breaking news
sheikh muhammad iqbal
-
జగన్‌పై హత్యాయత్నం వెనుక బాబు హస్తం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం వెనుక చంద్రబాబు హస్తముందని వైఎస్సార్సీపీ నేత షేక్ మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. హత్యాయత్నం జరిగినప్పటి నుంచి చంద్రబాబు ప్రవర్తన, డీజీపీ స్టేట్మెంట్ అనేక అనుమానాలకు తావిచ్చాయన్నారు. అందుకే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాటం చేశామని చెప్పారు. ఎన్ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు జంకుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు వచ్చి నిందితుడు ఎస్సీ అని, వైఎస్సార్సీపీ అభిమాని అని, చిన్న కత్తి అంటూ ఇష్టారీతిన మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు సైతం కోడి కత్తి అంటూ అవహేళన చేశారని గుర్తు చేశారు. వీరిద్దరూ ఒకరి వెంట ఒకరు వెనువెంటనే స్పందించిన తీరు, ప్రవర్తనతో తమ అనుమానం బలపడిందన్నారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక.. ఆపరేషన్ గరుడ పేరుతో హత్యాయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా నాయకుడైన వైఎస్ జగన్‌ను ఫినిష్ చేయాలని కుట్ర పన్నారన్నారు. నిందితుడు శ్రీనివాసరావు పనిచేసే ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల అనుచరుడని చెప్పారు. విశాఖ పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో జగన్‌పై జరిగింది హత్యాయత్నమని క్లియర్‌గా చెప్పారన్నారు. చట్టాలు చంద్రబాబుకు వర్తించవా.. లైన్ ఆఫ్ ఎంక్వైరీని చంద్రబాబు ఇచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందనే నమ్మకం ఎలా ఉంటుందని ఇక్బాల్ ప్రశ్నించారు. అందుకే కోర్టుకు వెళ్లి థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని కోరామన్నారు. చంద్రబాబు పెదరాయుడు సినిమాలో విలన్లా చట్టాలు తనకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని ఇక్బాల్ మండిపడ్డారు. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జొంగ్ ఉన్ లా ప్రవర్తిస్తున్నాడని దుయ్యబట్టారు. కుట్రలు, కుతంత్రాలు చేసి ఏమీ ఎరగనట్లు మాట్లాడటం బాబుకే చెల్లిందన్నారు. టీడీపీ.. పచ్చ కామెర్ల పార్టీ అని దుయ్యబట్టారు. అక్టోబర్‌లో ఘటన జరిగితే దాన్ని జనవరి వరకు చంద్రబాబు ప్రభుత్వం సాగదీసిందని మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు కుట్ర లేకపోతే కేసు ఎప్పుడో ఒక రూట్‌కు వచ్చేదన్నారు. ఎన్ఐఏ విచారణ కూడా జరగకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీఎస్పీ డీఐజీ ఇక్బాల్ రాజీనామా
నెల రోజులుగా రాష్ట్రంలో పరిణామాలతో మనస్థాపం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన యత్నాల నేపధ్యంలో సీనియర్ పోలీస్ అధికారి, రాష్ర్ట ప్రత్యేక పోలీసు విభాగం(ఏపీఎస్పీ) డీఐజీ షేక్ మహ్మద్ ఇక్బాల్ శుక్రవారం సాయంత్రం మరోసారి రాజీనామా చేశారు. డీజీపీ దినేష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతికి రాజీనామా లేఖను అందించారు. తనకు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతివ్వాలని ఆ లేఖలో కోరారు. ‘రాయల్ తెలంగాణ’ ఏర్పాటుకు కాంగ్రెస్ యత్నాలకు నిరసనగా ఇక్బాల్ తొలుత గత నెల 28న స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేశారు. అయితే, ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవడంతో, ఇక్బాల్ తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. ఈ పూర్వరంగంలో, ఆయన శుక్రవారం మరోసారి రాజీనామా లేఖను అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర అంశంపై గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సామాన్యులను ఇబ్బందులకు గురి చేసేవిధంగా ఉన్నందున, తీవ్ర మనస్థాపంతో తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఇక్బాల్ తన సన్నిహితులకు తెలిపారు. ఇక వెనక్కి తగ్గేది లేదన్నారు.