ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని విద్యార్థులను బలవంత పెట్టొద్దు  | Do not force students to participate in government programs | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని విద్యార్థులను బలవంత పెట్టొద్దు 

Apr 26 2019 12:48 AM | Updated on Apr 26 2019 12:48 AM

Do not force students to participate in government programs - Sakshi

సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, రాజ్యాంగంలోని అధికరణ 51ఏలో నిర్దేశించిన కార్యక్రమాలు మినహా, మిగిలిన ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనాలంటూ పాఠశాల, కళాశాల విద్యార్థులను బలవంతం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని తీరాలంటూ ఒత్తిడి చేయడమంటే వారిని నిర్బంధ ప్రేక్షకులుగా మార్చడమేనని, రాజ్యాంగం వారికి ప్రసాదించిన హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేసింది. బలవంతం మీద విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అవాంఛనీయ ఘటన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించి, ఆ విద్యార్థులు లేదా వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.

పాఠశాలల వెలుపల నిర్వహిస్తున్న ర్యాలీలు, ధర్నాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్న కార్యక్రమాల్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను బలవంతంగా పాల్గొనేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తూ విద్యార్థుల హక్కులను కాలరాస్తోందంటూ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రామకృష్ణ గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వనం–మనం కార్యక్రమానికి విద్యార్థులను తీసుకెళుతుండగా 2018 జూలై 14న తూర్పుగోదావరి జిల్లా, పశువులంక వద్ద పడవ ప్రమాదం జరిగి 6 విద్యార్థులు మృతి చెందా రని తెలిపారు. పాఠశాలల వెలుపల నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని, ఇది వారి హక్కులను హరించడమేనన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. హరినాథ్‌రెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పాఠశాల వెలుపల నిర్వహిస్తున్న కార్యక్రమానికి తీసుకెళ్లడం వల్లే ఆ విద్యార్థులు మృతి చెందారంది. 

నేతల ప్రాపకం కోసం ...: ‘స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగంలోని అధికరణ 21 ఈ దేశ పౌరులకు కల్పిస్తోంది. అయితే ప్రభుత్వం వనం–మనం కార్యక్రమానికి విద్యార్థులను వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకెళ్లడం ద్వారా వారి హక్కులను హరించింది. అలాగే సెలవు రోజున విశ్రాంతి తీసుకునేందుకు పిల్లలు అర్హులు. ప్రభుత్వం ఆ హక్కునూ కాలరాసింది. దీనివల్ల విద్యార్థులు మానసిక, శారీరక అలసటకు గురయ్యారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల జీవితాలు ప్రమాదంలోకి వెళ్లాయి. రాజకీయ బాసుల ప్రాపకం కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులను చూపించేందుకు అధికారులు చూపిన అత్యుత్సాహం ఆరుగురి ప్రాణాలు బలిగొంది.’ అని ధర్మాసనం పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement