అంగన్‌వాడీ..అయోమయం | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ..అయోమయం

Published Sat, Jul 7 2018 1:16 PM

Eggs Distribution Stops In Mangalagiri Anganwadi Centers Guntur - Sakshi

తాడేపల్లిరూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో అధికారుల అలసత్వం వల్ల అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా  కేంద్రాల ద్వారా అందాల్సిన పౌష్టికాహారానికి చిన్నారులు, గర్భిణులు, బాలింతలు దూరమవుతున్నారు.  వివరాల్లోకి వెళితే...మంగళగిరి అంగన్‌వాడీ సెక్టార్‌లో తరచూ ఏదో ఒక  ఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరుగుతుందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మంగళగిరి సెక్టార్‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో సగంపైగా కేంద్రాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పౌష్టికాహారంలో ఒకటైన కోడిగుడ్డు అందటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరైనా అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ విషయాన్ని బయటకు తెలియజేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో కేంద్రానికి నెల రోజులు నుంచి కోడిగుడ్లు అందడంలేదు. దీనిపై అధికారులను ప్రశ్నించడంతో అలాంటిది ఏమీ లేదు, మొదటి వారంలో రావాల్సిన కోడిగుడ్లు రాలేదంటూ మాట దాటవేశారు. మంగళగిరి మండల పరిధిలో ఆత్మకూరు, పెదవడ్లపూడి, చినకాకానితో పాటు మరికొన్ని ప్రాం తాల్లో కోడిగుడ్లు అందలేదని, తల్లితండ్రులు, గర్భిణులు తెలిపినట్లు చెప్పడంతో కాంట్రాక్టరు లోపం వల్ల గుడ్లు పంపిణీ చేయలేదని తెలియజేశారు. సదరు కాంట్రాక్టరుపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడగ్గా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని సమాధానం ఇస్తున్నారు.

తప్పు కప్పిపుచ్చుకుంటున్న ఐసీడీఎస్‌ అధికారులు : మంగళగిరి ప్రాంతంలో కోడిగుడ్లు ఎందుకు అందలేదని పలువురు అధికారులను విచారించగా, ఇండెంటు పెట్టే సమయంలో అధికారులు తప్పు చేయడం వల్లే కోడిగుడ్లు అందలేదని, తిరిగి మరలా నెలరోజుల తర్వాతే ఇండెంటు పెట్టడానికి కుదురుతుందని తెలియజేశారు. మంగళగిరి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ భారతీదేవిని వివరణ కోరగా, శ్రీమారుతి అగ్రి సంస్థ వారు కోడిగుడ్లను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారని, వారు తీసుకురాలేదంటూ సమాధానం ఇచ్చారు. మారుతి అగ్రి యజమాని రాజేష్‌ను వివరణ కోరగా, మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని మండలాల్లో మాకు ఇచ్చిన ఇండెంటు వరకు గుడ్లను సరఫరా చేశామని, ఈ నెల మాత్రం రెండు రోజులు ఆలస్యం అయిందని, రేపు సాయంత్రం కల్లా అన్ని కేంద్రాల్లో కోడిగుడ్లను అందజేస్తామని తెలిపారు.

గుడ్లు రావడం లేదంటున్నారు
గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి నెలా అంగన్‌వాడీ టీచర్‌ గుడ్లు ఇచ్చే వారు. డెలివరీ అయిన తర్వాత ఒక వారం ఇచ్చారు. గత నెల నుంచి గుడ్లు రావడం లేదని అంగన్‌వాడీ టీచర్‌ తెలియజేశారు. రోజూ అడిగినా అదే మాట చెబుతున్నారు. చేసేది లేక  ఇచ్చినప్పుడే తీసుకుం దామని వదిలేశాం.–సంకురు లక్ష్మీప్రసన్న, బాలింత

ఇంటికొచ్చి తీసుకెళ్లమనేవారు..
ప్రతి వారం టీచర్‌ ఇంటికి వచ్చి గుడ్లు తీసుకువెళ్లండని చెప్పేవారు. నెల రోజుల నుంచి మాత్రం మేం అడిగినా గుడ్లు ఇవ్వడం లేదు. ఈ నెల గుడ్లు రాలేదని చెబుతున్నారు. శుక్రవారం పాఠశాలకు వెళ్లి టీచర్‌ను అడగడంతో రెండు మూడు రోజుల్లో ఇస్తామని చెప్పారు. నెల రోజుల గుడ్లు ఇస్తారో, ఈ వారంరోజుల్లో గుడ్లు ఇస్తారో తెలియదు. –పల్లపు శ్రీలక్ష్మి

Advertisement
Advertisement