, పత్తికొండ, వెల్దుర్తి మండలాల్లో నారాయణరెడ్డి తనకున్న స్నేహశీల స్వభావంతో సామాన్య ప్రజల్లోకి దూసుకెళ్లారు. ఈ నియోజకవర్గంలోని గడపగడపకు దండాలు పెట్టి సమస్యలు పరిష్కరించారు. పాదయాత్రలు చేపట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర సాధించారు. ప్రజల్లో ఆదరణ పెరిగింది. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రత్యర్థులు ఇది ఓర్వలేక మే 21, 2017న క్రిష్ణగిరి సమీపంలో దారుణంగా చంపేశారు.

కక్షల కుంపటికి బలి
జిల్లాలో ఫ్యాక్షనిస్టుగా ముద్రపడిన వెంకటప్పనాయుడు పత్తికొండ నియోజకవర్గంలో రంగం మీదికి వచ్చారు. ముఠా కక్షల పులిస్వారీ చేస్తూ పలుసార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వెంకటప్ప నాయుడు 2008లో పత్తికొండ నియోజకవర్గం ఎన్నికలో రంగంలోకి ముందుకు వచ్చారు. ఒక సందర్భంలో ఆయన జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పదవికి సైతం పోటీ పడ్డారు. విపరీతమైన ఫ్యాక్షన్‌ ముద్ర ఉండటంతో ఈయన బదులు బత్తిని వెంకట్రాముడును జడ్పీ చైర్మన్‌ పదవి వరించింది. కేవలం బడా నాయకుల అనుచరుడిగా మెలుగుతూ ముఠా కక్షలు నడిపిన నాయన 2008 మే 17న కోడుమూరు సమీపంలోని బోదెపాడు వద్ద ప్రత్యర్థులు లారీతో ఢీకొట్టి చంపేశారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈయన హత్య చాలామంది ఫ్యాక్షనిస్టులకు కనువిప్పు కల్గించింది.

ఫ్యాక్షన్‌  భూతానికి పాటిల్‌ హతం
1996లో పత్తికొండ ఎమ్మెల్యే శేషిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకుడిగా ఎదిగి పత్తికొండ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఎమ్మెస్సీ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన పాటిల్‌ శేషిరెడ్డిని గొప్ప భవిష్యత్తు ఉన్న నాయకుడిగా ప్రజలు ఆదరించారు. అయితే పత్తికొండ ఫ్యాక్షన్‌  పడగ కాటుకు ఈయన కూడా బలి కాక తప్పలేదు. బాగా చదువుకున్న యువకుడు, దూసుకుపోయే స్వభావం కల్గిన యువకుడు అతిపిన్న వయసులో 1996 ఏప్రిల్‌ 13న దారుణ హత్యకు గురయ్యారు.

శాంతి కుసుమాలు విరబూసేదెన్నడు
1979 నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా పత్తికొండ నియోజకవర్గ చిత్రపటం నిండా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. ఫ్యాక్షన్‌ విడనాడి శాంతి కుసుమాలు పూయిస్తామని నాయకులు వేదికల పైనుంచి చెప్తున్న మాటలన్నీ నీటిమీద రాతలవుతున్నాయి. శాంతి భద్రతల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన పోలీసు వ్యవస్థ వైఫల్యమే దీనికి ప్రధాన కారణమని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా భవిష్యత్తులో ఈ రక్తకేళికి ఫుల్‌స్టాప్‌ పెడదాం.. అంటూ కొందరు ప్రజాస్వామిక వాదులు ఆకాంక్షిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement