రాష్ట్ర విభజన యత్నాల నేపధ్యంలో సీనియర్ పోలీస్ అధికారి, రాష్ర్ట ప్రత్యేక పోలీసు విభాగం(ఏపీఎస్పీ) డీఐజీ షేక్ మహ్మద్ ఇక్బాల్ శుక్రవారం సాయంత్రం మరోసారి రాజీనామా చేశారు.
నెల రోజులుగా రాష్ట్రంలో పరిణామాలతో మనస్థాపం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన యత్నాల నేపధ్యంలో సీనియర్ పోలీస్ అధికారి, రాష్ర్ట ప్రత్యేక పోలీసు విభాగం(ఏపీఎస్పీ) డీఐజీ షేక్ మహ్మద్ ఇక్బాల్ శుక్రవారం సాయంత్రం మరోసారి రాజీనామా చేశారు. డీజీపీ దినేష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతికి రాజీనామా లేఖను అందించారు. తనకు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతివ్వాలని ఆ లేఖలో కోరారు. ‘రాయల్ తెలంగాణ’ ఏర్పాటుకు కాంగ్రెస్ యత్నాలకు నిరసనగా ఇక్బాల్ తొలుత గత నెల 28న స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేశారు.
అయితే, ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవడంతో, ఇక్బాల్ తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. ఈ పూర్వరంగంలో, ఆయన శుక్రవారం మరోసారి రాజీనామా లేఖను అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర అంశంపై గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సామాన్యులను ఇబ్బందులకు గురి చేసేవిధంగా ఉన్నందున, తీవ్ర మనస్థాపంతో తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఇక్బాల్ తన సన్నిహితులకు తెలిపారు. ఇక వెనక్కి తగ్గేది లేదన్నారు.