నిర్లక్ష్యపు పొర కమ్మేసింది! | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు పొర కమ్మేసింది!

Published Mon, Jun 25 2018 11:26 AM

Doctors Negligance In Kurnool Eye Hospital - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి రాయలసీమలోనే అతి పెద్దది. పెద్ద పెద్ద డాక్టర్లు, వైద్య విద్యార్థులు, అంతే స్థాయిలో నర్సులు ఉన్నా బాధితులకు సరైన వైద్యం అందడం లేదు. ఇక్కడికి వచ్చే వారికి తూతూ మంత్రంగా వైద్యం అందించి ఆపరేషన్లు వాయిదా వేయడంతో ప్రజలు నాటు వైద్యంవైపు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా నాటు వైద్యాన్ని చేయించుకునేందుకు వెళ్లిన వారిలో ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై  తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. కర్నూలులో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి రాయలసీమ ప్రాంతానికే తలమానికం. నాలుగు యూనిట్లలో నలుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 8 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 10 మంది వరకు పీజీ వైద్యులు, 30 మంది వరకు పారా మెడికల్‌ సిబ్బంది ఈ విభాగం సొంతం.

అన్ని రకాల కంటి సమస్యలకు ఇక్కడ అధునాతన వైద్యం లభిస్తుందని ఆశించి దూర ప్రాంతాల నుంచి పేదలు చికిత్స కోసం వస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలో వైద్యులు చికిత్స చేస్తుండగా, ఆ మరుసటి రోజున అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారు. ప్రతి ఆపరేషన్‌ థియేటర్‌ రోజున ఒక్కో యూనిట్‌ పాల్పంచుకుంటుంది. దాదాపుగా అన్ని రకాల కంటి జబ్బులకూ ఇక్కడ వైద్యం చేసేందుకు పదేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేసి పంపించింది. ఇటీవల సైతం డీఎంఈ కార్యాలయం నుంచి వైద్యపరికరాలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయాల్సిన బాధ్యత ఇక్కడి వైద్యబృందంపై ఉంది. 

తూతూ మంత్రంగా ఆపరేషన్లు..  
ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని సాధించిన ఈ ఆసుపత్రిలో అత్యధికంగా కంటి శుక్లాల  ఆపరేషన్లు మాత్రమే నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇతర కంటి జబ్బులు, కంటి గాయాలకు అత్యాధునిక పద్ధతిలో శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉన్నా ఇక్కడి వైద్యులు పెద్దగా స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు 5 నుంచి 10లోపు ఆపరేషన్లు మాత్రం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఆసుపత్రిలోని మంచాలు నిత్యం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.


విసిగి వేసారి
నాటు వైద్యం వైపు !
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేస్తారని ఎంతో ఆశగా వస్తున్న రోగులకు ఇక్కడ నిరాశే ఎదురవుతోంది. రోగులను పరీక్షించిన వైద్యులు మందులు ఇచ్చి మళ్లీ రావాలంటూ తిప్పి పంపిస్తున్నారు. ఇలా నాలుగైదు సార్లు తిరిగి వేసారిన రోగులు చివరకు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు, సి. బెళగల్, కర్నూలు రూరల్‌ గ్రామాల ప్రజలు ఇటీవల నాటు వైద్యం వైపు చూస్తున్నారు. మహానందిలో దేవాలయం వద్ద ఓ వ్యక్తి కంట్లో పసురు వేస్తే కంట్లో పొర పోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆటోలను మాట్లాడుకుని రోగులు మహానందికి వెళ్లి వస్తున్నారు. ఇలా వెళ్లి ఆదివారం ఉదయం సోమయాజులపల్లి గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఇందులో 9 మంది చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందితే తాము నాటు వైద్యం కోసం ఎందుకు వెళ్తామని క్షతగాత్రులు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
Advertisement