జవాబుదారీతనం, సేవాభావం

DGP Gautam Sawang Comments at a media conference - Sakshi

పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తాం 

మీడియా సమావేశంలో నూతన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌  

సీఎం వైఎస్‌ జగన్‌ స్ఫూర్తిదాయక లక్షాలు నిర్దేశించారు 

అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పనిచేయాలన్నారు 

పోలీసు కుటుంబాల సంక్షేమానికీ ప్రాధాన్యత ఇస్తామన్నారు 

ఇలాంటి ముఖ్యమంత్రులు ఒక్కరిద్దరినే చూశా 

మార్పు కోరిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాం 

మహిళలు, పిల్లలు, వృద్ధులపై నేరాలను అరికట్టేందుకు చర్యలు  

సైబర్, ఆర్థిక నేరాలు, కాల్‌మనీ, బెట్టింగ్‌లపై ఉక్కుపాదం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకత, సేవాభావం, అవినీతి రహితంగా పని చేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. పోలీసు వ్యవస్థలో పారదర్శకత, సంస్కరణలు, సంస్థాగత మార్పులు అవసరమన్నారు. ఇకపై ప్రతి పోలీసు సేవను వినియోగించుకుంటామని, సవాంగ్‌ మార్కు అంటూ ఏమి ఉండదని.. సమర్థతకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. డీజీపీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై పూర్తి విశ్వాసం ఉంచి డీజీపీగా నియమించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తాను సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. దేశ, విదేశాల్లోని అనేక ప్రాంతాల్లో పని చేసిన తన 33 ఏళ్ల సర్వీసులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంటి స్ఫూర్తిదాయకమైన ముఖ్యమంత్రులు ఒక్కరిద్దరిని మాత్రమే చూశానన్నారు. సీఎం తనపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామన్నారు. విభజన అనంతరం గడిచిన ఐదేళ్లుగా ఏపీ పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి పోలీసుల పట్ల ఎంతో అభిమానం, గౌరవం ఉందని ఆయన మాటల్లో తనకు అర్ధమైందన్నారు. పోలీసుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామన్నారని తెలిపారు. వారాంతపు సెలవు, సిబ్బంది భర్తీ, ఆరోగ్యభద్రత తదితర అన్ని విషయాలపై సీఎం సానుకూలంగా ఉన్నారని డీజీపీ వివరించారు.  

సీఎం జగన్‌ను కలిసిన డీజీపీ  
పూర్తి స్థాయి అదనపు డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సవాంగ్‌ శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తొలుత మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం (గాడ్‌ ఆఫ్‌ ఆనర్‌) స్వీకరించారు. అనంతరం మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో వేద పండితులు డీజీపీకి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, డీజీపీగా పని చేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్‌ స్టోర్స్, పర్ఛేజ్‌ కమిషనర్‌గా బదిలీ చేయడంతో శుక్రవారమే ఆయన శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు బాధ్యతలు అప్పగించి వెళ్లారు. దీంతో రవిశంకర్‌ నుంచి సవాంగ్‌ నూతన డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, ఏడీజీలు కుమార్‌ విశ్వజిత్, హరీష్‌కుమార్‌ గుప్త, పీవీ సునీల్‌కుమార్‌లతోపాటు పలువురు ఐపీఎస్‌లు డీజీపీ సవాంగ్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సవాంగ్‌ భార్య, కుమార్తె పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

చింతమనేని కాదు..ఎవరైనా చట్ట ప్రకారం పనిచేస్తాం.. 
రాష్ట్రంలో చింతమనేనే కాదు.. ఎవరైనా సరే చట్ట పరిధిలోనే తాము వ్యవహరిస్తామని డీజీపీ సవాంగ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వేసిన అన్ని ప్రత్యేక దర్యాప్తు బృందా(సిట్‌)లపై సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, వృద్ధులపై నేరాలు పెరుగుతున్నాయని, వారి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. డ్రగ్స్, సైబర్, కాల్‌మనీ, ఆర్థిక నేరాలు తీవ్రంగా ఉన్నాయని.. క్రికెట్, ఎన్నికల బెట్టింగ్‌లను అరికట్టేందుకు పోలీసులు మరింత కష్టపడి పని చేయాలని కోరారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఏపీ మూడో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని, వాటిని తగ్గించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీని నేర రహిత, అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు అంకితభావంతో పనిచేయాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top