కాలుష్య కాటు

Environmental Pollution Industrial In Nellore - Sakshi

జిల్లాలో ఎన్విరాన్‌మెంట్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) లేకుండా పలు ఫ్యాక్టరీలు, మైన్స్, క్వారీల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తూ  ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీటిపై అడపాదడపా అధికారులు దాడులు చేస్తున్నా అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో యథాప్రకారం నిర్వాహకులు కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. గాలిలో దూళికణాలు గతంలో 66 శాతం ఉండగా ప్రస్తుతం 71 శాతానికి చేరుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కార్బన్‌ మోనాక్సైడ్‌ 80 నుంచి 100 మైక్రోగ్రాముల లోపు ఉండాలి. అయితే 500 మైక్రో గ్రాముల కార్బన్‌ మోనాక్సైడ్‌ ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా కాలుష్య కోరల్లో చిక్కుకుంది.

నెల్లూరు(సెంట్రల్‌): ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మొదట చూసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రధానంగా ఏర్పాటు చేసే మైన్స్, ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో ఆయా  ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకూడదు. ఏర్పాటు చేసే ఏ చిన్న, పెద్ద పరిశ్రమ అయినా సరే పర్యావరణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా ఎన్విరాన్‌మెంట్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే జిల్లాలో పలు ఫ్యాక్టరీలకు ఈసీలు లేవనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఈసీ లేని మైన్స్, ఫ్యాక్టరీలతోపాటు వాహనాలు తిరుగుతున్నందున వచ్చే కాలుష్యంతో జిల్లాలో పర్యావరణం దెబ్బతింటోంది. 25 వేలకు పైగా ఆటోలు, వెయ్యికి పైగా బస్సులు, 15 వేల కార్లు, రెండు లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు తిరుగుతుంటాయి. వీటన్నింటి వల్ల వచ్చే కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పలు ఫ్యాక్టరీలదే అదే వరుస
జిల్లాలో రైసు మిల్లులు, క్రషర్స్, పవర్‌ప్లాంటులు, వివిధ రకాల శబ్దకాలుష్య పరిశ్రమలు విచ్చలవిడిగా వెలశాయి. వీటిలో సగానికి పైగా ఈసీ లేదని తెలుస్తోంది. ఒక వేళ ఈ సీ ఉన్నా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వీటి నుంచి నిత్యం వెలువడే కాలుష్యంతో స్థానికంగా ఉన్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రధానంగా ఈ కాలుష్య ప్రభావం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పంటలపై కూడా పడుతోంది. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గుముఖం పడుతోంది. అంతే కాకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలకు వివిధ అనారోగ్య సమస్యల వస్తున్నాయి. దీంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా నెల్లూరు చుట్టుపక్కల వెలసిన రైసు మిల్లులు, వివిధ ఫ్యాక్టరీలు, క్రషర్స్‌తో నెల్లూరు పట్టణంపై కూడా పర్యావరణ ప్రభావం పడుతోంది.

అధికార పార్టీ అండతో
చాలా వరకు పెద్దపెద్ద పరిశ్రమలు, మైన్స్‌ నిర్వహణ మొత్తం అధికార పార్టీ నేతల అనుచరులే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఒక మంత్రికి చెందిన మైన్స్‌ కూడా ఉన్నాయి. పలు ఫ్యాక్టరీలు, రైసుమిల్లుల విషయం చెప్పనక్కర్లేదు. అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి చెందిన రైసు మిల్లులు, ఆయన అసోసియేషన్‌కు కూడా అధ్యక్షుడిగా ఉండటంతో వాటికి అనుమతి లేకున్నా ఉన్నా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి నెలకొంది. సంబంధిత శాఖ, కార్పొరేషన్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఏదో మొక్కబడిగా దాడులు చేసి వదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడులు వస్తుండటంతో తనిఖీలు చేసిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసీ లేకుండా నిర్వహించే మైన్స్, ఫ్యాక్టరీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

100 మైన్స్‌కు అనుమతి లేని వైనం

ప్రధానంగా జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, రాపూరు, గూడూరురూరల్, పెళ్లకూరు మండలాల్లో 170 మైన్స్‌ ఉన్నాయి. వీటిలో 100 మైన్లకు ఈసీ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇవి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు న్యాయ స్థానం దృష్టికి కూడా పోవడంతో వీటి నిర్వహణపై కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈసీ లేకుండా నిర్వహించిన యజమానుల నుంచి చట్టం ప్రకారం అపరాధ రుసుం వసూలు చేసి, అనంతరం సర్టిఫికెట్‌ తీసుకున్న తరువాత పనులు చేసుకోవాలని కూడా ఆదేశాలు జారి చేసినట్లు సమాచారం. దీంతో ఈసీ లేకుండా నిర్వహిస్తున్న మైన్స్‌ వివరాల సేకరణలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

ఈ నెలలోనే ఈసీ లేని మైన్స్‌పై చర్యలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈసీ లేని వాటిపై చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎటువంటి మైన్‌ లేదా ఫ్యాక్టరీ అయినా స్థానికంగా ఉన్న  ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూడాలి. ప్రజలకు పర్యావరణం వల్ల ఇబ్బంది కలిగే విధంగా నడుపుతున్న వాటిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పలు మైన్స్‌కు ఈసీ లేదు. కొన్ని యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుని ఉన్నాయి. అదే విధంగా ఫ్యాక్టరీలు, రైసుమిల్లులు ఈసీ లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. –ప్రమోద్‌కుమార్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top