రేవ్‌ పార్టీ.. దర్యాప్తు డర్టీ..! | Rave Party In Visakhapatnam | Sakshi
Sakshi News home page

రేవ్‌ పార్టీ.. దర్యాప్తు డర్టీ..!

Aug 28 2026 2:21 PM | Updated on Aug 28 2026 2:21 PM

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం శివార్లలోని ‘హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌’లో జరిగిన రేవ్‌పార్టీలో కత్తిపోట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన ఈ వివాదాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తూ పోలీసులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఘటనా స్థలంలో కళ్లెదుటే ఆధారాలు కనిపిస్తున్నా.. వాటిని స్వా«దీనం చేసుకోవడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించడం పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ.. కేసును నీరుగార్చి, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలను రక్షించేందుకు కింది స్థాయి సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. 

పోలీసుల వైఫల్యం? 
తెల్లవారుజామున సుమారు 4:18 గంటల ప్రాంతంలోనే పార్టీలో ఘర్షణ జరిగి, గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినప్పటికీ.. పోలీసుల దర్యాప్తు మధ్యాహ్నం 3 గంటల వరకు ముందుకు సాగలేదు. కనీసం క్రైమ్‌ సీన్‌ను స్వా«దీనం చేసుకోవడంలోనూ పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో సుమారు 40కి పైగా ఖాళీ, సగం తాగిన మద్యం సీసాలు పడి ఉన్నా వాటిని వెంటనే స్వా«దీనం చేసుకోలేదు. ఈ జాప్యాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు నేతలు ఆధారాలన్నింటినీ అక్కడి నుంచి మాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నమోదు కాకముందే ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పరోక్షంగా అవకాశం కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కేవలం 6 బాటిళ్లు మాత్రమే దొరికినట్టు ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రిసార్ట్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. 

బయటకు రాని సీసీటీవీ ఫుటేజీ! 
ఈ రేవ్‌పార్టీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆ కోణాన్ని దాచిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజీల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా హత్యాయత్నం జరిగిన సమయానికి సంబంధించిన ఫుటేజీని మాత్రమే పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం పార్టీకి సంబంధించిన పూర్తి ఫుటేజీని సేకరించి ఉంటే అందులో పాల్గొన్న వారి వివరాలు, అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది.

 కానీ అలా పూర్తిస్థాయి ఫుటేజీ తీసుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లభ్యమైన ప్రాథమిక దృశ్యాల్లో.. దాడికి పాల్పడిన వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా ఉన్నాడని, అలాగే పెద్ద సంఖ్యలో యువతులు కూడా అక్కడ కనిపించారని సమాచారం. అసలు అక్కడికి కత్తి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అన్న అంశాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.పార్టీకి ఎవరెవరు వచ్చారు? లోపల ఏం జరిగింది? అన్న కీలక విషయాలు నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీని తక్షణమే సీజ్‌ చేయకుండా కాలయాపన చేశారనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా చిన్న చోరీల వ్యవహారాల్లోనూ హడావుడి చేసే పోలీసులు.. ఇంత పెద్ద ఘటన జరిగినా కనీసం మీడియాకు పూర్తి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

ఆ విదేశీ మద్యం తెచ్చిందెవరు? 
ఈ రేవ్‌పార్టీలో స్థానిక మద్యంతో పాటు విదేశీ మద్యం కూడా భారీగా పారినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నా, పోలీసులు మాత్రం తక్కువ బాటిళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. అసలు ఈ విదేశీ మద్యం అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేయడం లేదని సమాచారం. ఒక విద్యార్థి విభాగం (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) నాయకుడే ఈ విదేశీ మద్యాన్ని సరఫరా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా.. ఆ దిశగా పూర్తిస్థాయి విచారణ చేపట్టకపోవడం పోలీసుల పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement