సాక్షి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి శుక్రవారం మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితుడు.. ఆయన ఎదుటే ఆత్మహత్యాయత్నం చేశాడు. మంత్రి రామానాయుడు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదన్న ఆవేదనతో సుంకేసుల గ్రామానికి చెందిన రామా ఏడుకొండలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. డబుల్ ఎంట్రీ పేరుతో తనకి అధికారులు పరిహారం ఇవ్వలేదని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎదుట ఏడుకొండలు వాపోయాడు. పరిహారం చెల్లింపులో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేసి, ఆదుకోవాలని వేడుకున్నాడు.
ఆత్మహత్యలే శరణ్యం: నిర్వాసితులు
కూటమి ప్రభుత్వంపై వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులు మండిపడుతున్నారు. చాలా మందికి ప్రభుత్వం నుంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో గురువారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులను బాధితులు అడ్డుకున్నారు. ప్రభుత్వం సాయం అందేవరకు తమ ప్రాంతాలను ఖాళీ చేయబోమని స్పష్టం చేశారు. సర్కారు పట్టించుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని నిర్వాసితులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.
ఇదీ చదవండి: వెలిగొండ ముంపు గ్రామాల్లో వేదన


