వర్లకే అలా..ఇక మనకెలా! 

Discussion Among Leaders Of SC Communities On TDP Situation - Sakshi

నాడు పామర్రు, నేడు రాజ్యసభ 

2009లో తిరుపతిలోనూ అలానే.. 

టీడీపీ ఎస్సీ నాయకుల్లో అంతర్మథనం 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పార్టీకి విధేయుడు, సీనియర్‌ నాయకుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకే ఇలా జరిగితే పార్టీలోని ఇతరుల పరిస్థితిపై టీడీపీలోని ఎస్సీ వర్గాల నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. 2016లోనూ మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడైన జేఆర్‌ పుష్పరాజ్‌ను రాజ్యసభకు పంపుతున్నట్లు చివరి నిమిషం వరకు చెప్పి మోసం చేయడాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు గుర్తుచేస్తున్నారు. దళిత నాయకులు, కార్యకర్తలు జెండాలు మోయడానికి, పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ పదవులు కట్టబెట్టడానికి తప్ప అధికార పదవుల విషయంలో ఎన్నడైనా ప్రాధాన్యమిచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా పేద వర్గాలతో ఆడుకోవడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని సీనియర్‌ నాయకులు గుర్తుచేస్తున్నారు.

అధిష్టానం వర్ల రామయ్యకు మూడు పర్యాయాలు అగౌరపరిచింది. ఎన్నికల బరిలో తలపడిన ప్రతిసారీ చివరకు అనుయాయులు  అయ్యో! రామయ్య!!  అనే సానుభూతిని మిగిల్చింది.  
గుంటూరు జిల్లా గురజాల ప్రాంతానికి చెందిన వర్ల రామయ్య పోలీసు శాఖకు రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉద్యోగ రీత్యా కృష్ణా జిల్లాలో పనిచేసినందున విస్తృత పరిచయాలు ఉన్నాయని, రిజర్వుడు స్థానం నుంచి పోటీకి అవకాశం కలి్పంచాలని అధిష్టానాన్ని కోరినప్పుడు 2009 సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆఖరు నిమిషంలో ఆదేశించారు. తిరుపతిలో అన్నీ తానే చూసుకుంటానంటూ భరోసా ఇచ్చి సాగనంపారు. ఆ ఎన్నికల్లో వర్ల ఓటమి పాలయ్యారు.  
2014 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్టు ఆశించిన రామయ్య తన సామాజిక వర్గం, విస్తృత పరిచయాలు ఉన్నందున నందిగామ, తిరువూరుల్లో ఏదో ఒక స్థానం కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. కాని పామర్రులో పోటీకి దింపారు. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుకు నియోజకవర్గ పరిధిలో సానుకూల ఓట్లు రాగా వర్ల ఓటమి పాలయ్యారు.  
2019లో ఏకంగా టిక్కెట్టుకే ఎగనామం పెట్టారు. వైఎస్సార్‌ సీపీ నుంచి కొనుగోలు చేసిన ఉప్పులేటి కల్పనకు పామర్రు టికెట్టు ఇచ్చిన సంగతి తెలిసిందే.  
పార్టీకి తగినంత బలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల బరిలోకి వర్లను దింపి ముచ్చటగా మూడోసారి ఓటమిని మూటకట్టుకునేలా ఆయన పేరిట రికార్డు చేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో వర్ల రామయ్యకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి మాత్రం దక్కింది.  

స్వామిదాసు కుటుంబానికీ మొండిచేయి.. 
తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు ఆ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వలేదు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన తన సతీమణి నల్లగట్ల సుధారాణికి అయినా టికెట్‌ ఇవ్వాలని స్వామిదాసు కోరారు. కానీ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కె.ఎస్‌.జవహర్‌ను తిరువూరు నుంచి పోటీ చేయించారు.  
గుంటూరు జిల్లాకు చెందిన జేఆర్‌ పుష్పరాజ్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, రెండు పర్యాయాలు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 రాజ్యసభ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఆశపెట్టి టీజీ వెంకటేశ్‌కు ఆ సీటును కట్టబెట్టారు. భారీ మొత్తం తీసుకునే టీజీకి సీటిచ్చారనే విమర్శలు అప్పట్లో తీవ్రంగా వచ్చిన సంగతి తెలిసిందే.  
గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి మధ్యలో తొలగించారు. అవినీతి ఆరోపణలు వస్తున్నాయని సాకుగా చూపారు. పశి్చమగోదావరి జిల్లాకు చెందిన రిజర్వుడు వర్గానికి చెందిన పీతల సుజాతను కూడా మధ్యలోనే మంత్రి పదవి నుంచి పక్కనపెట్టేశారు. అదే మంత్రి వర్గంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు పట్టించుకోలేదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఎన్ని అరాచకాలు చేసినా తన సామాజికవర్గం అయినందున చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top