దరఖాస్తు చేయండి.. ఫలితం ఆశించకండి! | dr. b.r.ambedkar exams are not conducting in proper way | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేయండి.. ఫలితం ఆశించకండి!

Dec 21 2013 3:42 AM | Updated on Sep 18 2019 2:55 PM

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ అధ్వానం గా ఉంది. ముఖ్యంగా కీలకమైన రీవాల్యుయేషన్ విషయంలో జరుగుతున్న అనుచిత జాప్యంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.

 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ అధ్వానం గా ఉంది. ముఖ్యంగా కీలకమైన రీవాల్యుయేషన్ విషయంలో జరుగుతున్న అనుచిత జాప్యంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. రీవేల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాక ఆ విషయం మరచిపోవాల్సి వస్తోందని అంటున్నారు. డిగ్రీ, పీజీ.. రెండింటి పరిస్థితీ ఇలాగే ఉంది. ఫలితాలపై అనుమానమున్నవారు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. అటువంటి వారికి నిర్ణీత కాలవ్యవధిలో ఫలితాన్ని ప్రకటించాలి. కానీ నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఆ విషయమై కనీస సమాచారం అందడం లేదు. సంబంధిత సెక్షన్‌కు నేరుగా వెళ్లి అడిగినా సరైన స్పందన లభించ దు. ఎప్పుడో ఒకప్పుడు వస్తుందిలే.. అంటూ అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తారు. పరిస్థితి దారుణంగా ఉన్నా యూనివర్సిటీ అధికారులు సైతం స్పందించడం లేదు. ఫలి తంగా డిగ్రీ, పీజీ పేపర్ల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసిన ఎంతోమంది విద్యార్థులు వర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆనుభవం ఉన్న వారిని, ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన సీనియర్లను ఈ సెక్షన్‌లో నియమించారు. అలాగే డిగ్రీ పరీక్షలకు ప్రత్యేకాధికారిని
 నియమించారు. అయినా తీరు మారడంలేదు.
 
 అవకాశాలు కోల్పోతున్నారు
 ఎల్‌ఎల్‌బి థర్డ్ సెమిస్టర్ రాసిన ఒక విద్యార్థి మొదటి సెమిస్టర్‌లో ఒక పేపర్ ఫెయిల్ అయ్యాడు. ఫలితం వచ్చిన 15 రోజుల్లోనే ఆ పేపర్ రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇది జరిగి ఏడాదైంది. మూడో సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. రీ వాల్యుయేషన్ మార్కుల మెమో మాత్రం రాలేదు. ఇది ఈ ఒక్క విద్యార్థి సమస్య కాదు. వందలాది మంది విద్యార్థులు ఇదే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. తక్కువ మార్కుల తేడాతో ఫెయిల్ అయిన వారు, ఒక సబ్జెక్టులో తప్పినవారు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకొని, ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. రీవాల్యుయేషన్‌లోనూ పాస్ కాకపోతే సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే సకాలంలో ఫలితం అందక  సప్లిమెంటరీ రాసే అవకాశం కోల్పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పేపర్ రీ వాల్యుయేషన్‌కు రూ.500 ఫీజు వసూలు చేస్తున్నారు. సప్లిమెంటరీ లోపు ఫలితం ప్రకటించాల్సి ఉంటుంది. అయితే నెలలు, సంవత్సరాల తరబడి జాప్యం చేస్తున్నారు.
 
 దృష్టి సారిస్తాం
 ఈ అంశంపై రిజస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ అంశంపై దృష్టి పెడతామన్నారు. దీనికి సంబంధించి త్వరలో ఒక షెడ్యూల్ రూపొందించి, అమలు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement