
మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటి నవ్య నాయర్‌కి ఆస్ట్రేలియాలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూరెడు మల్లెపూలు.. అదీ బ్యాగులో ఉన్నందుకే ఆమెకు ఆ ఫైన్ పడింది. ఈ చేదు అనుభవంపై ఆమె సైటైర్లు వేసుకుంటోంది కూడా. అయితే..
ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టుకు ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాంగా పేరుంది. కేవలం మల్లపూలే కాదు.. మరికొన్ని వస్తువులను కూడా అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని మీకు తెలుసా?..
ఓనం ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన మల్లూ బ్యూటీ నవ్య నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన తండ్రి తచ్చిన మల్లెపూల మూరను ఆమె బ్యాగులో ఉంచుకుని ఎయిర్‌పోర్టులో దిగారు. అయితే.. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడి అధికారులు ఆమెకు రూ.1.14లక్షల జరిమానా వేశారు. 28 రోజుల్లో ఆ జరిమానా కట్టాలని ఆమెకు స్పష్టం చేశారు.

మల్లెపూల తరహాలో మూరెడున్న వంద కేటగిరీల వస్తువులపై అక్కడ నిషేధం అమల్లో ఉంది. అందులో.. తాజా, ఎండిన పూలు, తాజా పండ్లు, కూరగాయలు, మూలికలు, మసాలా దినుసులు, గింజలు, పాల సంబంధిత ఉత్పత్తులు, బర్ఫీ.. రసగుల్లా, రసమలై, గులాజ్‌జామూన్, మైసూర్ పాక్, సోన్‌పాపిడి ఇలా.. స్వీట్లు, బియ్యం, టీ, ఇంటి భోజనం, తేనే, పెంపుడు జంతువుల ఆహారం.. ఈకలు, ఎముకలు, చర్మం (సంబంధిత వస్తువులు కూడా!), చెట్లు.. జంతువుల నుంచి తయారు చేసిన మందులు, చివరకు.. విమాన, నౌకల ప్రయాణాల నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా అనుమతించరంతే.
ప్రయాణికులు వీటిని తీసుకెళ్లడం అక్కడ నిషిద్ధం. వాటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. పైగా వాటి వల్ల పర్యావరణానికి హాని అని భావిస్తున్నారు. చివరకు.. మన పండుగలు పబ్బాలు ఉన్నాయని విజ్ఞప్తులు చేసుకున్నా కూడా వాళ్లు వినరు. అయితే మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్‌కు మాత్రం ఎందుకనో అనుమతిస్తారు!.

నవ్య మెల్‌బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్‌లో మల్లెపూలును తీసుకువచ్చినందుకు జరిమానా విధించారు. అనంతరం మెల్‌బోర్న్‌లో జరిగిన ఓనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటి నవ్య తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను తీసుకువచ్చిన పూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించేవరకు తనకు తెలియదని చమత్కరించింది. కానీ,
ఆస్ట్రేలియా సరిహద్దుల్లో నిషేధిత వస్తువులపై కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల ప్రకారం.. నిషేధిత/ప్రకటించని వస్తువులు (ఆహారం, మొక్కలు, జంతు ఉత్పత్తులు, ఔషధాలు) సరిహద్దులో పట్టుబడితే.. వెంటనే వాటిని ధ్వంసం చేస్తారు. ప్రయాణికులకు తక్షణ జరిమానాలు విధిస్తారు. విషయం తీవ్రమైందిగా భావిస్తే.. వీసా రద్దు చేస్తారు. మరింత తీవ్రమైందిగా అనుకుంటే.. తీవ్ర ఉల్లంఘనల కింద పరిగణించి జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ప్యాసింజర్ కార్డులో వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి. అప్పుడు.. అనుమతించని వస్తువులు తీసేసినా జరిమానా ఉండదు. లేకుంటే.. నవ్య నాయర్‌లా 15 సెం.మీ. మల్లెపూలకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

నవ్యా నాయర్(ధన్య వీణ) 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుశా జిల్లాలో జన్మించారు. 2001లో ఇష్టం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు, ప్రధానంగా మలయాళ సినిమాల్లో.. ఆడపా దడపా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో జంటగా నటించిన నందనం అనే సినిమాలో నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ పొందిన నర్తకి, పలు స్టేజ్ షోలు కూడా చేశారు. 2010లో వ్యాపారవేత్త సంతోష్ మెనన్ను వివాహం చేసుకున్నారు.. ఈ జంటకు ఓ కుమారుడు. యాక్టింగ్‌తో పాటు టీవీ షోలు, రచనల ద్వారా కూడా ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంటున్నారు.