నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వాడొద్దని, ఎవరైనా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఫుడ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మహ్మద్ అయాజ్, జగదీశ్వర్‌గౌడ్ హెచ్చరించారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వాడొద్దని, ఎవరైనా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఫుడ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మహ్మద్ అయాజ్, జగదీశ్వర్‌గౌడ్ హెచ్చరించారు. నిషేధిత పాలిథిన్ కవర్లపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో టిఫిన్ సెంటర్, మిల్క్ సెంట ర్ల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వం కొన్ని ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించిందని తెలిపారు. నిషేధిత కవర్లు వాడితే పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఈ కవర్లతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. వీటిని తినడం ద్వారా ఆవులు, గేదెలు చనిపోతాయని, ఇవి భూమిలో కొన్ని లక్షల సంవత్సరాలు నిల్వ ఉంటాయని పేర్కొన్నారు.
40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు వాడే వారికి రూ.250 నుంచి రూ.500, విక్రయించే దుకాణదారులకు రూ.2500 నుంచి రూ.5000 జరిమానా విధించి పర్యావరణ చట్టం 1986 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ వారం ఆయా వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి నిషేధిత ప్లాస్టిక్ కవర్లపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. వీటికి సంబంధించిన ఫ్లెక్సీలను మిల్క్, టిఫిన్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు.