కర్నూలు జిల్లాలో ‘గోల్డ్‌మైన్’ రెడీ
రేపే పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం
వైఎస్ జగన్ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
పైలెట్ ప్రాజెక్టు కూడా విజయవంతంగా పూర్తి
1494.55 ఎకరాల్లో రూ.320కోట్లతో ప్లాంటు నిర్మాణం.. ప్రాజెక్టును మొదటగా నిర్మించిన ఆ్రస్టేలియా కంపెనీ మెస్సర్స్ జియో మైసూర్ సర్వీసెస్
అందులో 70శాతం వాటా కొనుగోలు చేసిన త్రివేణి ఎర్త్‌మూవర్స్
జియో మైసూర్‌లో 27.27 శాతం వాటా ఉన్న డెక్కన్ గోల్డ్‌మైన్స్
స్వాతంత్య్రం తర్వాత దేశంలో ప్రారంభం అవుతోన్న తొలి గోల్డ్ మైన్ ఇదే
కోలార్, రాయచూర్‌లోని హట్టి గోల్డ్‌మైన్స్ స్వాతంత్ర్యనికి పూర్వం నిర్మించినవే
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగడిరాయి, ఎర్రగుడి, బొల్లవానిపల్లి సమీప ప్రాంతాల్లో బంగారు, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతంలో వజ్రాలవేట మొదలవుతుంది. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలోని సుదూర ప్రాంతాల నుంచి వజ్రాన్వేషణకు వచ్చి నెలల తరబడి ఇక్కడే తిష్టవేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక్కడ వజ్రాలతో పాటు బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జీఎస్‌ఐ(జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) సర్వే చేసి నిర్ధారించింది. అయితే పెట్టుబడుల కోసం ఏ కంపెనీ ముందుకు రాలేదు.
బంగారం వెలికితీత వ్యయం, ఉత్పత్తికి అయ్యే ఖర్చు అప్పట్లో బంగారు ధరలు, డిమాండ్‌ను లెక్కిస్తే గిట్టుబాటు కాదని కంపెనీలు వెనుకడుగు వేశాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం 2005లో మైనింగ్ సెక్టార్లో విదేశీపెట్టుబడులు ఆహ్వానించింది. దీంతో ఆస్ట్రేలియాకు చెందిన ‘మెస్సర్స్ జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెని దరఖాస్తు చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ చేస్తుంటుంది. ఈ దరఖాస్తును అప్పటి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పరిశీలించి కంపెనీ స్థితిగతులను తెలుసుకుని అనుమతులు ఇచ్చేలోపే ఆయన ప్రమాదవశాత్తు మృతి చెందారు.ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులనేపథ్యంలో దీని అనుమతులకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు 2013లో అనుమతులు వచ్చాయి.
597.82 హెక్టార్లలో బంగారు తవ్వకాలు
తుగ్గలి, మద్దికెర మండలాల్లో 597.82 హెక్టార్ల (1495 ఎకరాలు)లను జియో మైసూర్ లీజుకు తీసుకుంది. 2013లో నిక్షేపాల వెలికితీతకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసి అనుమతులు తీసుకుంది. లీజు భూములు కాకుండా ఎకరా రూ.12 లక్షల చొప్పున 70 ఎకరాల కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. 2021లో ప్రొడక్షన్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేసింది. 1495 ఎకరాల్లో ప్రతీ 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30వేల మీటర్లు డ్రిల్లింగ్ చేశారు.
2023 ఫిబ్రవరి నుండి పైలట్ ప్రాజెక్టుగా బంగారం వెలికితీతను మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నిపుణులు కూడా పైలట్ ప్రాజెక్టులో పనులు చేశారు. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన బంగారాన్ని బెంగళూరులోని ల్యాబ్‌కు పంపితే మంచి ఫలితాలొచ్చాయి. దీంతో పూర్తిస్థాయి ఉత్పత్తి లక్ష్యంగా పనులు పూర్తి చేసింది. దక్షిణాఫ్రికా, చైనా నుంచి మిషనరీ తెప్పించారు. క్రషర్లు, గ్రౌండింగ్ యూనిట్లు దేశీయంగా కొనుగోలు చేశారు.
మైనింగ్ వ్యాపారి ప్రభాకరన్ చేతికి గోల్డ్‌మైన్!
కర్నూలు గోల్డ్‌మైన్‌ను తొలుత ఆస్ట్రేలియా కంపెనీ జియోమైసూర్ రూ.320కోట్ల పెట్టుబడితో నిర్మించింది. ఇందులో 70 శాతం వాటాను ఇండియాకు చెందిన మైనింగ్ వ్యాపారి ఎం. ప్రభాకరన్‌కు చెందిన త్రివేణి ఎర్త్ మూవర్స్ కొనుగోలు చేసింది. అలాగే జియో మైసూర్‌లో 27.27 శాతం వాటా డెక్కన్ గోల్డ్‌మైన్స్‌కు ఉంది. దీంతో గోల్డ్‌మైన్‌కు బీజం ఆస్ట్రేలియా కంపెనీ వేసినా, ఉత్పత్తి మాత్రం ఇండియా కంపెనీలే చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి 4.6% పన్నులు
బంగారం ఉత్పత్తి చేసే కంపెని మొదట రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, డీఎంఎఫ్(డిస్ట్రిక్ మినర్ ఫండ్) కలిపి ఉత్పత్తిలో 4.6శాతం చెల్లించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌ఎంఈటీ( నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లనేషన్ ట్రస్టు)కు 0.5శాతం చెల్లించాలి. డోరేబార్ నుంచి బంగారం బులియన్‌గా మారిన తర్వాత 25–30శాతం కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్‌లు చెల్లించాలి. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి.
స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలి ‘గోల్డ్‌మైన్’
మన దేశంలో 1880లో కోలార్ గోల్డ్‌మైన్‌ను ప్రారంభించారు. ఆపై బ్రిటీష్ హయాంలోనే 1945లో రాయచూర్‌లోని ‘హట్టిమైన్స్’ను మొదలెట్టారు. అయితే స్వాతంత్య్రం తర్వాత ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా గోల్డ్‌మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు ‘త్రివేణి గోల్డ్‌మైన్’ తొలి గోల్డ్‌మైన్‌గా చెప్పాలి. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో ప్రత్యక్షంగా 300మందికి, పరోక్షంగా మరో 1000మంది దాకా ఉద్యోగాలు లభిస్తాయి. అనంతపురం జిల్లాలోని రామగిరిలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందుకు రాలేదు. ఈ ప్రాంతంలో కూడా బంగారు నిక్షేపాలు వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతం అవుతుంది.


