టీడీపీలో ‘లేఖ’లుకలు! | Internal Clashes Between TDP Leaders In Kurnool, Krishnaamma Moves Trigger Fresh Political Tensions | Sakshi
Sakshi News home page

టీడీపీని కుదిపేస్తున్న ‘కృష్ణా’స్త్రం

Aug 28 2026 1:09 PM | Updated on Aug 28 2026 2:00 PM

Internal Clashes Between TDP Leaders in Kurnool

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. కొంతమంది పచ్చనేతలపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రధానంగా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డి మరికొందరు నేతలపై కృష్ణమ్మ లేఖాస్త్రం సంధించినట్లు ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. వైరి వర్గానికి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా ఆమె అధిష్టానానికి లేఖ పంపినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరగుతోంది. 

ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే, ఆదోని టీడీపీ ఇన్‌చార్జ్జ్‌ మీనాక్షి నాయుడును టీడీపీ నుంచి బయటకు సాగనంపి ఆదోని ఇన్‌చార్జ్‌ బాధ్యతలు సొంతం చేసుకునేందుకే  కృష్ణమ్మ ఫిర్యాదులకు తెరతీసినట్లు ‘పచ్చ’పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె పాచిక పారి అధిష్టానం మాజీ ఎమ్మెల్యే మీనాక్షికి చెక్‌ పెట్టేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఆమె కోరిక నెరవేరి ఆదోని ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసార«థి సైతం కూటమి తరఫున మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. 

తిక్కారెడ్డిని వదిలించుకున్నట్లేనా? 
మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డికి సైతం పచ్చపార్టీ ప్రాధాన్యత తగ్గించిన దూరంపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్‌ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు మంత్రాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశం టీడీపీ ఇన్‌చార్జ్‌ రాఘవేంద్రారెడ్డి స్వగృహంలో నిర్వహించడంతో ఆ సమావేశానికి తిక్కారెడ్డి వర్గీయు లు గైర్హాజరయ్యారు. అయినా అధిష్టా నం తిక్కారెడ్డిని బుజ్జగించే ప్రయత్నమేమీ చేయకపోవడం గమనార్హం. గత జూన్‌ నెలలో మంత్రాలయం వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిక్కారెడ్డి సేవలు బయట ఉపయోగించుకుంటామంటూ వ్యాఖ్యానించారు. మంత్రాలయం రాజకీయాల నుంచి తిక్కారెడ్డిని తప్పించినట్లు చంద్రబాబు స్వయంగా సంకేతాలిచ్చారు. దీంతో తిక్కారెడ్డివర్గం భగ్గుమంటోంది.  రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ తిక్కారెడ్డి వర్గం మండిపడుతున్నట్లు సమాచారం.  

సత్తా చాటుతాం 
ఇప్పటికీ టీడీపీలో బలంగా ఉన్న మీనాక్షి నాయుడు పచ్చపార్టీతో అమీతుమీకి సిద్ధపడనున్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. మీనాక్షి నాయుడుని కాదని గుడిసె కృష్ణమ్మకు ఆదోని ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తే తమ సత్తా చాటుతామని మీనాక్షి నాయుడి వర్గం బహిరంగంగానే విరుచుకుపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తంగా జిల్లా టీడీపీలో వర్గవిబేధాలు తారస్థాయికి చేరడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఓటమికి కృష్ణమ్మ రిటర్న్‌ గిఫ్ట్‌ 
కృష్ణమ్మకు మీనాక్షి నాయుడుతో ఆది నుంచి విబేధాలు ఉన్నాయి. ఆదోని నుంచి ఐదుసార్లు పోటీ చేసిన మీనాక్షి నాయుడు 1991, 1999, 2009లలో ఎమ్మెల్యేగా ఎన్నికకాగా.. 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2004 ఎన్నికల్లో మీనాక్షి నాయుడుని కాదని టీడీపీ అధిష్టానం గుడిసె కృష్ణమ్మను బరిలో నిలిపింది. టికెట్‌ ఇవ్వకపోవడంతో మీనాక్షి నాయుడు వర్గం రచ్చచేసింది. గొడవలు సృష్టించింది. అయినా బెదరక అధిష్టానం చివరకు కృష్ణమ్మనే అభ్యర్థిగా నిలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వై.సాయిప్రసాదరెడ్డి చేతిలో ఆమె ఓటమి చవిచూశారు. మీనాక్షి నాయుడువర్గం కృష్ణమ్మ ఓటమికోసం పనిచేసినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆమె మీనాక్షితో పాటు ఆయన వర్గంపై ఆగ్రహంతో ఉంది. అవకాశం కోసం ఎదురు చూసిన కృష్ణమ్మ అధిష్టానంతో సయోధ్య నెరిపి ఇప్పడు మీనాక్షి నాయుడుకి చెక్‌ పెడుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చజరుగుతోంది.

సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు జిల్లా అధ్యక్ష పదవి? 
గుడిసె కృష్ణమ్మ స్థానంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించనున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోమిశెట్టికి దాదాపుగా జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలంతా మద్దతుగా నిలిచినట్లు సమాచారం. కృష్ణమ్మ టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికంటే ఆదోని ఇన్‌చార్జ్‌ పదవిపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. మంత్రి లోకేష్‌ సూచనలతో వ్యూహం ప్రకారమే మీనాక్షి నాయుడుకు కృష్ణమ్మ చెక్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

చదవండి: ఒంటెత్తు పోకడలతో ఒంటరై! 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement